Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోపా అమెరికా చాంప్ అర్జెంటీనా
- ఫైనల్లో బ్రెజిల్‌పై 1-0తో విజయం
ఆధునిక ఫుట్‌బాల్‌లో అత్యుత్తమ ఆటగాడు. పది లాలిగా టైటిళ్లు, నాలుగు చాంపియన్స్ లీగ్ ట్రోఫీలు. ఆరు సార్లు ఫిఫా బల్లాన్ డీ అవార్డు సొంతం. సాకర్‌లో ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి.
అంతర్జాతీయ యవనికపై ప్రభావం చూపలేదని పదేపదే విమర్శకులు వేలెత్తి చూపటం సహజకృత్యమైంది. అర్జెంటీనా తరఫున నాలుగు ప్రపంచకప్‌లు, ఐదు కోపా అమెరికా కప్‌లలో ప్రాతినిథ్యం వహించినా అంతర్జాతీయ టైటిల్ అందని ద్రాక్షగా మిగిలింది.
2014 ఫిఫా ప్రపంచకప్‌లో అద్వితీయ విజయానికి చేరువగా వచ్చినా, నిరాశ తప్పలేదు. కోపా అమెరికాలో 2007, 2015, 2016లలో ఫైనల్‌కు చేరినా రన్నరప్‌గా నిలిచి భంగపడ్డాడు. 34 ఏండ్ల వయసులో అంతర్జాతీయ టైటిల్ ఇక అసాధ్యమే అనుకునే తరుణం.
నాలుగు గోల్స్, ఐదు గోల్స్‌కు అవకాశాలు సృష్టించాడు. అర్జెంటీనా సాధించిన 12 గోల్స్‌లో ఏకంగా 11 గోల్స్లలో అతడి ప్రమేయం సుస్పష్టం. చిరకాల ప్రత్యర్థి బ్రెజిల్‌ను వారి సొంతగడ్డపై 1-0తో ఓడించి అర్జెంటీనా తరఫున తొలి మెగా టైటిల్ అందుకున్నాడు. అతడే సాకర్ సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ.
నవతెలంగాణ-రియో డీ జనీరియో
ఓ దేశం 28 సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఓ యోధుడి 15 ఏండ్ల నిరంతర ప్రయతానికి ప్రతిఫలం లభించింది. 1993 (కోపా అమెరికా) తర్వాత అర్జెంటీనా తొలిసారి అంతర్జాతీయ టైటిల్ సాధించగా.. జాతీయ జట్టు తరఫున లియోనల్ మెస్సీ తొలి మెగా టైటిల్ ముద్దాదాడు. చిరకాల ప్రత్యర్థులు, ఫుట్‌బాల్ పవర్‌హౌస్‌లు బ్రెజిల్, అర్జెంటీనాల నడుమ జరిగిన కోపా అమెరికా కప్ ఫైనల్లో 1-0తో అర్జెంటీనా అద్వితీయ విజయం సాధించింది. ఆట ప్రథమార్థం 22వ నిమిషంలోనే అర్జెంటీనా గెలుపు కొట్టేసింది. అటాకింగ్ మిడ్‌ఫీల్డర్ డి మారియో సూపర్ గోల్‌తో బ్రెజిల్‌ను వెనక్కి నెట్టేశాడు. టోర్నీలో నాలుగు గోల్స్‌లో అద్వితీయ ప్రదర్శన ప్రదర్శన చేసిన లియోనల్ మెస్సీ కోపా అమెరికా కప్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' అవార్డును అందుకున్నాడు. 90 నిమిషాల ఆట అనంతరం తుది విజిల్ వేయగానే.. లియోనల్ మెస్సీని భుజాలపైకి ఎత్తుకున్న అర్జెంటీనా ఆటగాళ్లు విజయ సంబురాలు చేసుకున్నారు.
మరపురాని విజయం : ' ఇదే నా కెరీర్ చివరి ఫైనల్ మ్యాచ్'.. బ్రెజిల్‌తో కోపా అమెరికా ఫైనల్‌కు ముందు జట్టు సహచరులతో కెప్టెన్ లియోనల్ మెస్సీ మాటలివి. గాయంతోనే సెమీఫైనల్, ఫైనల్లో బరిలోకి దిగిన మెస్సీ జట్టును ముందుండి నడిపించాడు. మెస్సీ మైదానంలో ఉంటే ప్రత్యర్థి జట్టులో వణుకు, సొంత జట్టుకు లభించే విశ్వాసాన్ని గమనంలో ఉంచుకుని గాయంతోనే మెస్సీ బరిలో నిలిచాడు. అర్జెంటీనా కోచ్ లియోనల్ స్కలోని వ్యూహాత్మక ఎత్తుగడలతో బ్రెజిల్‌ను బోల్తా కొట్టించాడు. సెమీఫైనల్లో కొలంబియాపై ఆడిన జట్టులో సగం మందిని ఆరంభ ఎలెవన్‌లోకి తీసుకోలేదు. టోర్నీలో మెప్పించిన మిడ్ ఫీల్డర్ గిడో రొడ్రిగజ్, నికోలస్ గోన్జలెజ్లు ఆరంభ ఎలెవన్‌లో నిలువలేదు. బలమైన బ్రెజిల్ ఎదురుదాడికి విరుగుడుగా 4-3-3కు బదులుగా 4-4-2 లైన్ అప్ను అనుసరించిన అర్జెంటీనా ఫలితం సాధించింది.
అటాకింగ్ మిడ్ఫీల్డ్తో బ్రెజిల్ దూకుడు అడ్డుకట్ట వేయటంతో పాటు బ్రెజిల్ గోల్ పోస్ట్‌పై దాడులు చేసేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి. మరో మిడ్‌ఫీల్డర్ డీ పాల్ అందించిన పాస్‌తో 22వ నిమిషంలో ఎంజెల్ డి మారియో గోల్ కొట్టాడు. చాకచక్కంగా బంతిని బ్రెజిల్ గోల్‌పోస్ట్ చేరువకు తీసుకెళ్లిన డీ మారియో.. గోల్కీపర్ను బురిడీ కొట్టిస్తూ అతడి తలమీదుగా బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించాడు. ఆ గోల్‌తో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లిన అర్జెంటీనా.. బ్రెజిల్‌ను నిలువరించి అంతిమ విజేతగా అవతరించింది. జాతీయ జట్టు తరఫున అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా పీలేను అధిగమించేందుకు ఓ గోల్ వెనుకంజలో ఉన్న మెస్సీ... మెగా ఫైనల్లో గోల్ చేసే అవకాశాన్ని చేజేతులా చేజార్చుకున్నాడు. గోల్‌పోస్ట్ పైకి వెళ్లిన మెస్సీ.. ఆఖరు క్షణాల్లో సమన్వయం కోల్పోయి.. కిందపడిపోయాడు. ఆ తర్వాత రెండు నిమిషాలకే తుది విజిల్ మోగటంతో కోపా అమెరికా కప్ అర్జెంటీనా వశమైంది. అర్జెంటీనా సంబురాలు కొనసాగు తుండగా.. బ్రెజిల్ స్టార్ ఆటగాడు, బార్సిలోనా మాజీ సహచరుడు నెమ్ మార్ జూనియర్‌ను లియోనల్ మెస్సీ ఓదార్చటం గుర్తుండిపోయే సంఘటనగా నిలువనుంది.
ఫైనల్ సాగిందిలా..
అర్జెంటీనా బ్రెజిల్
06 షాట్లు 13
40 % నియంత్రణ 60 %
345 పాసులు 488
19 ఫౌల్స్ 22
05 ఎల్లో కార్డ్స్ 04
00 ఆఫ్సైడ్స్ 03
01 కార్నర్స్ 04