Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెరీర్ రెండో గ్రాండ్‌స్లామ్ కైవసం
- ఫైనల్లో ప్లిస్కోవాకు భంగపాటు
- వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ 2021
ఆస్ట్రేలియా స్టార్ క్రీడాకారిణి ఆష్లె బార్టీ చరిత్ర సృష్టించింది. 41 ఏండ్ల సుదీర్ఘ విరామం అనంతరం వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా అథ్లెట్‌గా బార్టీ నిలిచింది. తొలిసారి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ సెంటర్ కోర్టు ఫైనలిస్ట్‌ల టైటిల్ పోరులో చెక్ రిపబ్లిక్ భామ కరొలినా ప్లిస్కోవాపై బార్టీ మూడు సెట్లలో విజయం సాధించింది. కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2016 యుఎస్ ఫైనల్లో రన్నరప్‌గా నిలిచిన ప్లిస్కోవా.. 2021 వింబుల్డన్‌లోనూ భంగపడింది.
నవతెలంగాణ-లండన్
ప్రపంచ నం.1, టాప్ సీడ్ ఆష్లె బార్టీ (ఆస్ట్రేలియా) అదరగొట్టింది. తన రోల్‌మోడల్ ఆసీస్ గ్రేట్ ఎవానె గూలగోంగ్ కావ్లీ తర్వాత వింబుల్డన్ టైటిల్ సాధించిన క్రీడాకారిణిగా బార్టీ రికార్డు సాధించింది. తొలిసారి ఫైనలిస్ట్‌ల నడుమ సెంటర్ కోర్టు సమరం మూడు సెట్లకు దారితీయగా.. 116 నిమిషాల పోరులో బార్టీ విజేతగా నిలిచింది. 2019 ఫ్రెంచ్ ఓపెన్‌తో తొలి గ్రాండ్‌స్లామ్ అందుకున్న బార్టీ.. తాజాగా వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచి రెండో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. 6-3, 6-7(4-7), 6-3తో ఆష్లె బార్టీ అద్భుత విజయం సాధించింది. వింబుల్డన్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచింది.
బార్టీ బూమ్‌బూమ్ : ఆష్లె బార్టీ, కరొలినా ప్లిస్కోవాలు ఇద్దరూ వింబుల్డన్‌లో గతంలో ఎన్నడూ ఫైనల్‌కు చేరుకోలేదు. ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. దీంతో శనివారం టైటిల్ పోరు రసవత్తరంగా సాగుతుందనే అంచనాలు. వరల్డ్ నం.1 ఆష్లె బార్టీ టైటిల్ పోరును ఏకపక్షం చేసింది. గణాంకాల పరంగా మ్యాచ్ మూడు సెట్లలో ముగిసినా.. సెంటర్ కోర్టులో ఆష్లె బార్టీ దూకుడుకు ఎదురులేదు. తొలి సెట్లోనే ప్లిస్కోవా లయ అందుకునేందుకు ఇబ్బంది పడింది. తొలి 14 పాయింట్లను ప్లిస్కోవా కోల్పోయింది. ఆరంభంలోనే సర్వీస్ బ్రేక్ చేసిన బార్టీ.. 4-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వరుస తప్పిదాలు చేసిన ప్లిస్కోవా మ్యాచ్‌లోకి వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆఖర్లో ప్లిస్కోవా పాయింట్లు, గేములు గెల్చుకున్నా అప్పటికే బార్టీ పని పూర్తి చేసుకుంది. 28 నిమిషాల్లోనే తొలి సెట్‌ను గెల్చుకుంది. రెండో సెట్లోనూ సర్వీస్ బ్రేక్ చేసిన బార్టీ 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్లిస్కోవా సైతం సర్వీస్ బ్రేక్ చేసి స్కోరును 3-3తో సమం చేసింది. ఇద్దరూ సర్వీస్‌లు నిలుపుకోవటంతో 5-5తో రెండో సెట్ రసవత్తరంగా సాగింది. టైబ్రేకర్‌లో బార్టీ వెనుకంజ వేయగా.. ప్లిస్కోవా రెండో సెట్‌ను కైవసం చేసుకుంది.
2012 తర్వాత వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ మూడో సెట్‌కు వెళ్లటం ఇదే ప్రథమం. గత 15 ఏండ్లలో రెండోసారి మాత్రమే. నిర్ణయాత్మక మూడో సెట్లో ఆష్లె బార్టీ చెలరేగింది. 3-0తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. ప్లిస్కోవా సైతం మూడు గేములు గెల్చుకున్నా.. సెట్లో చెక్ భామ అసలు రేసులోనే లేదు. ఏడు ఏస్‌లు సంధించిన బార్టీ, 30 విన్నర్లతో మెరిసింది. ఆరు ఏస్‌లు కొట్టిన ప్లిస్కోవా, ఐదు డబుల్ ఫాల్ట్స్‌కు పాల్పడింది. బార్టీ 29 అనవసర తప్పిదాలు చేయగా.. 32 అనవసర తప్పిదాలతో ప్లిస్కోవా మూల్యం చెల్లించుకుంది. పాయింట్ల పరంగా బార్టీ 88-78తో ముందంజ వేసింది. ప్లిస్కోవా సర్వీస్‌ను బార్టీ ఆరు సార్లు బ్రేక్ చేయగా.. ప్లిస్కోవా ఆ పని నాలుగు సార్లు చేసింది. 116 నిమిషాల టైటిల్ పోరులో 2-1తో గెలుపొందిన ఆష్లె బార్టీ వింబుల్డన్ మహిళల విజేతగా నిలిచింది.
జకోవిచ్‌కు ఎదురుందా? : వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ నేడు. వరల్డ్ నం.1 సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ రికార్డు కెరీర్ 20వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్నాడు. వింబుల్డన్ ఫైనల్లోకి చేరుకున్న తొలి ఇటలీ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించిన మాట్టో బెరెటిని సెమీస్‌లో సూపర్ విజయం సాధించాడు. తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ఫైనల్లో బెరెటిని మూడు సెట్లలోనే ఓడించిన జకోవిచ్.. నేడు ఫైనల్లోనూ అదే పునరావృతం చేయాలని చూస్తున్నాడు. సంచలన యాత్ర టైటిల్ విజయంతో ముగించాలనే తపన బెరెటినిలో కనిపిస్తున్నా.. జోకర్‌ను అడ్డుకోవటం అంత సులువు కాదు.