Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హుబర్ట్ చేతిలో కంగుతిన్న దిగ్గజం
- సెమీస్‌లో జకోవిచ్, సపలోవ్
- వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ 2021
వింబుల్డన్ రారాజు రోజర్ ఫెదరర్‌కు భంగపాటు. 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల మొనగాడు స్విస్ యోధుడికి పొలాండ్ కుర్రాడు హుబర్ట్ హుర్కాజ్ చెక్ పెట్టాడు. 39 ఏండ్ల రోజర్ ఫెదరర్ వింబుల్డన్ నుంచి నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో 3-6, 6-7(4-7), 0-6తో పరాజయం పాలయ్యాడు. 14వ సీడ్ హుబర్ట్ తొలిసారి వింబుల్డన్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. వరల్డ్ నం.1 నొవాక్ జకోవిచ్, సపలోవ్ సైతం సెమీఫైనల్లోకి చేరుకున్నారు.
నవతెలంగాణ-లండన్
వింబుల్డన్ వీరుడికి వింబుల్డన్‌లోనే భంగపాటు. ఫిట్నెస్తో పోరాడుతూ, 39 ఏండ్ల వయసులో ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో తొమ్మిదో టైటిల్ వేటలో స్విస్ యోధుడు కంగుతిన్నాడు. అచ్చొచ్చిన చోటే అనూహ్య పరాజయం చవిచూశాడు. ఏకపక్షంగా సాగిన క్వార్టర్‌ఫైనల్ పోరులో పొలాండ్ ఆటగాడు హుబర్ట్ హుర్కాజ్ చేతిలో ఫెదరర్ వరుస సెట్లలో ఓటమిపాలయ్యాడు. 6-3, 7-6(7-4), 6-0తో హుబర్ట్ కెరీర్లో అత్యుత్తమ విజయం నమోదు చేశాడు. ఫెదరర్‌పై 10 ఏస్‌లు, ఐదు బ్రేక్ పాయింట్లు సాధించిన హుబర్ట్, కీలక రెండో సెట్‌ను టైబ్రేకర్‌లో గెల్చుకున్నాడు. పాయింట్ల పరంగానూ 103-78తో దిగ్గజ ఆటగాడిపై పైచేయి సాధించాడు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. 2019లో వింబుల్డన్ టైటిల్‌ను ఐదు సెట్ల పోరులో జకోవిచ్‌కు కోల్పోయిన ఫెదరర్.. ఈ ఏడాది క్వార్టర్స్‌లోనే నిష్క్రమించాడు. వింబుల్డన్‌లో ఫెదరర్ ఎనిమిది సార్లు చాంపియన్‌గా నిలిచాడు. ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో ఇది ఆల్‌టైమ్ రికార్డు. ఈ ఓటమితో రోజర్ ఫెదరర్ గ్రాండ్‌స్లామ్ వేటకు ముగింపు వచ్చినట్టే భావించవచ్చు!.
వరల్డ్ నం.1 జకోవిచ్ అలవోక విజయం నమోదు చేశాడు. మార్టన్ ఫసోవిక్స్ (హంగరీ)పై వరుస సెట్లలోనే గెలుపొందాడు. 6-3, 6-4, 6-4తో ఏకపక్ష విజయం సాధించాడు. క్వార్టర్స్‌లో ప్రత్యర్థి నుంచి జకోవిచ్‌కు ఎటువంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. జకోవిచ్‌పై ఐదు ఏస్‌లు సంధించిన మార్టన్, ఓ బ్రేక్ పాయింట్ సాధించి అక్కడితోనే సంతృప్తి చెందాడు!. నాలుగు ఏస్‌లు సంధించిన జకోవిచ్.. నాలుగు బ్రేక్ పాయింట్లతో అదరగొట్టాడు. మూడు డబుల్ ఫాల్ట్స్‌కు పాల్పడినా.. ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. సుమారు రెండున్నర గంటల పోరులో జకోవిచ్ 23 విన్నర్లు సాధించగా.. 30 అనవసర తప్పిదాలు చేశాడు. 24 విన్నర్లు కొట్టిన మార్టన్ 31 అనవసర తప్పిదాలకు పాల్పడినాడు. పాయింట్ల పరంగా 108-86తో జకోవిచ్ తిరుగులేని ఆధిపత్యం చూపాడు. 22 నెట్ పాయింట్లు గెల్చుకున్న జకోవిచ్ బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. మరో క్వార్టర్ఫైనల్లో కెనడా ఆటగాడు పైచేయి సాధించాడు. మూడున్నర గంటల పాటు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో డెనిస్ సపలోవ్ (కెనడా) సాధికారిక విజయం నమోదు చేశాడు. 25వ సీడ్ కారెన్ కచకోవిచ్ (రష్యా)పై ఐదు సెట్ల పోరులో సపలోవ్ ముందంజ వేశాడు. 6-4, 3-6, 5-7, 6-1, 6-4తో సపలోవ్ గెలుపొందాడు. తొలి మూడు సెట్లలో రెండింట వెనుకంజ వేసిన సపలోవ్.. చావోరేవో తేల్చుకోవాల్సిన చివరి రెండు సెట్లలోనూ దుమ్మురేపాడు. నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో నొవాక్ జకోవిచ్‌తో డెనిస్ సపలోవ్ పోటీపడనున్నాడు.
మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్స్ బెర్త్ కోసం నలుగురు భామలు పోటీపడుతున్నారు. నేడు జరిగే తొలి సెమీఫైనల్లో వరల్డ్ నం.1 ఆష్లే బార్టీతో మాజీ వరల్డ్ నం.1 ఎంజెలిక్ కెర్బర్ తలపడనుంది. మరో సెమీఫైనల్లో చెక్ భామ కరొలినా ఫ్లిస్కోవాను రెండో సీడ్ సబలెంకా ఢకొీట్టనుంది.