Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫెదరర్, నాదల్ సరసన జోకర్
- అత్యధిక గ్రాండ్‌స్లామ్ రికార్డుకు చాన్స్
నవతెలంగాణ క్రీడావిభాగం
ముగ్గురు దిగ్గజాలు, 18 సంవత్సరాలు, 60 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు. టెన్నిస్ చరిత్ర అరుదైన శకంలో విహరిస్తోంది. ఒకే సమయంలో ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు టెన్నిస్‌లో ఆల్ టైమ్ గ్రేట్ కోసం పోటీపడుతున్నారు. స్విస్ యోధుడు రోజర్ ఫెదరర్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్‌లలో ఎవరు అత్యుత్తమనే చర్చకు త్వరలోనే ముగింపు పడనుంది!. ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో ఏకంగా ఆరో వింబుల్డన్ సాధించిన నొవాక్ జకోవిచ్.. రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ సరసన చేరాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ప్రస్తుతం 20 గ్రాండ్‌స్లామ్ విజయాలతో సమవుజ్జీలుగా ఉన్నారు. గత 18 ఏండ్లలో 70 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు జరుగగా.. ఈ ముగ్గురే 60 గ్రాండ్‌స్లామ్ విజయాలను అందుకున్నారు.
జకోవిచ్‌కే అవకాశం : రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ గ్రాండ్‌స్లామ్ రేసు నుంచి తప్పుకున్నట్టే భావించవచ్చు. ఫిట్నెస్, వయసు రీత్యా మునుపటి స్థాయిలో రాణించే అవకాశం లేదు. ఆ ఇద్దరి కంటే చిన్నవాడైన జకోవిచ్.. గ్రాండ్‌స్లామ్ రేసులో ఇప్పటికీ మొనగాడే. అతడు కనీసం మరో ఐదు గ్రాండ్‌స్లామ్ విజయాలు సాధించే అవకాశం లేకపోలేదు. దీంతో టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్ స్లామ్‌లు గెల్చుకున్న రికార్డును జకోవిచ్ సాధించనున్నాడు!. మార్గరెట్ కోర్టు (24), సెరెనా విలియమ్స్ (23), స్టెఫీగ్రాఫ్ (22)లు ప్రస్తుతం గ్రాండ్‌స్లామ్ రేసులో ముందున్నారు. 20 టైటిళ్లతో ఫెదరర్, నాదల్, జకోవిచ్ సమవుజ్జీలుగా నిలిచారు. కెరీర్ ఫామ్‌లో ఉన్న జకోవిచ్.. ఫెదరర్, నాదల్‌ను వెనక్కి నెట్టేందుకు ఇంకెంతో కాలం వేచి చూడడు.
ఆదరణా ముఖ్యమే! : 2019 వింబుల్డన్ ఫైనల్. రోజర్ ఫెదరర్ మ్యాచ్ పాయింట్‌కు సర్వ్ చేస్తున్నాడు. 'కమాన్ రోజర్' అంటూ అభిమానుల అరుపులు. స్టాండ్స్‌లో జకోవిచ్‌కు మద్దతు అత్యంత స్వల్పం!. ఆ ఏడాది యు.ఎస్ ఓపెన్‌లోనూ జకోవిచ్‌కు అదే అనుభవం. అభిమానుల మద్దతు లేకపోయినా.. జకోవిచ్ అద్వితీయ విజయాలు సాధించాడు. బెరెటినితో ఫైనల్లోనూ అభిమానులు ఇటలీ ఆటగాడికే దన్నుగా నిలిచారు. ఆదరణ లేమి జకోవిచ్ జోరును అడ్డుకోలేదు. ఫిట్నెస్, ఫామ్ నిలుపుకుంటే అత్యధిక గ్రాండ్‌స్లామ్ రికార్డును రానున్న రెండేండ్లలో సాధించగల సత్తా జకోవిచ్ సొంతం. గణాంకాల పరంగా అత్యుత్తమ ఆటగాడిగా ఎవరూ కాదనలేరు. గ్రాండ్‌స్లామ్ విజయాలతో పాటు అభిమానులను సైతం గెల్చుకుంటేనే ఆల్‌టైమ్ గ్రేట్‌కు అందరి ఆమోద ముద్ర పడుతుంది. ఆ దిశగా జకోవిచ్ అడుగులు వేస్తాడేమో చూడాలి.
'నన్ను నేను ఉత్తమ ఆటగాడిగానే భావిస్తాను. లేదంటే, గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు, రికార్డుల వేటలో ఆత్మవిశ్వాసంగా ఉండలేను. నేను ఆల్‌టైమ్ గ్రేట్ అనే వాదనను ప్రజలకే వదిలేస్తున్నాయి. భిన్న తరాల ఆటగాళ్లను పోల్చటం అతికష్టం. 50 ఏండ్లతో పోల్చితే రాకెట్లు, టెక్నాలజీ, బాల్స్, కోర్టులు..ఇలా ఎన్నో మార్పులు. పూర్తిగా భిన్నమైన పరిస్థితుల్లో ఆడుతున్నాం. అయితే, ఆల్‌టైమ్ గ్రేట్ చర్చలో నేనూ భాగమైనందుకు గర్వపడుతున్నాను'
- నొవాక్ జకోవిచ్