Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అథ్లెట్ల కుటుంబ సభ్యులకు చోటు
- వ్యక్తిగత కోచ్‌లకు దక్కని ప్రాధాన్యం
- టోక్యో ఒలింపిక్స్ తుది జాబితా ఖరారు
టోక్యో ఒలింపిక్స్. భారత్ కనీవినీ ఎరుగుని రీతిలో 228 మంది సభ్యుల మెగా బృందాన్ని విశ్వ క్రీడలకు పంపుతోంది. అందులో ఏకంగా 119 మంది అథ్లెట్లు ఉన్నారు. అథ్లెట్లు ఒలింపిక్స్ మెడల్స్ కొల్లగొట్టేందుకు ప్రక్రియకు దోహదం చేసే అన్ని అవసరాలను చూసుకోవాల్సిన బాధ్యత భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) వంతు. అథ్లెట్ల అవసరాలు గుర్తించటం, కీలక అధికారుల బృందంలో అవసరమైన వారిని ఎంపిక చేయటంలో ఐఓఏ కింకర్తవ్యం వహించింది. ఫలితంగా, టోక్యో ఒలింపిక్స్‌లో కొందరు అథ్లెట్లు వ్యక్తిగత కోచ్‌లు లేకుండానే బరిలోకి దిగుతున్నారు.
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రపంచ నం.1 బాక్సర్ అమిత్ పంఘాల్. టోక్యో ఒలింపిక్స్‌లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతున్న ఏకైక భారత్ అమిత్ పంఘాల్. టోక్యో ఒలింపిక్స్‌లో వ్యక్తిగత కోచ్ అనిల్ ధన్కర్ అవసరం ఎంతో ఉందని, అతడు పోటీల్లో తనతో పాటు ఉండటం ఎంతో ముఖ్యమని అమిత్ పంఘాల్ పదేపదే ఐఓఏకు విన్నవించాడు. అయినా, భారత ఒలింపిక్ సంఘం అతడి అవసరాన్ని, వినతిని పట్టించుకోలేదు. టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లనున్న అధికారుల జాబితా ఖరారు కాగా.. అందులో అనిల్ ధన్కర్కు చోటు దక్కలేదు.
భారత బ్యాడ్మింటన్ స్టార్ షట్లర్ బి. సాయిప్రణీత్. సహజంగా బ్యాడ్మింటన్‌లో కోచ్‌లు విరామ సమయంలో వ్యూహాత్మక ఎత్తుగడలు వివరిస్తారు. అనవసర పొరపాట్లు, ప్రత్యర్థి ఆడుతున్న శైలిని డీకోడ్ చేసి.. కౌంటర్ గేమ్ ప్లాన్ అక్కడిక్కడే నూరిపోస్తారు. అయితే, ఈ అవసరాన్ని భారత ఒలింపిక్ సంఘం విస్మరించింది. టోక్యోకు వెళ్లనున్న భారత అధికారుల జాబితాలో సాయిప్రణీత్ వ్యక్తిగత కోచ్ పేరును చేర్చినా.. అతడు ఒలింపిక్ గ్రామంలోకి వెళ్లడానికి అనుమతి ఉండదు. మ్యాచ్ సమయంలో సాయిప్రణీత్‌కు అండగా నిలబడే అవకాశం అంతకంటే దక్కదు. కామన్వెల్త్ క్రీడల సందర్బంగా పలు విమర్శలకు దారితీసిన అధికారుల జాబితా ఎంపికతో.. ఐఓఏ కీలక నిర్ణయాలు తీసుకుంది. భవిష్యత్‌లో అథ్లెట్ల కుటుంబ సభ్యులకు అధికారుల జాబితాలో స్థానం ఇవ్వమని తేల్చి చెప్పింది. కానీ టోక్యో ఒలింపిక్స్‌కు ఆ నిబంధనలను పాటించినట్టు ఎక్కడా కనిపించటం లేదు. అథ్లెట్ల వ్యక్తిగత కోచ్‌లను టోక్యోకు పంపించేందుకు ఇష్టపడిన భారత ఒలింపిక్ సంఘం.. కొందరు అథ్లెట్ల కుటుంబ సభ్యులకు మాత్రం అధికారుల జాబితాలో చోటివ్వటం గమనార్హం.
ఐఓఏ బాధ్యతారాహిత్యం : కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో టోక్యో ఒలింపిక్ నిర్వాహకులు కఠిన నిబందనలు విధించారు. ఈ కారణంతోనే భారత ఒలింపిక్ సంఘం ముఖ్యమైన వ్యక్తుల పేర్లను విస్మరించింది. సాయిప్రణీత్ వ్యక్తిగత కోచ్ ఆగస్ ద్వి సంటాసో (ఇండోనేషియా) కోసం దిగ్గజ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తన స్థానాన్ని వదులుకున్నారు. ఇప్పుడు ఒలింపిక్ గ్రామంలోకి అతడికి ప్రవేశం లేదు. దీంతో పుల్లెల గోపీచంద్ త్యాగానికి అర్థమే లేకుండా పోయింది. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారి పోటీపడుతున్న తమిళనాడు ఫెన్సర్ సి.భవానీ దేవి తల్లికి అధికారుల బృందంలో స్థానం కల్పించారు. టేబుల్ టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి వ్యక్తిగత కోచ్‌కూ చోటు దక్కింది. టోక్యో ఒలింపిక్స్‌లో టాప్ సీడ్ బాక్సర్‌గా ఆడనున్న అమిత్ పంఘాల్ ఐఓఏ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నాడు. ' నేను ఏం చేయలేను. అధికారులను ఒప్పించేందుకు శాయశక్తులా ప్రయత్నించాను' అని పంఘాల్ నిరాశగా అన్నాడు. భవానిదేవి తల్లి సి.ఏ సుందరమన్ రమణి నలుగురు సభ్యుల ఫెన్సింగ్ బృందంలో ఉన్నారు. ఫెన్సింగ్ జట్టు మేనేజర్‌గా సుందరమన్ రమణి ఒలింపిక్స్‌కు వెళ్లనున్నారు. టేబుల్ టెన్నిస్ సమాఖ్య సిఫారసులకు విరుద్ధంగా మోనిక బత్రా వ్యక్తిగత కోచ్ సంజరు పరంజ్పెను ఆమె వ్యక్తిగత కోచ్ హౌదాలోనే టోక్యోకు పంపిస్తున్నారు. ఆరుగురు సభ్యులు టేబుల్ టెన్నిస్ బృందంలో.. మోనిక బత్రాకు మాత్రమే వ్యక్తిగత కోచ్‌ను కేటాయించారు. సుందరమన్ రమణి, సంజరులు అదనపు అధికారులుగా చేర్చబడ్డారు. వీరి టోక్యో ఖర్చులు కేంద్ర ప్రభుత్వం కాకుండా.. ఐఓఏ భరించనుంది.
మరోవైపు స్టార్ షట్లర్ పి.వి సింధు వ్యక్తిగత కోచ్‌కు బృందంలో చోటు లభించింది. కొరియా కోచ్ పార్ తే సంగ్, ఫిజియోథెరపిస్ట్ ఎవాంగ్లే బడామ్ సేవలు సింధు టోక్యోలో వినియోగించుకోనుంది. టెన్నిస్‌లో మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా, అంకిత రైనాలకు కోచ్‌ను కేటాయించలేదు. దీంతో ఈ జోడీ కోచ్ లేకుండా బరిలోకి దిగనుంది. షుటింగ్ విభాగంలో విదేశీ కోచ్ పావెల్ సిమిర్నోవ్, పిస్టల్ కోచ్ జస్పాల్ రానాలకు చోటు దక్కలేదు.
గతంలోనూ ఇటువంటి సంఘనలు చోటుచేసుకున్నాయి. లండన్ ఒలింపిక్స్ సమయంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తల్లి నసీమా మీర్జా భారత జట్టు మేనేజర్‌గా లండన్‌కు ప్రయాణించింది. 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల సమయంలో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తన తండ్రి హర్వీర్ సింగ్ విషయంలో.. క్రీడల నుంచి తప్పుకుంటానని బెదిరించిన సంగతి తెలిసిందే.
వీటికి తోడు ఇతర పలు సంఘటనల నేపథ్యంలో 'నో పేరేంట్స్' విధానాన్ని ఐఓఏ ఎంచుకుంది. 2018 జకర్తా ఆసియా క్రీడలకు అదే నిబంధనలను దృష్టిలో ఉంచుకుని భారత అధికారుల బృందాన్ని ఎంపిక చేసింది. కొందరు అథ్లెట్లను సంతృప్తిపరిచే క్రమంలో భారత ఒలింపిక్ సంఘం టోక్యో ఒలింపిక్స్ అధికారుల ఎంపికలో బాధ్యతారాహిత్యం ప్రదర్శించింది. ఐఓఏ నిర్లక్యం టోక్యోలో ఎటువంటి పరిణామాలకు దారితీయనుందో చూడాలి.