Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీలంక జట్టులో మరో పాజిటివ్ కేసు
- భారత్‌తో సిరీస్ రీషెడ్యూల్కు అవకాశం
నవతెలంగాణ-కొలంబో
కోవిడ్ మహమ్మారి శ్రీలంక శిబిరాన్ని తాకింది. ఇంగ్లాండ్ పర్యటన నుంచి స్వదేశానికి చేరుకున్న శ్రీలంక క్రికెట్ జట్టులో రెండు కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ వైరస్ బారిన పడగా.. తాజాగా జట్టు డేటా అనలిస్ట్ జిటి నిరోషన్ పాజిటివ్‌గా తేలాడు. ఫ్లవర్, నిరోషన్లను శ్రీలంక క్రికెట్ బోర్డు హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తోంది. ఫ్లవర్, నిరోషన్లు ప్రాణాంతక కోవిడ్-19 డెల్టా వేరియంట్ బారిన పడటం శ్రీలంక క్రికెట్ బోర్డు వైద్యులను ఆందోళనకు గురి చేస్తోంది.
ఐసోలేషన్‌లోనే.. : ఇంగ్లాండ్, శ్రీలంక సిరీస్ కోవిడ్-19 కేసులతో ముగిసిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ వైట్‌బాల్ జట్టులో ఏడుగురు వైరస్ బారిన పడటంతో పాకిస్థాన్‌తో సిరీస్‌కు ఈసీబీ కొత్త జట్టును ఎంపిక చేసింది. ఇయాన్ మోర్గాన్‌సేన కార్డిఫ్లోనే ఐసోలేషన్‌లో కొనసాగుతోంది. శ్రీలంక శిబిరంలో రెండు కేసులు వెలుగుచూడటంతో.. క్రికెటర్లు ఇంకా ఐసోలేషన్‌లోనే ఉన్నారు. భారత్‌తో సిరీస్ బయో బబుల్‌లోకి ఆటగాళ్లు శుక్రవారం అడుగుపెట్టాలి. కోవిడ్ కేసులతో మరో రెండు రోజులు ఐసోలేషన్‌లో ఉండనున్నారు. మరోసారి కోవిడ్-19 ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించిన అనంతరమే ఐసోలేషన్ నుంచి వెలుపలకి రావాల్సి ఉంటుంది.
ద్వితీయ శ్రేణి జట్టుతో.. : భారత్‌తో టీ20, వన్డే సిరీస్‌కు శ్రీలంక కొత్త జట్టును ప్రకటించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఐసోలేషన్‌లో మరో కోవిడ్ కేసు వెలుగుచూస్తే శ్రీలంక క్రికెట్ బోర్డుకు మరో అవకాశం ఉండబోదు. ఇప్పటికే కొలంబో, దంబుల్లా కేంద్రాలుగా రెండు గ్రూపులను శ్రీలంక క్రికెట్ బోర్డు సిద్ధంగా ఉంచింది. అనివార్య పరిస్థితుల్లో తొలి ప్రాధాన్య జట్టు భారత్‌తో సిరీస్‌కు దూరమైతే.. ఈ రెండు గ్రూపుల నుంచి మరో జట్టును ఎంపిక చేయనున్నారు. వివాదాస్పద పరిస్థితుల నడుమ భారత్‌తో సిరీస్‌కు దసున్ శనకను కెప్టెన్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ప్రసార హక్కుల ద్వారా సుమారు రూ.90 కోట్ల ఆదాయం రానుండటంతో ఈ సిరీస్ నిర్వహణ శ్రీలంక క్రికెట్ బోర్డుకు అత్యంత ప్రధానం. కొలంబో వేదికగా భారత్, శ్రీలంకలు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నాయి. తొలి వన్డే జులై 13న ఆరంభం కావాల్సి ఉంది. భారత్, శ్రీలంక సిరీస్‌కు అభిమానులను అనుమతించటం లేదు.