Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టైటిల్ పోరుకు చేరుకున్న స్టార్స్
- సెమీస్‌లో సబలెంక, కెర్బర్ ఓటమి
- వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ 2021
నవతెలంగాణ-లండన్
వింబుల్డన్ మహిళల సింగిల్స్‌కు కొత్త చాంపియన్ రానుంది. 2018 వింబుల్డన్ విజేత ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) కథ సెమీఫైనల్లోనే ముగియటంతో.. మహిళల సింగిల్స్ ఫైనల్లో కొత్త చాంపియన్‌కు అవకాశం ఏర్పడింది. వింబుల్డన్ టైటిల్ అందుకోని.. వరల్డ్ నం.1 ఆష్లె బార్టీ (ఆస్ట్రేలియా), ఎనిమిదో సీడ్ కరొలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)లు మహిళల సింగిల్స్ ఫైనల్లోకి ప్రవేశించారు. మాజీ వరల్డ్ నం.1 కెర్బర్‌పై బార్టీ అలవోక విజయం సాధించగా... రెండో సీడ్ బెలారస్ భామ సబలెంకపై కరొలినా ప్లిస్కోవా చెమటోడ్చింది. 5-7, 6-4, 6-4తో ప్లిస్కోవా టైటిల్ పోరుకు చేరుకోగా.. 6-3, 7-6(7-3)తో బార్టీ అంతిమ సమరానికి సై అనేసింది. మహిళల సింగిల్స్ ఫైనల్ పోరు శనివారం జరుగనుంది.
ఎదురులేని బార్టీ : మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో వరల్డ్ నం.1 ఆష్లె బార్టీ (ఆస్ట్రేలియా), మాజీ వరల్డ్ నం.1 ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)ని చిత్తు చేసింది. రెండు సెట్లలోనే ముగిసిన సెమీ సమరంలో ఆస్ట్రేలియన్ స్టార్ హవా చూపించింది. 87 నిమిషాల్లోనే ఫైనల్స్ బెర్త్ దక్కించుకున్న బార్టీ..నిలకడగా కెర్బర్‌ను ఒత్తిడిలోనే నిలిపింది. 8 ఏస్‌లు కొట్టిన బార్టీ, పది నెట్ పాయింట్లు సాధించింది. రెండు సార్లు కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేయటంతో పాటు 38 విన్నర్లు గెల్చుకుంది. బార్టీ 16 అనవసర తప్పిదాలకు పాల్పడగా, కెర్బర్ ఏకంగా 23 అనవసర తప్పిదాలు చేసింది. తొలి సెట్‌ను 6-3తో సులువుగా సొంతం చేసుకున్న బార్టీకి.. రెండో సెట్లో చెమట చిందించాల్సిన అవసరం ఏర్పడింది. టైబ్రేకర్‌కు దారితీసిన రెండో సెట్‌ను బార్టీ 7-3తో కైవసం చేసుకుంది. ఒక్క ఏస్ కూడా కొట్టని కెర్బర్, మూడు డబుల్ ఫాల్ట్స్ చేసింది. బార్టీ సర్వీస్‌ను ఒక్కసారే బ్రేక్ చేసి నిసహాయతను బయటపెట్టుకుంది. పాయింట్ల పరంగా 77-63తో ఆష్లె బార్టీ ఫైనల్లోకి ప్రవేశించింది.
చెమటోడ్చిన ప్లిస్కోవా : ఒత్తిడిలో అనుభవం తోడైతే వింబుల్డన్ మహిళల సింగిల్స్ సెమీస్‌లో ప్లిస్కోవా నెగ్గినట్టు ఉంటుంది. భీకర ఫామ్‌లో ఉన్న రెండో సీడ్ సబలెంకా (బెలారస్) తొలి సెట్‌ను సాధించినా.. అదే జోరు కొనసాగించలేదు. సబలెంకను ఒత్తిడిలోకి నెట్టిన ప్లిస్కోవా.. ఆమె తప్పిదాలను సొమ్ము చేసుకుంది. సుమారు రెండు గంటల ఉత్కంఠ పోరులో చెక్ భామ ప్లిస్కోవా పైచేయి సాధించింది. 18 ఏస్‌లు, 38 విన్నర్లతో చెలరేగినా.. సబలెంక మ్యాచ్‌ను నెగ్గలేకపోయింది. 14 ఏస్‌లు, రెండు బ్రేక్ పాయింట్లు సాధించిన ప్లిస్కోవా 32 విన్నర్లతో మెరిసింది. పాయింట్ల పరంగా 96-87తో ముందంజలో నిలిచింది. సబలెంకా 20 అనవసర తప్పిదాలు చేయగా.. 17తోనే ఆగిపోయిన ప్లిస్కోవా ఫైనల్లో బెర్త్‌ను సొంతం చేసుకుంది.