Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, హైదరాబాద్ :
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) రాజకీయం వీధికెక్కింది. అంబుడ్స్‌మన్ చేత సస్పెన్షన్‌కు గురైన ఐదుగురు అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు జింఖానా మైదానంలోకి అనుమతి నిరాకరించారు. జింఖానాలో అపెక్స్ కౌన్సిల్ సభ్యులు మీడియా సమావేశం ఉండగా.. గేటు వద్దే పోలీసులు అపెక్స్ కౌన్సిల్ సభ్యులను నిలువరించారు. ఏజీఎం ఆమోద ముద్ర వేయని అంబుడ్స్‌మన్ జస్టిస్ (విశ్రాంత) దీపక్ వర్మ ఏకపక్షంగా, అజహరుద్దీన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, కార్యదర్శి విజయానంద్ ఆరోపించారు. 'హెచ్‌సీఏ చరిత్రలోనే తొలిసారి అపెక్స్ కౌన్సిల్ సభ్యులను అడ్డుకున్నారు. క్రికెట్ సీజన్‌కు అపెక్స్ కౌన్సిల్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా.. అజహరుద్దీన్ ఏకపక్ష వైఖరితో అడ్డుకుంటున్నాడు. ఏజీఎం ఆమోదం లేని అంబుడ్స్‌మన్‌కు మమ్మల్ని సస్పెండ్ చేసే అధికారం లేదు. దీనిపై న్యాయస్థానంలోనే తేల్చుకుంటాం. అపెక్స్ కౌన్సిల్ నిబంధనల ప్రకారమే నడుచుకుంటోంది. అవసరమైతే రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ నెల 18న ఎస్జీఎం యథావిధిగా నిర్వహిస్తాం. అక్కడే అజహరుద్దీన్ సంగతి తేలుస్తాం' అని అధ్యక్ష, కార్యదర్శులు జాన్ మనోజ్, విజయానంద్ పేర్కొన్నారు. పోలీసులు అడ్డుకోవటంతో జింఖానా గేటు వద్దే మీడియాతో మాట్లాడిన అపెక్స్ కౌన్సిల్ సభ్యులు.. రోడ్డు పక్కనే భోజనం చేశారు.