Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా బారిన ముగ్గురు ఇంగ్లాండ్ క్రికెటర్లు
- మరో నలుగురు సహాయక సిబ్బందికి పాజిటివ్
- ఐసోలేషన్లోకి వెళ్లిన ఇయాన్ మోర్గాన్‌సేన
- పాకిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు కొత్త జట్టు ఎంపిక
కరోనా వైరస్ బయో బబుల్‌లోకి యథేచ్చగా ప్రవేశిస్తోంది. ఐపీఎల్ బయో బుడగను బద్దలుచేసిన కరోనా మహమ్మారి.. తాజాగా ఇంగ్లాండ్ బయో బుడగలోకి చొచ్చుకెళ్లింది. ఇంగ్లాండ్ జట్టులో ముగ్గురు క్రికెటర్లు మహమ్మారి బారిన పడగా.. నలుగురు సహాయక సిబ్బంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. కరోనా కలకలంతో ఇంగ్లాండ్ వన్డే జట్టు ఐసోలేషన్లోకి వెళ్లిపోయింది. పాకిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు ఇంగ్లాండ్ బోర్డు కొత్త జట్టును ఎంపిక చేసింది.
నవతెలంగాణ-కార్డిఫ్
కరోనా మహమ్మారి అనంతరం సురక్షిత వాతావరణంలో క్రికెట్ నిర్వహణపై ప్రపంచ దేశాలు తలలు పట్టుకున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కష్టకాలంలో దిక్సూచిగా నిలువటంలో విఫలమైంది. ఆ సమయంలో బయో సెక్యూర్ బబుల్‌ను సృష్టించి వరుసగా వెస్టిండీస్, పాకిస్థాన్, ఐర్లాండ్, ఆస్ట్రేలియాలతో సిరీస్‌లు నిర్వహించింది. కరోనా కాలంలో క్రికెట్‌ను నడిపించటంపై ప్రపంచ దేశాలకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చుక్కానిలా నిలిచింది. ఇంగ్లాండ్ బాటలోనే నడిచిన ఇతర క్రికెట్ బోర్డులు బయో బబుల్‌లో క్రికెట్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. ఈ వేసవిలోనూ న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్, ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్, శ్రీలంకతో వైట్ బాల్ సిరీస్‌లకు ఈసీబీ ఆతిథ్యం ఇచ్చింది. పాకిస్థాన్‌తో వైట్ బాల్ సిరీస్, భారత్‌తో రెడ్ బాల్ సిరీస్‌లు వరుస క్రమంలో నిర్వహించాల్సి ఉంది. బయో బబుల్స్ నిర్వహణలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పిన ఘనత గడించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు.. కరోనా వైరస్ గట్టి షాక్ ఇచ్చింది. ఇంగ్లాండ్ వన్డే క్రికెట్ శిబిరంలోకి కోవిడ్ మహమ్మారి తొంగిచూసింది. ముగ్గురు క్రికెటర్లు, నలుగురు సహాయక సిబ్బంది కరోనా వైరస్‌కు పాజిటివ్‌గా తేలారు. ఈ పరిణామంతో ఇంగ్లాండ్ వన్డే జట్టును పూర్తిగా ఐసోలేషన్లోకి పంపించారు. శ్రీలంకతో మూడో వన్డే అనంతరం (జులై 4)న ఇంగ్లాండ్ క్రికెటర్లకు కోవిడ్-19 ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఏడు కోవిడ్ కేసులు వెలుగు చూడటంతో ఈసీబీ అప్రమత్తమైంది. ఇయాన్ మోర్గాన్ నాయకత్వంలోని వన్డే జట్టును బ్రిటన్ ప్రభుత్వం నిబంధనల ప్రకారం కార్డిఫ్‌లో ఐసోలేషన్ చేసింది. కోవిడ్ సోకిన వారిలో ఎవరినీ రోగ లక్షణాలు కనిపించటం లేదని, అందరి ఆరోగ్య పరిస్థితి అదుపులోనే ఉందని ఈసీబీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
బెన్ స్టోక్స్‌కు పగ్గాలు : ఇంగ్లాండ్, పాకిస్థాన్ వన్డే సిరీస్ ఈ గురువారం ఆరంభం కానుంది. కార్డిఫ్‌లో తొలి వన్డే జరగాల్సి ఉంది. జూన్ 25న ఇంగ్లాండ్‌కు చేరుకున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు డర్బీలో క్వారంటైన్ ముగించుకుని కార్డిఫ్‌కు చేరుకున్నారు. ఇయాన్ మోర్గాన్ సేనతో పాక్ వన్డే సవాల్‌కు సిద్ధం కావాల్సిన తరుణంలో కరోనా కలకలం ఈసీబీ వర్గాలను ఆందోళనలోకి నెట్టేసింది. ప్రథమ ప్రాధాన్య వన్డే జట్టు ఐసోలేషన్‌లో ఉండటంతో ఈసీబీ పూర్తిగా కొత్త జట్టును ఎంపిక చేసింది. సీనియర్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు కెప్టెన్సీ అప్పగించింది. వన్డేల్లో బెన్ స్టోక్స్ నాయకత్వం వహించనుండటం ఇదే తొలిసారి. పాకిస్థాన్‌తో సిరీస్‌కు ఈసీబీ సెలక్షన్ కమిటీ ఏకంగా తొమ్మిది మంది కొత్త ముఖాలను జట్టులోకి ఎంపిక చేసింది. జాక్ క్రావ్లీ, బ్రైడన్ కార్సె, లెవిస్ గ్రెగొరి, టామ్ హెల్మ్, డాన్ లారెన్స్, విల్ జాక్స్, డెవిడ్ పైనె, ఫిల్ సాల్ట్, జాన్ సింప్సన్లు తొలిసారి ఇంగ్లాండ్ వన్డే జట్టుకు ఎంపికయ్యారు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఆడుతున్న ఈ క్రికెటర్లకు కోవిడ్-19 ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించి జాతీయ శిబిరంలోకి తీసుకురానున్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని జోశ్ బట్లర్‌ను సెలక్షన్ పరిగణనలోకి తీసుకోలేదు. శ్రీలంక సిరీస్‌కు దూరంగా ఉన్న చీఫ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ పాకిస్థాన్ సిరీస్‌కు వన్డే జట్టుతో ఉండనున్నాడు.
కరోనా కేసులు వెలుగు చూడటంతో ఈసీబీ వర్గాలు గందరగోళానికి గురవుతున్నాయని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ అన్నాడు. ' గత 15 నెలలుగా ఈసీబీ బయో బబుల్‌ను ఎంత పకడ్బందిగా నిర్వహించిందో ఈ ఘటన తెలియజేస్తుంది. క్రికెటర్లు ప్రపంచ వ్యాప్తంగా బబుల్స్‌లో గడుపుతున్నారు. సాధారణ జీవిత ఆస్వాదనకు కాస్త బయటకొచ్చినా.. పరిస్థితుల్లో దారుణ మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు కరోనా వైరస్ బబుల్‌లోకి ప్రవేశించింది. అందుకు అనుగుణంగా ఈసీబీ వ్యవహరించాలి. వన్డే జట్టు స్థానంలో పూర్తిగా కొత్త జట్టు, సహాయక సిబ్బందిని ఎంపిక చేయటం అంత సులువు కాదు' అని హుస్సేన్ అన్నాడు.
ఇంగ్లాండ్ వన్డే జట్టు : బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేక్ బాల్, డానీ బ్రిగ్స్, బ్రైడన్ కార్సె, జాక్ క్రావ్లీ, బెన్ డకెట్, లెవిస్ గ్రెగొరి, టామ్ హెల్మ్, విల్ జాక్స్, డాన్ లారెన్స్, సకిబ్ మహ్మద్, డెవిడ్ మలాన్, క్రెయిగ్ ఓవర్టన్, మాట్ పారిక్సన్, డెవిడ్ పైనె, ఫిల్ సాల్ట్, జాన్ సింప్సన్, జేమ్స్ విన్సె.