Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అపెక్స్ కౌన్సిల్ సభ్యుల సస్పెన్షన్‌పై హైకోర్టు స్టే
- మూడు రోజుల లీగ్ ప్రకటించిన అపెక్స్ కౌన్సిల్
నవతెలంగాణ, హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఐదుగురు అపెక్స్ కౌన్సిల్ సభ్యులను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ అంబుడ్స్‌మన్ జస్టిస్ (విశ్రాంత) దీపక్ వర్మ ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ హైకోర్టు ఏకసభ్య ధర్మసనం నిలువరించింది. అంబుడ్స్‌మన్ ఎవరనే అంశంలో స్పష్టత లేదని వ్యాఖ్యానించిన జస్టిస్ అమరనాథ్ గౌడ్ కేసును ఈ నెల 21కి వాయిదా వేశారు. విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నారనే అభియోగంతో అపెక్స్ కౌన్సిల్ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అజహరుద్దీన్‌పై విచారణ పెండింగ్‌లో ఉండటంతో ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్ తాత్కాలిక ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు హెచ్‌సీఏ కార్యదర్శి ఆర్. విజయానంద్ బుధవారం పేర్కొన్నారు. న్యాయస్థానం తీర్పుతో ఉపాధ్యక్షులు జాన్ మనోజ్, కార్యదర్శి విజయానంద్, సంయుక్త కార్యదర్శి నరేష్ శర్మ, కోశాధికారి సురేందర్ అగర్వాల్, కౌన్సిలర్ అనురాధలు అపెక్స్ కౌన్సిల్ సభ్యులుగా తిరిగి తమ విధుల్లోకి రానున్నారు. ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో అపెక్స్ కౌన్సిల్ సభ్యులు బుధవారం మీడియాతో మాట్లాడారు.
నేటి నుంచి క్రికెట్ సీజన్ : హైదరాబాద్ క్రికెట్ సీజన్ నేటి నుంచి ఆరంభం కానుంది. కోవిడ్ మహమ్మారితో అర్థాంతరంగా నిలిచిపోయిన మూడు రోజుల లీగ్‌తో సీజన్ ఆరంభం అవుతుందని కార్యదర్శి విజయానంద్ తెలిపారు. మరోవైపు అధ్యక్షుడు అజహరుద్దీన్ టైగర్ కప్ టీ20 టోర్నీని (జులై 12 నుంచి) ప్రకటించటంతో క్రికెటర్లు అయోమయంలో పడిపోయారని చెప్పవచ్చు. అజహర్ వర్గం, విజయానంద్ వర్గం వేర్వేరు టోర్నీలు ప్రకటించటంతో ఏ టోర్నీలో పాల్గొనాలనే అంశంపై క్లబ్లో అయోమయంలో ఉన్నాయి. నేడు జింఖానా మైదానంలో మూడు రోజుల లీగ్‌ను తెలంగాణ క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించనున్నారని అపెక్స్ కౌన్సిల్ వెల్లడించింది. అపెక్స్ కౌన్సిల్ సభ్యులను జింఖానాలోకి రానీయకుండా పోలీసులతో అడ్డుకున్న అజహరుద్దీన్.. నేడు ఏం చేయనున్నారనే ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా, అపెక్స్ కౌన్సిల్లో నామినేట్ సభ్యులకు ఉపాధ్యక్ష, కోశాధికారి బాధ్యతలు అప్పగిస్తూ అజహరుద్దీన్ తీసుకున్న నిర్ణయంపై క్రికెట్ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.