Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జులై 12-ఆగస్టు 22 వరకు అత్యయిక స్థితి
- జపాన్ ప్రధాని యోషిహిడె సుగ ప్రకటన
- ఎమర్జెన్సీ వాతావరణంలో ఒలింపిక్ క్రీడలు
నవతెలంగాణ-టోక్యో
టోక్యో ఒలింపిక్స్‌ను సురక్షిత వాతావరణంలో నిర్వహించే ప్రణాళికలో భాగంగా జపాన్‌లో వైరస్ అత్యయికి స్థితిని విధించారు. 2020 టోక్యో ఒలింపిక్ క్రీడలు పూర్తిగా ఎమర్జెన్సీ వాతావరణంలోనే జరుగనున్నాయి. ఈ మేరకు జపాన్ ప్రధానమంత్రి యోషిహిడె సుగ గురువారం ప్రకటించారు. 'టోక్యో నగరంలో వైరస్ ఎమర్జెన్సీ విధిస్తున్నాం. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టే వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని' జపాన్ ప్రధాని సుగ ప్రకటించారు. జులై 12 నుంచి ఆగస్టు 22 వరకు టోక్యో నగరంలో వైరస్ అత్యయిక స్థితి కొనసాగనుంది. విశ్వ క్రీడల నేపథ్యంలో కరోనా మహమ్మారి ప్రబల వ్యాప్తి చెందకుండా నివారించేందుకు జపాన్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.
మద్యంపైనే ఫోకస్ : టోక్యో నగరంలో వైరస్ ఎమర్జెన్సీ విధించడానికి ప్రధాన కారణం మద్యపానమనే అవగతమవుతోంది!. బార్లు, రెస్టారెంట్లు, కారోకో పార్లర్లలో విచ్చలవిడిగా మద్యం సేవిస్తారు. అత్యయిక స్థితి విధింపుతో ఆల్కహాల్‌ను పూర్తిగా నిషేధించారు. ఆల్కహాల్‌పై నిషేధంతో ఒలింపిక్ సంబంధిత వేడుకలకు అడ్డుకట్ట వేయటంలో కీలక అడుగు ముందుకు పడిందని వైద్య అధికారులు అభిప్రాయపడుతున్నారు. టోక్యో నగర వాసులు ఇండ్లకే పరిమితమై, టెలివిజన్లలో ఒలింపిక్ క్రీడలు వీక్షించాలని అధికారులు సూచనలు జారీ చేయనున్నారు. ' ఒలింపిక్స్‌ను ఆస్వాదించేందుకు ప్రజలు బయటకు వెళ్లి మద్యం సేవించడాన్ని నిలువరించటం ప్రధాన సమస్య' అని జపాన్ ఆరోగ్యశాఖ మంత్రి నొరిహిష తముర తెలిపారు. టోక్యో ప్రస్తుత అత్యయిక స్థితి ఆదివారంతో ముగియనుంది. సోమవారం నుంచి వైరస్ ఎమర్జెన్సీ అమల్లోకి రానుంది. గత వారం కొత్త కేసులు 714 ఉండగా.. ఈ బుధవారానికి కేసులు 920కి చేరుకున్నాయి. రాజధాని ప్రాంతంలో నమోదైన కోవిడ్ కేసుల్లో రెండింట మూడొంతుల భాగం టోక్యోలోనే ఉన్నాయి. టోక్యో నుంచి ఇతర ప్రాంతాలకు వైరస్ ప్రబలకుండా నిలువరించాలని అధికారులు కృషి చేస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్‌కు రెండు వారాల సమయమే ఉండటంతో జపాన్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. టోక్యో నగరంలో వైరస్ ఎమర్జెన్సీ విధించింది.
ఖాళీ స్టేడియాల్లోనే.. : ప్రతిష్టాత్మక విశ్వ క్రీడలు ఖాళీ స్టేడియాల్లోనే జరుగనున్నాయి. అట్టహాసంగా ప్రణాళిక చేసిన ఆరంభ వేడుకలకు సైతం అభిమానులను అనుమతించే పరిస్థితి లేదు. విదేశీ అభిమానులపై పూర్తి నిషేధం విధించినా.. 50 శాతం సామర్థ్యంతో స్వదేశీ అభిమానులకు నిర్వాహకులు అనుమతి ఇచ్చారు. తాజా పరిస్థితులను బేరీజు వేసుకుని ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించనున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్స్ కౌన్సిల్ (ఐఓసీ)కి 75 శాతం ఆదాయం ఒలింపిక్స్ నుంచే వస్తుంది. దీంతో టోక్యో క్రీడల నిర్వహణ పట్ల ఐఓసీ పట్టుదలగా ఉంది. ఒలింపిక్స్‌కు 11,000 మంది అథ్లెట్లు, పారాలింపిక్స్‌కు 4,400 మంది అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. అథ్లెట్లతో పాటు వేలాది మంది అధికారులు, కోచింగ్ సిబ్బంది, జడ్జిలు, అడ్మినిస్ట్రేటర్లు, స్పాన్సర్లు, ప్రసారదారులు, మీడియా ఒలింపిక్స్ సందర్భంగా టోక్యోకు రానుంది. ఒలింపిక్ గ్రామంలో 80 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని ఐఓసీ వెల్లడించగా.. టోక్యో నగర వాసుల్లో కేవలం 15 శాతం మందికే టీకా వేశారు.