Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాకప్ ఓపెనర్లపై కొనసాగుతున్న సందిగ్థత
- జట్టు మేనేజ్మెంట్, సెలక్షన్ కమిటీ కోల్డ్‌వార్!
ముంబయి : విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. రాహల్ ద్రవిడ్ శిక్షణా నేతృత్వంలోని భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గాయంతో ఇంగ్లాండ్ సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో ప్రత్యామ్నాయ ఓపెనర్లుగా శ్రీలంక పర్యటనలో ఉన్న యువ ఓపెనర్లు పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్‌ను పంపించాలని జట్టు మేనేజ్మెంట్ కోరింది. ఈ మేరకు సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మకు అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ ఈమెయిల్ పంపించారు. బ్యాకప్ ఓపెనర్లను ఇంగ్లాండ్‌కు పంపిస్తారా? లేదా? అనే విషయంలో ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత లేదు. సుదీర్ఘ పర్యటనలో ఉన్న జట్టు అవసరాలను సీనియర్ సెలక్షన్ కమిటీ ఎందుకు పట్టించుకోవటం లేదు?. నలుగురు ఓపెనర్లు అందుబాటులో ఉన్నప్పటికీ మరో ఇద్దరు ఓపెనర్లు కావాలని జట్టు మేనేజ్మెంట్ ఎందుకు కోరుతోంది?.
అవసరం ఉందా?! : ఇంగ్లాండ్ పర్యటనలో ప్రస్తుతం 23 మంది క్రికెటర్లు ఉన్నారు. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లకు తోడు రిజర్వ్ ఓపెనర్‌గా బెంగాల్ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ అందుబాటులో ఉన్నాడు. రానున్న టెస్టు సిరీస్‌లో మరో ఇద్దరు ఓపెనర్లు ఫిట్నెస్ కోల్పోయినా.. ఇద్దరు ఓపెనర్లు అందుబాటులోనే ఉంటారు. అయినా, మరో ఇద్దరు ఓపెనర్లు కావాలని కోహ్లిసేన కోరుతోంది. ప్రథమ ప్రాధాన్య ఓపెనర్ గాయంతో దూరమయ్యాడు. అతడి స్థానం భర్తీ చేసేందుకే జట్టులో మరో ముగ్గురు ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. అయినా, ఆ ముగ్గురిని కాదని టెస్టు ప్రణాళికల్లో భాగం కాని మరో ఇద్దరు క్రికెటర్లను ఎందుకు అడుగుతున్నారనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇంగ్లాండ్ పిచ్‌లపై అభిమన్యు ఈశ్వరన్ రాణించలేడనే అభిప్రాయం ఉన్నప్పుడు జట్టు సెలక్షన్ సమయంలోనే అభ్యంతర వ్యక్తం చేయాల్సింది. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ నుంచీ ఈశ్వరన్ జట్టుతోనే ఉన్నాడు. ఉన్నట్టుండి అతడు అక్కడి పరిస్థితుల్లో రాణించలేడని ఎలా చెబుతున్నారు?. కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లు అనుభవం ఉన్న ఓపెనర్లే. విదేశీ గడ్డపై కొత్త బంతిని ఎదుర్కొన్నవారే. సహజంగా విదేశీ పర్యటనకు 15 మంది జట్టునే ఎంపిక చేస్తారు. కోవిడ్ ప్రత్యేక పరిస్థితుల్లో 24 మందితో కూడిన జంబో జట్టును ఇంగ్లాండ్‌కు పంపించారు. అయినప్పటికీ మరో ఇద్దరు కావాలని కోరటం దేనికి సంకేతమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
చీఫ్ సెలక్టర్‌తో విభేదాలు? : చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మకు జట్టు మేనేజ్మెంట్కు సత్సంబంధాలు లేవనే వార్తలు షికారు చేస్తున్నాయి. పలు క్రికెట్ అకాడమీల్లో కోచ్‌గా పని చేసిన చేతన్ శర్మకు.. కొందరు క్రికెటర్లతో సాన్నిహిత్యం ఉందని జట్టు మేనేజ్మెంట్ ఆరోపణగా తెలుస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లితో చర్చించిన అనంతరమే ఇంగ్లాండ్ పర్యటనకు జట్టును ఖరారు చేశారు. జట్టు ప్రణాళికలకు అనుగుణంనే కూర్పు చేశారు. ఇప్పుడు హఠాత్తుగా జట్టు ప్రణాళికలు మారితే, అవేమిటో సెలక్షన్ కమిటీతో పంచుకోవాల్సిన అవసరం సైతం ఉంది. జట్టు అవసరాల మేరకు ఆటగాళ్లను ఎంపిక చేయటం సెలక్షన్ కమిటీ బాధ్యత. ఏ ఆటగాడిని పంపించాలో జట్టు మేనేజ్మెంటే ఎంచుకుంటే.. ఇక సెలక్షన్ కమిటీ చేయడానికి ఏముంటుంది?. అందుబాటులో 23 మంది క్రికెటర్లు ఉన్నప్పటికీ మరో ఇద్దరు ఆటగాళ్లు ఎందుకు అవసరమో జట్టు మేనేజ్మెంట్ వివరణ ఇస్తేనే పృథ్వీ షా, పడిక్కల్‌ను ఇంగ్లాండ్‌కు పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో బీసీసీఐ సైతం జట్టు మేనేజ్మెంట్ వివరణ కోసం ఎదురుచూస్తున్నట్టు సమాచారం. శ్రీలంక పర్యటనలో ఉన్న ఇద్దరు ఆటగాళ్లను కోరటంతో.. వైట్ బాల్ సిరీస్ ప్రణాళికలను సైతం కోహ్లిసేన గందరగోళంలో పడేసింది. ఈ సందిగ్థత వాతావారణానికి బీసీసీఐ ఎంత త్వరగా ముగింపు పలికితే అంత మంచిది!.