Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెరీర్ 20వ గ్రాండ్‌స్లామ్ సొంతం
- ఫెదరర్, నాదల్ సరసన జోకర్
- వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ 2021
లండన్ : జోకర్ సిక్సర్ కొట్టాడు. ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ సెంటర్ కోర్టులో ఆరో గ్రాండ్‌స్లామ్ విజయం అందుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఇటలీ ఆటగాడు మాట్టో బెరెటినిపై మెరుపు విజయం సాధించిన నొవాక్ జకోవిచ్ (సెర్బియా) కెరీర్ 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్ సర్క్యూట్లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ విజయాలు సాధించిన జాబితాలో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ సరసన సెర్బియా చిన్నోడు నిలిచాడు. నాలుగు సెట్ల అంతిమ సమరంలో 6-7(4-7), 6-4, 6-4, 6-3తో జకోవిచ్ విజయం సాధించాడు. వింబుల్డన్ ఫైనల్స్‌కు చేరిన తొలి ఇటాలియన్గా చరిత్ర సృష్టించిన బెరెటిని.. తొలి సెట్ జోరును కొనసాగించటంలో విఫలమయ్యాడు. ఫైనల్లో జకోవిచ్ దూకుడుగా ఆడాడు. తొలి సెట్లో ఆరంభంలోనే బ్రేక్ పాయింట్ సాధించాడు. 5-2తో దూసుకెళ్లాడు. వేగంగా పుంజుకున్న బెరెటిని 4-5, 5-5, 6-6తో స్కోరు సమం చేశాడు. టైబ్రేకర్‌లో 7-4తో గెలుపొందాడు. రెండో సెట్లోనూ జకోవిచ్ 4-0తో మెరుపు ఆరంభం సాధించాడు. బెరెటిని పుంజుకునే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. మూడు, నాలుగు సెట్లలోనూ జకోవిచ్‌కు ఎదురులేకుండా పోయింది. 203 నిమిషాల ఫైనల్లో జకోవిచ్ ఐదు ఏస్‌లు, ఐదు బ్రేక్ పాయింట్లు సాధించాడు. 16 ఏస్‌లు, 57 విన్నర్లతో మెరిసిన బెరెటిని.. 47 అనవసర తప్పిదాలతో వెనుకంజ వేశాడు.