Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టోక్యో ఒలింపిక్స్‌లో కొత్త నిబంధన
టోక్యో (జపాన్) : 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మరొ కొత్త నిబంధన సరికొత్త అనుభూతి మిగిల్చనుంది. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే అథ్లెట్లకు పతకాలను ప్రదానం చేసేందుకు ఇక ఎవరూ ఉండరు. విజేతలుగా నిలిచిన అథ్లెట్లు పతకాలను తామే స్వయంగా ప్రదానం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్ కౌన్సిల్ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ వెల్లడించారు. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐఓసీ వెల్లడించింది. టోక్యో ఒలింపిక్స్‌లో 339 పతక ఈవెంట్లు జరుగనున్నాయి. 339 పతక ఈవెంట్లకు ఇదే నిబంధన వర్తించనుంది. 'ఈసారి మెడల్స్ అథ్లెట్ల మెడలో వేయటం లేదు. మెడల్స్‌ను ఓ ట్రేలో తీసుకొచ్చి అథ్లెట్లకు ఇవ్వనున్నాం. శానిటైజ్ చేసిన గ్లౌవ్స్‌తో ఆ పతకాలను ట్రేలో ఉంచుతారు. అథ్లెట్ల కంటే ముందెవరు ఆ మెడల్స్‌ను ముట్టుకోరు. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ను ఇది అడ్డుకుంటుంది' అని థామస్ బాచ్ పేర్కొన్నారు. దీనికి తోడు మెడల్ ప్రదాన కార్యక్రమంలో కౌగిలింతలు, కరచాలనాలకు చోటు లేదని స్పష్టం చేశారు. మాస్క్‌లు, గ్లౌవ్స్ ధరించిన అధికారులు మెడల్స్ బహుకరిస్తారని తొలుత వెల్లడించినా.. ఆఖర్లో ఐఓసీ నిర్ణయం మార్చుకుంది.
పంచ్ పడకుండానే పసిడి! : ఒలింపిక్ ఈవెంట్‌కు ఓ అథ్లెట్ కోవిడ్-19 పాజిటివ్‌గా తేలితే.. ఏం చేయాలనే అంశంపై వివిధ క్రీడాంశాల్లో అనుగుణమైన నిబంధనలు రూపొందిస్తున్నారు. ఒలింపిక్ బాక్సింగ్ ఈవెంట్లో ఏ బాక్సర్కైనా వైరస్ సోకితే.. ప్రత్యర్థికి బై ఇచ్చి తర్వాతి రౌండ్‌కు పంపిస్తారు. ఆ అథ్లెట్ 'డిడ్ నాట్ స్టార్ట్' కేటగిరీలో ఉండిపోతాడు. ఇక ఓ ఈవెంట్ ఫైనల్లో ఈ పరిస్థితి తలెత్తితే.. సెమీఫైనల్లో ఆ అథ్లెట్ చేతిలో ఓడిన బాక్సర్‌కు ఫైనల్ అవకాశం లభించదు. అందుకు భిన్నంగా ఫైనల్లో రెండో బాక్సర్‌ను పసిడి విజేతగా ప్రకటిస్తారు. కోవిడ్-19 సోకిన బాక్సర్‌కు సిల్వర్ మెడల్ లభించనుంది. ఈ మేరకు ఐఓసీ, బాక్సింగ్ ఫెడరేషన్ ప్రకటించాయి. ' ఒలింపిక్స్ బాక్సింగ్ పోటీల్లో కోవిడ్ సోకిన బాక్సర్లపై అనర్హత వేటు పడదు. 'డిడ్ నాట్ స్టార్ట్' అథ్లెట్‌గా ఉండిపోతారు. కోవిడ్ సోకిన బాక్సర్‌పై ప్రత్యర్థికి వాకోవర్ లభించనుంది. వైరస్ కారణంగా ఫైనల్లో తలపడే అవకాశం లేకపోతే.. పసిడి పోరు కొనసాగదు. ఫైనల్లో రెండో బాక్సర్‌కు పసిడి పతకం అందుతుంది. అథ్లెట్ల భద్రత కోసమే ఈ నిబంధనలని' బాక్సింగ్ సమాఖ్య వెల్లడించింది.
హాకీలో భిన్నం : హాకీ ఫెడరేషన్ భిన్నమైన నిబంధనలు రూపొందించింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఏ జట్టులోనైనా కోవిడ్-19 పాజిటివ్ కేసు వెలుగుచూస్తే.. ఆ జట్టు మైదానంలోకి బరిలోకి దిగే అవకాశం కోల్పోనుంది. ఇది నాకౌట్ రౌండ్లలో చోటుచేసుకుంటే.. ప్రత్యర్థి జట్టు తర్వాతి రౌండ్‌కు ప్రమోట్ అవనుంది. ఇక ఫైనల్స్‌కు చేరిన జట్టులో కోవిడ్ కేసు బయటపడితే.. సెమీఫైనల్లో ఆ జట్టు చేతిలో ఓడిన జట్టు పసిడి పోరుకు అర్హత సాధించనుంది. సెమీఫైనల్లో ఓడిన మరో జట్టు కాంస్య పతక మ్యాచ్ ఆడకుండానే కాంస్యం అందుకోనుంది. ఒకవేళ ఫైనల్‌కు చేరిన రెండు జట్లలోనూ కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైతే.. ఏం చేయాలనే అంశంపై హాకీ ఫెడరేషన్ స్పష్టత ఇవ్వలేదు.