Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్యదర్శి, ఉపాధ్యక్షుడు సహా ఐదుగురిపై సస్పెన్షన్
- అంబుడ్స్‌మన్ జస్టిస్ దీపక్ వర్మ ఆదేశం
నవతెలంగాణ, హైదరాబాద్ :
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) రాజకీయం వేడెక్కుతోంది. అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్‌పై సస్పెన్షన్ విధిస్తూ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోగా... ఆ నిర్ణయాన్ని అజార్ అంబుడ్స్‌మన్ వద్ద సవాల్ చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించిన ఐదుగురు అపెక్స్ కౌన్సిల్ సభ్యులపై తాత్కాలిక సస్పెన్షన్ విధిస్తూ అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ జస్టిస్ దీపక్ వర్మ ఆదివారం మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వ్యులు వెలువడే వరకు హెచ్‌సీఏ ఆఫీస్ బేరర్లుగా, అపెక్స్ కౌన్సిల్ సభ్యులుగా ఈ ఐదుగురు విధులు నిర్వర్తించడానికి వీల్లేదని అంబుడ్స్‌మన్ ఆదేశించారు. ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, కార్యదర్శి ఆర్. విజయానంద్, సంయుక్త కార్యదర్శి నరేష్ శర్మ, కోశాధికారి సురేందర్ అగర్వాల్, కౌన్సెలర్ పి. అనురాధలు తాత్కాలిక సస్పెన్షన్‌కు గురయ్యారు. అధ్యక్షుడిగా మహ్మద్ అజహరుద్దీన్‌ను తొలగించే అధికారం అపెక్స్ కౌన్సిల్‌కు లేదని, ప్రెసిడెంట్ అజార్ విధులు నిర్వర్తించేందుకు అంబుడ్స్‌మన్ క్లియరెన్స్ ఇచ్చారు.
హైదరాబాద్ క్రికెట్ సంఘం వార్షిక సర్వ సభ్య సమావేశంలో అంబుడ్స్‌మన్‌గా జస్టిస్ దీపక్ వర్మ నియామకంపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఎజీఎంకు అధ్యక్షత వహించిన అజహరుద్దీన్ అంబుడ్స్‌మన్‌గా దీపక్ వర్మను ప్రకటించగా.. అపెక్స్ కౌన్సిల్‌లోని ఇతర సభ్యులు అంగీకారం తెలపలేదు. దీంతో ఏజీఎం ఆమోదం తెలపని అంబుడ్స్‌మన్ జస్టిస్ దీపక్ వర్మకు తమను సస్పెండ్ చేసే అధికారం లేదని సస్పెన్షన్‌కు గురైన సభ్యులు వాదిస్తున్నారు.
దేశవాళీ క్రికెట్ సీజన్ షెడ్యూల్ విడుదల కావటంతో హెచ్‌సీఏలో ఆధిపత్య పోరు మరోసారి క్రికెట్‌ను నాశనం చేసేందుకు సిద్ధమవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.