Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-2020 ఒలింపిక్స్‌లో ఐఓసీ నూతన నిబంధనలు
టోక్యో (జపాన్) : కరోనా వైరస్ మహమ్మారి ప్రమాద ఘంటికల నడుమ జరుగుతున్న విశ్వ క్రీడలు.. వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా నూతన నిబంధనలు రూపొందించుకుంటుంది. ఇప్పటికే పలు భిన్న నిబంధనలు తీసుకొచ్చిన టోక్యో నిర్వాహకులు, అంతర్జాతీయ ఒలింపిక్ కౌన్సిల్ (ఐఓసీ).. తాజాగా మరో నిబంధనను ప్రవేశపెట్టింది. జట్టు ఈవెంట్లలో ఏ ఆటగాడైనా పాజిటివ్‌గా తేలితే.. మ్యాచ్ వాయిదా పడదని షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని గతంలోనే విస్పష్టంగా ప్రకటించారు. అయితే, వ్యక్తిగత ఈవెంట్లలో ఓ అథ్లెట్ వైరస్ బారిన పడితే అప్పుడు ఎలా? అనే ప్రశ్న రావటంతో ఐఓసీ సమాధానంతో ముందుకొచ్చింది. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలో ఏ స్ప్రింటర్ అయినా కోవిడ్ బారిన పడితే.. హీట్స్ (రౌండ్)లో తర్వాతి ఉత్తమ స్ప్రింటర్‌ను రేసులో నిలబెడతారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లు ఒక్క రోజులో ముగియవు. దీంతో ఐఓసీ, స్పోర్ట్స్ స్పెసిఫిక్ రెగ్యులేషన్స్ (ఎస్ఎస్ఆర్) ఈ నిబంధననను ప్రవేశపెట్టాయి. ఒకే రోజులో ముగిసే 10,000 మీటర్ల రేసు, మారథాన్ వంటి ఈవెంట్లకు ఈ నిబంధన వర్తించదు. అదే విధంగా రెజ్లింగ్‌లో ఫైనల్స్‌కు చేరిన రెజ్లర్ కోవిడ్‌కు గురైతే.. సెమీస్‌లో అతడి చేతిలో ఓడిన రెజ్లర్ పసిడి పోరుకు అర్హత సాధించనున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లు జులై 30-ఆగస్టు 8న జరుగనున్నాయి. టోక్యోకు భారత్ 26 మంది ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ల బృందాన్ని పంపించనుంది.