Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హోమ్ కాదు రోమ్
- పెనాల్టీలో 3-2తో ఇటలీ గెలుపు
- యూరో చాంపియన్‌గా ఇటలీ
- యూరో ఫుట్‌బాల్ కప్ 2020
ఇంగ్లాండ్ కల చెదిరింది. 55 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడుతుందనే అంచనాలు ఆవిరయ్యాయి. సాకర్‌లో మెగా టైటిల్ కోసం 20,000 రోజులకు పైగా ఎదురుచూసిన ఇంగ్లాండ్.. గుండె పగిలింది. అచ్చిరాని పెనాల్టీ షూటౌట్ మరోసారి ఇంగ్లాండ్‌ను చావుదెబ్బ తీసింది. 1990, 1996, 1998, 2004, 2006, 2012 (ప్రపంచకప్, యూరో కప్) టోర్నీలలో పెనాల్టీ షూటౌట్లు ఇంగ్లాండ్‌ను వెక్కిరించగా.. మూడు సింహాల కలను మరోసారి షూటౌట్ చిదిమేసింది.
నాలుగు ప్రపంచకప్‌లు, ఓ యూరో కప్ సాధించినా.. 2018 ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించలేదు. ఇటలీ జాతీయ క్రీడారంగానికి ఇది అవమానంగా భావించారు. ఆ కసితోనే యూరోలో అడుగుపెట్టిన ఇటలీ.. 53 ఏండ్ల తర్వాత రెండో యూరో కప్‌ను సొంతం చేసుకుంది. పెనాల్టీ షూటౌట్లో 3-2తో పైచేయి సాధించిన ఇటలీ.. 2020 యూరోకప్ చాంపియన్‌గా అవతరించింది. 'ఇట్స్ కమింగ్ హౌమ్' అంటూ ఇంగ్లాండ్ అభిమానులు ముందస్తు సంబురాలు చేసుకోగా.. యూరో కప్ హౌమ్ (ఇంగ్లాండ్)కు కాకుండా రోమ్ (ఇటలీ)కి వెళ్లిపోయింది.
నవతెలంగాణ-లండన్
పెనాల్టీ షూటౌట్ ఇంగ్లాండ్‌ను వేదనలోకి నెట్టివేసింది. 55 ఏండ్ల అనంతరం సాకర్ టైటిల్ అందుకోవాలని ఉబలాటపడిన ఇంగ్లాండ్ ట్రోఫీ వేటకు ఇటలీ చెక్ పెట్టింది. 2020 యూరోపియన్ కప్ ఫైనల్లో 3-2 (పెనాల్టీ)తో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించింది. మ్యాచ్ పూర్తి సమయం అనంతరం ఇంగ్లాండ్, ఇటలీ 1-1తో సమవుజ్జీలు నిలిచాయి. 30 నిమిషాల అదనపు సమయంలోనూ విజేత తేలలేదు. దీంతో పెనాల్టీ షూటౌట్లో యూరో హీరోను తేల్చారు. 1968లో తొలిసారి యూరోకప్ విజేతగా నిలిచిన ఇటలీ.. 53 ఏండ్ల అనంతరం యూరోలో రెండోసారి టైటిల్‌ను అందుకుంది. నాలుగు ప్రపంచకప్‌లు గెలిచిన ఇటలీ.. తాజాగా రెండో యూరోకప్ను ఖాతాలో వేసుకుంది.
ఆరంభం ఇంగ్లాండ్ది : 1966, జులై 30 తర్వాత ఇంగ్లాండ్ అంతటి మరుపురాని రోజును వేడుక చేసుకునేందుకు ముంద స్తుగానే రంగం సిద్ధం చేసుకున్నారు. డిఫెండర్ ల్యూక్ షా మ్యాచ్ ఆరంభమైన రెండో నిమిషంలోనే మెరుపు గోల్ కొట్టి.. ఇంగ్లాండ్ అభిమానులు గెలుపు పల్లకిలో విహరించేలా చేశాడు. ఓ యూరోపియన్ ఫైనల్లో ఇదే అత్యంత వేగవంతమైన గోల్. ఇటలీ గోల్‌పోస్ట్ దగ్గరే కాచుకున్న షా ఇంగ్లాండ్‌ను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. తొలి అర్థభాగం ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 1-0 ముందంజతో మెరుగ్గా కనిపించింది.
సమం ఇటలీ వంతు : యూరోకప్ ఫైనల్స్‌కు ముందు వరకు ఇటలీ 33 మ్యాచులుగా ఓటమెరుగదు. ఇంగ్లాండ్ ఆధిక్యంలో నిలిచినా.. ఇటలీ క్రమం తప్పకుండా గోల్ ప్రయత్నాలు చేసింది. గోల్‌పోస్ట్‌పై 19 సార్లు దాడి చేసిన ఇటలీ.. ఆరుసార్లు లక్ష్యంపై గురిపెట్టింది. 67వ నిమిషంలో ఇంగ్లాండ్ గోల్‌పోస్ట్‌పై దండయాత్ర చేసిన ఇటలీ.. రెండో ప్రయత్నంలో గోల్ కొట్టింది. ట్రిప్పీర్ షాట్‌ను ఇంగ్లాండ్ గోల్‌కీపర్ నిలువరించగా.. అక్కడే ఉన్న లియోనార్డో బొనుచి బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. 1-1తో స్కోరు సమం చేసిన ఇటలీ మ్యాచ్‌పై తిరిగి పట్టు సాధించింది. 90 నిమిషాల ఆట పూర్తయ్యేసరికి ఇటలీ, ఇంగ్లాండ్ 1-1తో సమవుజ్జీలుగా నిలిచాయి. 30 నిమిషాల అదనపు సమయం ఉత్కంఠగా సాగినా.. ఏ జట్టూ గోల్ కొట్టలేదు.
పెనాల్టీతో ఇటలీ ముగింపు : పెనాల్టీ షూటౌట్లోనూ ఆరంభంలో ఇంగ్లాండ్ హవా నడిచింది. తొలి రెండు పెనాల్టీలను హ్యారీకేన్, హ్యారీ మాగురెలు గోల్స్‌గా మలిచారు. ఇటలీ తరఫున డొమానికో బెరార్డి గోల్ కొట్టగా.. ఆండీ బెలొటి మిస్ ఫైర్ అయ్యాడు. 2-1తో ఇంగ్లాండ్ ముందంజలో నిలిచింది. చివరి మూడు పెనాల్టీలలో ఇటలీ రెండింటిని గోల్స్‌గా మలచగా.. ఇంగ్లాండ్ మూడింటినీ కోల్పోయింది. ఆఖర్లో బుకయో సకాకు సమం చేసే అవకాశం లభించినా.. ఇటలీ గోల్‌కీపర్ అద్భుతంగా అడ్డుకున్నాడు. ఇటలీకి అదిరే విజయాన్ని కట్టబెట్టాడు.
సంబురాల్లో ఇటలీ
నరాలు తెగే ఉత్కంఠకు దారితీసిన యూరో ఫైనల్లో ఇంగ్లాండ్ ఆటగాడు బుకాయో సకా పెనాల్టీ మిస్ అవగానే.. ఇటలీ సంబురాల్లో మునిగిపోయింది. రోమ్ ఫ్యాన్ పార్క్‌లో వేలాది మంది అభిమానులు అరుపులు, కేరింతలతో ఆనందోత్సవాలు చేసుకున్నారు. ఇటలీ వ్యాప్తంగా యూరో విజయ సంబురాలు కనిపించాయి. రాత్రంతా వీధుల్లోనే తిరుగుతూ, నృత్యాలు చేస్తూ అభిమానులు వేడుక చేసుకున్నారు. కొన్నిచోట్ల అభిమానుల సంబురాలు శృతిమించాయి.
జాతి వివక్ష దుమారం
యూరో ఫైనల్లో ఇంగ్లాండ్‌తో ఆ జట్టు అభిమానులు విచక్షణ కోల్పోయారు. పెనాల్టీ షూటౌట్లో విఫలమైన మార్కస్ రాష్‌ఫోర్డ్, జేడన్ సాంచో, బుకాయో సకాలపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. వర్ణ వివక్షను యుకె ప్రధాని బోరీస్ జాన్సన్, ఫుట్‌బాల్ అసోసియేషన్ ఖండిచారు. ' జాతి వివక్షను ఉపేక్షించం. ఇంగ్లాండ్ జట్టు గర్వపడే ప్రదర్శన చేసింది. సాకర్ ఆటగాళ్లు హీరోలు, వారిపై జాతి వివక్ష వ్యాఖ్యలు దారుణం. ఆ పని చేస్తున్నవారు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది' అని బోరీస్ జాన్సన్ తెలిపారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా యూరో ఫైనల్‌కు ముందు ఇంగ్లాండ్ జట్టు మోకాళ్లపై కూర్చొని సంఘీబావం తెలిపింది.
పెనాల్టీ షూటౌట్ (3-2)
ఇటలీ ఇంగ్లాండ్
బెరార్డి(1) హ్యారీకేన్ (1)
బెలొటి(0) మగురే(1)
బొనుచి(1) రాష్‌ఫోర్డ్(0)
ఫెడిరికో(1) శాంచో (0)
జొర్గిన్హో (0) సకా (0)
ఫైనల్ సాగిందిలా (1-1)
ఇటలీ ఇంగ్లాండ్
19 షాట్లు 06
66 నియంత్రణ 34
820 పాసులు 426
21 ఫౌల్స్ 13
05 ఎల్లోకార్డ్స్ 01
05 ఆఫ్సైడ్స్ 01
03 కార్నర్స్ 05