Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేసర్లు, మిడిల్ బ్యాటర్లు అవసరం
- మహిళల జట్టు కోచ్ రమేశ్ పొవార్
ఛెమ్స్‌ఫోర్డ్ : ప్రస్తుత మూస పద్దతిలోనే ఆడితే ప్రపంచంలో అన్ని జట్లు భారత్‌పై ఆధిపత్యం చెలాయిస్తాయని భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ రమేశ్ పొవార్ అన్నాడు. ఇంగ్లాండ్‌కు వన్డే, టీ20 సిరీస్ కోల్పోయిన అనంతరం రమేశ్ పొవార్ మీడియాతో మాట్లాడారు. 'మేము భయమెరుగని క్రికెట్ ఆడతాం, అదే చేయబోతున్నాం. కోచ్‌గా తొలి సిరీస్‌లోనే ఒత్తిడి చేయలేను. గత 2-3 ఏండ్లుగా ఓ పద్దతికి అలవాటు పడ్డారు. ఒక్కసారిగా పెనుమార్పు చోటుచేసుకోదు. భిన్నంగా ఆడాల్సిన అవసరంపై నేను క్రికెటర్లను ఒప్పించాల్సి ఉంది. మూడో టీ20లో 28/2తో ఉన్నా.. 153 పరుగులు చేయగలిగాం. ఏది ఏమైనా మనం భయమెరుగని క్రికెటే ఆడదామని జట్టులో చర్చించాం. ఒకవేళ అలా ఆడకుంటే.. ప్రతి జట్టూ మనపై ఆధిపత్యం చూపిస్తుంది' అని రమేశ్ పొవార్ అన్నాడు.
పేసర్ల బృందం అవసరం : 2022 వన్డే వరల్డ్‌కప్‌కు సన్నద్ధంగా భారత్ రెండు విభాగాల్లో మెరుగుపడాల్సి ఉంది. ఫాస్ట్ బౌలింగ్ వనరులను పెంచుకోవటం, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ మెరుగుపర్చుకోవటం. ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ నలుగురు పేసర్లనే ఆడించింది. శిఖా పాండే, జులన్ గోస్వామి, పూజ, అరుంధతి రెడ్డిలు పేస్ విభాగంలో ఉన్నారు. వరల్డ్‌కప్‌కు ముందు భారత్‌కు మరింత మంది పేసర్లు అవసరం. స్వదేశంలో శిక్షణ శిబిరంలో దేశవాళీలో మెరిసిన పొడవైన పేసర్లను క్యాంప్‌కు తీసుకుంటాం. ప్రపంచకప్‌కు ముందు 10-15 మందితో కూడిన పేసర్ల బృందాన్ని తయారు చేయాలి. మిడిల్ ఆర్డర్లో మిథాలీరాజ్ మాత్రమే రాణిస్తోంది. ఆమెకు సహకారం అందటం లేదు. వన్డే ఫార్మాట్లో పవర్‌ప్లే ముగిసిన అనంతరమే అసలైన ఆట ఆరంభం అవుతుంది. మిడిల్ ఓవర్లలో స్ట్రయిక్ రొటేషన్ చేస్తూ పరుగులు సాధించగల బ్యాటర్లు భారత్‌కు ఇప్పుడు అవసరమని రమేశ్ పొవార్ తెలిపాడు. ఇంగ్లాండ్ పర్యటనలో సిరీస్ ఓటమి చవిచూసినా.. కీలక పాఠాలు ఇక్కడ నేర్చుకున్నామని చీఫ్ కోచ్ అభిప్రాయపడ్డాడు.
సిరీస్ ఇంగ్లాండ్ సొంతం
నిర్ణయాత్మక మూడో టీ20లో భారత అమ్మాయిలు ఓటమి చెందారు. 154 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 18.4 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ డ్యానీ వ్యాట్ (89 నాటౌట్, 56 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్), నటాలీ సీవర్ (42, 36 బంతుల్లో 4 ఫోర్లు) చెలరేగటంతో ఇంగ్లాండ్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని సాధించింది. 2-1తో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. స్టార్ బ్యాటర్ స్మృతీ మంధాన (70, 51 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (36, 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 153/6 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌తో ఏకైక టెస్టును డ్రా చేసుకున్న భారత్.. వరుసగా వన్డే, టీ20 సిరీస్‌లను1-2 తేడాతో కోల్పోయింది.