Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టోక్యోలో భారత పతాకధారులుగా ఎంపిక
న్యూఢిల్లీ : దిగ్గజ బాక్సర్ ఎం.సీ మేరీకోమ్, మెన్స్ హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌లు టోక్యో ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో భారత పతాకధారులుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. జులై 23న ఆరంభ వేడుకల్లో మేరీకోమ్, మన్‌ప్రీత్ సింగ్‌లు భారత అథ్లెట్ల బృందానికి నాయకత్వం వహించనుండగా... ఆగస్టు 8న ముగింపు వేడుకల్లో స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా భారత పతాకధారిగా నిలువనున్నాడు. ' ఇది నాకు చివరి ఒలింపిక్స్. భారత పతాకధారిగా నిలువటం గొప్ప గౌరవం. ఆరంభ వేడుకల్లో భారత జట్టును నడిపించే అవకాశం దక్కినందుకు ఐఓఏ, క్రీడా శాఖలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ గౌరవం నాలో మరింత ప్రేరణ కలిగిస్తోంది. మెడల్ వేటలో అత్యుత్తమ ప్రదర్శన చేస్తాననే విశ్వాసం ఉంది' అని మేరీకోమ్ తెలిపింది. ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు 17 మంది అథ్లెట్లు భారత పతాకధారులుగా వ్యవహరించారు. 1920 ఒలింపిక్స్‌లో స్ప్రింటర్ పూర్మ బెనర్జీ తొలిసారి భారత పతాకధారిగా నిలిచింది. 17 మందిలో 8 మంది ఒలింపిక్ మెడల్స్ సాధించివారు. అభినవ్ బింద్రా, లాల్ షా బొకహరి, ధ్యాన్‌చంద్, బల్బీర్ సింగ్ సీనియర్, జాఫర్ ఇక్బాల్‌లు భారత పతాకధారులుగా వ్యవహరించిన వారిలో ఉన్నారు.
టోక్యో ఒలింపిక్స్‌కు భారత్ 201 మందితో కూడిన జట్టును పంపిస్తోంది. 126 మంది అథ్లెట్లు, 75 మంది అధికారుల బృందం భారత జట్టులో ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు 85 మెడల్ ఈవెంట్లలో పోటీపడనున్నారని ఐఓఏ అధ్యక్షుడు నరెందర్ బత్రా తెలిపారు. భారత అథ్లెట్ల బృందంలో 56 శాతం పురుషులు, 44 శాతం మహిళలు ఉన్నట్టు ఐఓఏ వెల్లడించింది.