Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడోరౌండ్లో మెరిసిన మెద్వదేవ్
- వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్
నవతెలంగాణ-లండన్
ప్రపంచ నం.1, టాప్ సీడ్ ఆష్లె బార్టీ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ప్రీ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం అర్థరాత్రి ముగిసిన మ్యాచ్‌లో (భారత కాలమాన ప్రకారం) చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కాటెరినా సైనికోవాపై వరుస సెట్లలో విజయం నమోదు చేసింది. 6-3, 7-5తో ఆస్ట్రేలియన్ స్టార్ మూడో రౌండ్లో గెలుపొందింది. ఆరు ఏస్‌లు కొట్టిన బార్టీ.. నాలుగు బ్రేక్ పాయింట్లతో పైచేయి సాధించింది. ఐదు డబుల్ ఫాల్ట్స్‌కు పాల్పడిన సైనికోవా.. రెండు బ్రేక్ పాయింట్లే సాధించింది. పాయింట్ల పరంగా 83-68తో బార్టీ స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. 18 ఏండ్ల బ్రిటన్ యువ సంచలనం ఎమ రాడుకాను ప్రీ క్వార్టర్స్‌కు చేరుకుంది. రోమానియా అమ్మాయిపై 6-3, 7-5తో విజయం సాధించి గ్రాండ్‌స్లామ్‌లో ఘనమైన ఆరంభం కొట్టింది. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్, రష్యా క్రీడాకారుడు డానిల్ మెద్వదేవ్ ముందంజ వేశాడు. గ్రాండ్‌స్లామ్ టైటిల్ విజేత మారిన్ సిలిచ్ (క్రోయేషియా)తో ఐదు సెట్ల మహా పోరులో మెద్వదేవ్ పైచేయి సాధించాడు. తొలి సెట్‌ను టైబ్రేకర్‌లో కోల్పోయిన రెండో సీడ్ మెద్వదేవ్.. రెండో సెట్‌నూ సులువుగానే చేజార్చుకున్నాడు. చావోరేవో తేల్చుకోవాల్సిన తర్వాతి సెట్లలో వరుసగా జోరందుకుని ప్రీ క్వార్టర్స్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. 6-7(3-7), 3-6, 6-3, 6-3, 6-2తో డానిల్ మెద్వదేవ్ విజయం సాధించాడు. ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియోస్ పోటీ నుంచి తప్పుకున్నాడు. 6-2, 1-6.. అనంతరం కిర్గియోస్ వాకోవర్ ఇచ్చాడు. ఫిలిక్స్ ఆగర్ (కెనడా) ముందంజ వేశాడు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో ఈ ఆదివారం విశ్రాంతి రోజు, దీంతో పోటీలేమీ జరుగులేదు. అయినా.. రోజర్ ఫెదరర్, నొవాక్ జకోవిచ్‌లు ప్రాక్టీస్ సెషన్లో చెమటోడ్చుతూ కనిపించారు. సోమవారం నుంచి ప్రీ క్వార్టర్స్ జరుగనున్నాయి.
ఫెదరర్ నిలుస్తాడా?! : వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ అంతిమ ఘట్టానికి చేరువవుతోంది. భిన్న పార్శ్యాల్లో రోజర్ ఫెదరర్, నొవాక్ జకోవిచ్‌లు చోటుచేసుకున్నారు. దీంతో సహజంగానే ఫైనల్లో జకోవిచ్, ఫెదరర్ పోటీపడతారనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్రెంచ్ ఓపెన్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌ను ఓడించి, కెరీర్ 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన జకోవిచ్‌కు భీకర ఫామ్‌లో ఉన్నాడు. పారిస్‌లో మధ్యలోనే గుడ్‌బై చెప్పేసిన ఫెదరర్.. పచ్చిక కోర్టుపై దృష్టి సారించాడు. వింబుల్డన్‌లో తిరుగులేని రికార్డు కలిగిన ఫెదరర్ 2019లో జకోవిచ్‌కు ఐదు సెట్ల ఫైనల్లో గ్రాండ్‌స్లామ్ కోల్పోయాడు. ఈ ఏడాది ఆ ఫైనల్ రిపీట్ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉన్నాడు. కానీ, ఫెదరర్ ముందుగా డానిల్ మెద్వదేవ్ (రష్యా), అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)లను అధిగమించాల్సి ఉంది. రోజర్‌కు క్వార్టర్స్‌లో మెద్వదేవ్, సెమీస్‌లో జ్వెరెవ్ ఎదురు కానున్నారు. నాలుగో సీడ్ జ్వెరెవ్, రెండో సీడ్ మెద్వదేవ్ గ్రాండ్‌స్లామ్ వేటలో కఠోరంగా శ్రమిస్తున్నారు. ఫిట్నెస్ స్థాయిలు తగ్గినా.. అనుభవం, అద్వితీయ ఆటతో ఫెదరర్ సవాల్ విసురుతున్నాడు. ప్రీ క్వార్టర్స్‌లో ఇటలీ ఆటగాడు లోరెంజోను ఎదుర్కొనున్న ఫెదరర్.. తర్వాత వరుసగా మూడు మెగా మ్యాచులకు సిద్ధం కావాల్సి ఉంటుంది!. మరోవైపు నొవాక్ జకోవిచ్‌కు పెద్దగా పోటీ లేదు. ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా), ఎనిమిదో సీడ్ రాబర్ట్ బటిస్టా ఆగట్ (స్పెయిన్)లు మాత్రమే జకోవిచ్‌కు కాస్త పోటీ ఇవ్వగలరు.
ఇక స్టేడియం నిండుగా.. : వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో నేటి నుంచి వంద శాతం సామర్థ్యంతో అభిమానులను అనుమతించనున్నారు. బ్రిటన్ ప్రభుత్వం నిబంధనల మేరకు వింబుల్డన్‌లో ఇప్పటివరకు 50 శాతం సామర్థ్యం వరకే అభిమానులను అనుమతించారు. ఆంక్షలు ఎత్తివేయటంతో నేడు మహిళల సింగిల్స్ తొలి మ్యాచ్ నుంచి స్టేడియంలో వంద శాతం అభిమానులకు అనుమతిస్తున్నట్టు వింబుల్డన్ నిర్వాహకులు ప్రకటించారు. దీంతో నేడు సెంటర్ కోర్టులో 15,000 మంది కనువిందు చేయనున్నారు. కోవిడ్ మహమ్మారితో 2020 మార్చిలో క్రీడా మైదానాల్లో అభిమానుల హాజరుపై ఆంక్షలు విధించిన బ్రిటన్.. పూర్తి స్థాయిలో అభిమానులకు తలుపులు తెరవటం ఇదే ప్రథమం.