Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవాళీ వర్కింగ్ కమిటీపైనే ఆశలు
- సాయం కోసం క్రికెటర్ల ఎదురుచూపులు
హైదరాబాద్ : 2020 డిసెంబర్ 1న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం.. దేశవాళీ క్రికెటర్లకు ఆర్థిక సాయం అందించేందుకు వర్కింగ్ కమిటీ ఏర్పాటుకు అపెక్స్ కౌన్సిల్‌కు అధికారం ఇస్తూ ఆమోదం తెలిపింది. ఏజీఎం ఆమోదం తెలిపిన ఆరు మాసాలకు గానీ అపెక్స్ కౌన్సిల్లో చలనం కనిపించలేదు. ఎట్టకేలకు రాష్ట్ర క్రికెట్ సంఘాల ప్రతినిధులు, మాజీ క్రికెటర్లతో కూడిన వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసినా.. దేశవాళీ క్రికెటర్లకు అందించాల్సిన ఆర్థిక సాయం, ఇతర అంశాలపై చర్చించేందుకు ఆ కమిటీ ఎప్పుడు సమావేశం అయ్యేది తెలియటం లేదు. రోహన్ జైట్లీ, యుధ్వీర్ సింగ్, జైదేవ్ షా, దేవజిత్ సైనిక, అవిషేక్ దాల్మియా, సంతోష్ మీనన్, మహ్మద్ అజహరుద్దీన్‌లు వర్కింగ్ కమిటీలో ఉన్నారు. వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేస్తూ బీసీసీఐ జులై 10న విడుదల చేసిన లేఖలో దేశవాళీ క్రికెటర్లకు అందించాల్సిన ఆర్థిక సాయం గురించి పేర్కొనలేదు. 'దేశవాళీ క్రికెటర్ల ఆర్థిక సాయం గురించి గుణాత్మక చర్చ జరుగుతుంది. గత సీజన్లో నష్టపోయిన మ్యాచులకు పరిహారం అందించటంపై దృష్టి పెడతాం. దేశవాళీ సీజన్‌కు బీసీసీఐ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. వేదికలను ఖరారు చేసేందుకు, కోవిడ్-19 ఇబ్బందులను తగ్గించేందుకు వర్కింగ్ కమిటీ పలు సూచనలు చేసే ఆస్కారం ఉంది' అని వర్కింగ్ కమిటీ సభ్యుడు ఒకరు తెలిపారు.
బీసీసీఐ వర్కింగ్ కమిటీలో రాష్ట్ర క్రికెట్ సంఘాల ప్రతినిధులుగా మాజీ క్రికెటర్లు సైతం ఉన్నారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజహరుద్దీన్ భారత మాజీ కెప్టెన్ కాగా.. సౌరాష్ట్ర క్రికెట్ చీఫ్ జైదేవ్ ఫస్ట్ క్లాస్‌లో అత్యధిక మ్యాచులకు కెప్టెన్సీ వహించినవాడు కావటం విశేషం. దీంతో క్రికెటర్లకు ఆర్థిక సాయం విషయంలో ఆలస్యమైనా న్యాయం జరుగుతుందనే భావన క్రికెట్ వర్గాల్లో కనిపిస్తోంది.