Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హుబర్ట్ సంచలనాలకు సెమీస్‌లో తెర
- టైటిల్ కోసం బార్టీ, ప్లిస్కోవా పోరు నేడు
- వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ 2021
నవతెలంగాణ-లండన్
ఆదివారం లండన్‌లో బ్యాంగ్బ్యాంగ్కు ఇటాలీయన్లు రంగం సిద్ధం చేసుకున్నారు. యూరో ఫుట్‌బాల్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌తో ఇటలీ ఢకొీట్టనుండగా.. అదే రోజు కొన్ని గంటల ముందు ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ సెంటర్ కోర్టులో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో తలపడనున్నాడు మాట్టో బెరెటిని. వరల్డ్ నం.8, ఏడో సీడ్ మాట్టో బెరెటిని కెరీర్ తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి చేరుకున్నాడు. వింబుల్డన్ ఫైనల్లోకి ఓ ఇటాలియన్ చేరుకోవటం గ్రాండ్‌స్లామ్ చరిత్రలోనే ఇది ప్రథమం. సంచలన ఆటగాడు, 14వ సీడ్ హుబర్ట్ హుర్కాజ్ (పొలాండ్)పై అలవోక విజయం సాధించిన బెరెటిని ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 6-3, 6-0, 6-7(3-7), 6-4తో బెరెటిని నాలుగు సెట్ల మ్యాచ్‌లో గెలుపొందాడు.
బెరాటిని దూకుడు : ప్రీ క్వార్టర్ఫైనల్లో వరల్డ్ నం.2 డానిస్ మెద్వదేవ్ (రష్యా)ను మట్టికరిపించాడు. వింబుల్డన్ కింగ్ రోజర్ ఫెదరర్‌ను క్వార్టర్ఫైనల్లో వరుస సెట్లలో అడ్డుకున్నాడు. వరుసగా మెగా విజయాలతో వింబుల్డన్‌లో పొలాండ్ కుర్రాడు హుబర్ట్ హుర్కాజ్ పాపులర్ అయిపోయాడు. దీంతో సెమీఫైనల్లో హుబర్ట్ అవకాశాలను తక్కువ చేసే సాహసం ఎవరూ చేయలేదు. అయితే ఈ సమీకరణాలను బెరెటాని పట్టించుకున్నట్టు అనిపించటం లేదు. గంటకు 225 కిమీ వేగంతో సర్వ్ చేసిన బెరెటిని.. వరుసగా 11వ విజయం నమోదు చేశాడు. బెరెటిని వేగాన్ని అందుకోలేక పోయిన హుబర్ట్.. తొలి రెండు సెట్లలోనే తేలిపోయాడు. మూడో సెట్లోనే ముగింపు లాంఛనం అనిపించింది. గట్టిగా ప్రతిఘటించిన హుబర్ట్ మూడో సెట్‌ను టైబ్రేకర్‌లో గెల్చుకున్నాడు. ఇక ఆసక్తికరమే అనుకునే తరుణంలో.. బెరెటిని దూకుడు పెంచాడు. నాలుగో సెట్‌ను మరింత సులువుగానే దక్కించుకున్నాడు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించిన తొలి ఇటలీ అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు.
సెమీ సమరంలో మాట్టో బెరెటిని ప్రత్యర్థికి ఒక్క సర్వీస్‌ను కూడా కోల్పోలేదు. హుబర్ట్ సర్వీస్‌ను ఆరు సార్లు బ్రేక్ చేసిన బెరెటిని.. తన సర్వీస్‌లో పాయింట్లు కొల్లగొట్టాడు. 22 ఏస్‌లతో విజృంభించిన బెరెటిని 60 విన్నర్లు కొట్టాడు. 26 అనవసర తప్పిదాలు చేసిన హుబర్ట్, ఓ డబుల్ ఫాల్ట్‌కు పాల్పడ్డాడు. 157 నిమిషాల మ్యాచ్‌లో పాయింట్ల పరంగా 127-97తో బెరెటిని స్పష్టమైన ఆధిపత్యం చెలాయించాడు. ' నాకు మాటలు రావటం లేదు. ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికే నాకు కొన్ని గంటలు పడుతుందేమో. గొప్ప మ్యాచ్ ఆడేశాను. ఇటువంటి మ్యాచ్ గురించి కలలో కూడా ఆలోచన చేయలేదు. ఇది ఊహించలేదు' అని ఫైనల్లోకి అడుగుపెట్టిన అనంతరం మాట్టో బెరెటిని అన్నాడు.
మహిళల ఫైనల్ నేడు : వింబుల్డన్‌లో అరుదైన రికార్డుపై కరొలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) కన్నేసింది. సెమీఫైనల్లో రెండో సీడ్ సబలెంకాను ఓడించిన ప్లిస్కోవా.. గ్రాండ్‌స్లామ్‌ను ముద్దాడేందుకు టాప్ సీడ్‌ను ఓడించాల్సి ఉంది. 53 ఏండ్ల ఓపెన్ శకంలో ఈ ఘనతను ఇద్దరు మాత్రమే సాధించారు. వీనస్ విలియమ్స్ (2000, 2005), అన జోన్స్ (1969, 1971)లు వరుసగా టాప్-2 సీడ్లను ఓడించి గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు పట్టారు. ఐదేండ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి చేరుకున్న కరొలినా ప్లిస్కోవా ఇప్పుడైనా టైటిల్ సాధించాలనే తపనతో ఉంది. వరల్డ్ నం.1 ఆష్లె బార్టీ (ఆస్ట్రేలియా) జోరు మీదుంది. ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో జూనియర్ చాంపియన్‌గా నిలిచిన బార్టీ.. ఇప్పుడు సీనియర్‌గానూ గ్రాండ్‌స్లామ్ అందుకోవాలని చూస్తోంది.