Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, ఇంగ్లాండ్ రెండో టీ20 నేడు
హౌవె : ఇంగ్లాండ్ పర్యటన నుంచి రిక్త హస్తాలతో స్వదేశానికి రాకుండా ఉండేందుకు.. అమ్మాయిలు నేడు అన్ని అస్త్రాలు ప్రయోగించనున్నారు. వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్.. తాజాగా టీ20 సిరీస్‌ను చేజార్చుకునే ప్రమాదంలో పడ్డారు. తొలి టీ20లో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 18 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. నేడు రెండో మ్యాచ్‌లో భారత్ చావోరేవో తేల్చుకోవాల్సి ఉంది. టాప్ ఆర్డర్లో షెఫాలీ వర్మ, స్మృతీ మంధాన, హర్లీన్ డియోల్‌కు తోడు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రాణించాల్సి అవసరం ఉంది. సిరీస్‌లో నిరాశపరిచిన హర్మన్‌ప్రీత్.. తాడోపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లోనైనా ముందుండి నడిపిస్తుందేమో చూడాలి. ఇంగ్లాండ్ శిబిరంలో టామీ బ్యూమోంట్, నటాలీ సీవర్, డానీ వ్యాట్, ఆమీ జోన్స్‌లు భీకర ఫామ్‌లో ఉన్నారు. సిరీస్‌ను తేల్చే మ్యాచ్‌లో హర్మన్‌సేన ఏం చేస్తుందో చూడాలి. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది.
పరాజయం తప్పలేదు : ఛేదనలో స్మృతీ మంధాన (29, 17 బంతుల్లో 6 ఫోర్లు), హర్లీన్ డియోల్ (17, 24 బంతుల్లో 1 ఫోర్) రాణించినా భారత్‌కు తొలి టీ20లో పరాజయం తప్పలేదు. 178 పరుగుల భారీ ఛేదనలో 8.4 ఓవర్లలో భారత్ 54/3 వద్ద నిలిచింది. భారీ వర్షంతో మ్యాచ్ సాగలేదు. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 8.4 ఓవర్లలో భారత్ లక్ష్యాన్ని 73 పరుగులుగా తేల్చారు. ఈ సమీకరణంతో ఇంగ్లాండ్ 18 పరుగుల వ్యత్యాసంతో విజయం సాధించింది. నటాలీ సీవర్ (55), ఆమీ జోన్స్ (43), డానీ వ్యాట్ (31) మెరుపులతో తొలుత ఇంగ్లాండ్ 177/7 పరుగులు చేసింది. శిఖా పాండే బౌలింగ్‌లో ఆమీ జోన్స్ లాంగ్ఆఫ్స్లో భారీ షాట్ బాదగా.. బౌండరీ లైన్‌పై జంప్ చేస్తూ హర్లీన్ డియోల్ కండ్లుచెదిరే క్యాచ్ అందుకుంది. భారత్ మ్యాచ్ ఓడినా.. హర్లీన్ డియోల్ అద్వితీయ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.