Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిథాలీ రాజ్ అత్యధిక పరుగుల రికార్డు
- ఇంగ్లాండ్ సిరీస్‌లో హ్యాట్రిక్ అర్థ సెంచరీలు
నవతెలంగాణ క్రీడావిభాగం
11 టెస్టులు, 217 వన్డేలు, 89 టీ20లు.. 10,337 పరుగులు. ఇదీ అంతర్జాతీయ మహిళల క్రికెట్లో మిథాలీ రాజ్ గణాంకాలు. 22 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఆటపోట్లు చవిచూసిన హైదరాబాదీ క్రికెటర్ తాజాగా అత్యుత్తమ రికార్డును అందుకుంది. ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో అజేయంగా 75 పరుగుల కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో భారత్‌కు విజయాన్ని అందించిన మిథాలీరాజ్.. ఆ క్రమంలోనే అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పింది. ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం చార్లెట్ ఎడ్వర్డ్స్ (10273)ను మిథాలీ రాజ్ అధిగమించింది. 14 ఏండ్లకే ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన మిథాలీరాజ్.. 22 ఏండ్ల కెరీర్లో నిలకడగా రాణిస్తోంది. రెగ్యులర్‌గా సిరీస్‌లు ఉండని మహిళల క్రికెట్లో ఫామ్ నిలుపుకుంటూ, నూతన సవాళ్లను అధిగమిస్తూ వర్థమాన క్రికెటర్లకు దిక్సూచిగా నిలిచింది.
ఆల్ టైమ్ గ్రేట్? : 86 బంతుల్లో 75 నాటౌట్, 92 బంతుల్లో 59, 108 బంతుల్లో 72.. ఇవీ ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో మిథాలీరాజ్ స్కోర్లు. తొలి రెండు మ్యాచుల్లో భారత్ పరాజయం చవిచూడగా.. మూడో వన్డేలో ఇంగ్లాండ్‌కు మిథాలీ స్ట్రోక్ ఇచ్చింది. డాట్ బాల్స్ ఎక్కువగా నమోదైన సిరీస్‌లో కెప్టెన్‌గా మిథాలీరాజ్ బాధ్యత తీసుకుంది. తొలి వన్డేలో 181 డాట్ బాల్స్, రెండో వన్డేలో 188 డాట్ బాల్స్ నమోదు కాగా.. మూడో వన్డేలో అది 150 బంతులకు దిగివచ్చింది. ధనాధన్ బ్యాటర్ కాకపోయినా.. తనదైన సంప్రదాయ షాట్లతో మిథాలీరాజ్ ఎప్పుడూ పరుగుల వేటలో ముందుంటుంది. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోనూ అదే జరిగింది. సహజంగా ఇంగ్లాండ్ పరిస్థితుల్లో పరుగులు చేసేందుకు బ్యాటర్లు ఇబ్బంది పడుతుంటారు. మిథాలీరాజ్ ఇంగ్లీష్ పిచ్‌లపై అలవోకగా పరుగులు పిండుకుంటుంది. 2017 మహిళల వన్డే ప్రపంచకప్‌లో వరుసగా ఏడు అర్థ సెంచరీలతో రికార్డు సృష్టించిన మిథాలీరాజ్.. తాజాగా ఇంగ్లాండ్‌పై హ్యాట్రిక్ అర్థ సెంచరీలు బాదేసింది.
11 టెస్టుల్లో 18 ఇన్నింగ్స్‌లు బ్యాటింగ్‌కు దిగిన మిథాలీరాజ్ 44.60 సగటుతో 669 పరుగులు చేసింది. నాలుగు అర్థ సెంచరీలు సహా ఓ శతకం బాదింది. 214 పరుగుల ద్వి శతకం సైతం మిథాలీ ఖాతాలో ఉంది. 217 వన్డేల్లో 196 ఇన్నింగ్స్‌లు బ్యాటింగ్ చేసిన మిథాలీ 51.80 సగటుతో 7304 పరుగులు చేసింది. 58 అర్థ సెంచరీలు, 7 శతకాలు బాదింది. టీ20ల్లో 84 ఇన్నింగ్స్‌ల్లో (89 మ్యాచులు) 37.52 సగటుతో 2364 పరుగులు చేసింది. ఈ ఫార్మాట్లో 17 అర్థ సెంచరీలు సాధించింది. టీ20ల్లో 97 నాటౌట్ అత్యధిక స్కోరు కాగా.. వన్డేల్లో అజేయంగా 125 పరుగుల ఇన్నింగ్స్ అత్యుత్తమం.
2018 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో మిథాలీరాజ్‌ను తప్పించటం వివాదానికి దారితీసింది. కోచ్ రమేశ్ పొవార్, సీఓఏ సభ్యురాలు డయాన ఎదుల్జీపై బీసీసీఐకి లేఖ రాసిన మిథాలీరాజ్.. ఆ పార్మాట్ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం వన్డే, టెస్టు ఫార్మాట్లలోనే మిథాలీ రాజ్ ఆడుతోంది. 2003లో అర్జున అవార్డు, 2015లో పద్మ శ్రీ పురస్కారం అందుకుంది. 2017 బిబిసి 100 విమెన్ జాబితాలో చోటు సహా 2017 విజ్డెన్ లీడింగ్ విమెన్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్‌గా నిలిచింది. 22 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో తనకు తాను అంతర్జాతీయ క్రికెట్‌కు సంసిద్ధం చేసుకున్న మిథాలీరాజ్ అత్యధిక పరుగుల రికార్డు సొంతం చేసుకుని మహిళల క్రికెట్లో 'ఆల్ టైమ్ గ్రేట్' రేసులో చెరగని ముద్ర వేసింది.
ఇది సులువైన ప్రయాణం కాదు. ఎన్నో సవాళ్లు చవిచూశాను. నిష్క్రమణ ఆలోచనలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, అయినా ముందుకు సాగాను. 22 ఏండ్లుగా నా పరుగుల దాహం తీరలేదు. భారత్‌కు విజయాలు అందించే కాంక్ష ఇంకా ముగియలేదు. అత్యధిక పరుగులు చేసిన రికార్డు సాధించటం సంతోషంగా ఉంది'
- మిథాలీ రాజ్, భారత మహిళల క్రికెట్ కెప్టెన్