Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సహాయక సిబ్బంది దయానంద్‌కు కోవిడ్
- ఐసోలేషన్‌లో భరత్ అరుణ్, సాహా, ఈశ్వరన్
- టెస్టు సిరీస్‌కు ముందు కోవిడ్-19 కలకలం
కరోనా వైరస్ మహమ్మారి భారత జట్టులోకి ప్రవేశించింది!. ఇంగ్లాండ్-పాకిస్థాన్.. శ్రీలంక, భారత్‌లను ప్రభావితం చేసిన కోవిడ్-19 డెల్టా వేరియంట్ తాజాగా భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌పైనా ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. భారత జట్టులో ఓ ఆటగాడు, మరో సహాయక సిబ్బంది కరోనా పాజిటివ్‌గా తేలగా.. ఇద్దరు క్రికెటర్లు, సహాయక సిబ్బంది ఐసోలేషన్‌లో ఉన్నారు.
నవతెలంగాణ-లండన్
భారత యువ క్రికెటర్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. భారత జట్టు నెట్ బౌలింగ్ సిబ్బంది దయానంద్ గరణి సైతం కోవిడ్-19 పాజిటివ్‌గా తేలాడు. జులై 8న రిషబ్ పంత్‌కు కరోనా పాజిటివ్‌గా అతడు ఐసోలేషన్‌లో కొనసాగుతున్నాడు. జులై 14న నిర్వహించిన ఆర్టీ పీసీఆర్ పరీక్షలో దయానంద్ పాజిటివ్‌గా తేలాడు. దయానంద్‌తో సన్నిహితంగా మెలిగిన భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ వృద్దిమాన్ సాహా, అదనపు ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్‌లు పది రోజుల ఐసోలేషన్‌లో ఉండనున్నారు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం అధికారికంగా వెల్లడించింది. దయానంద్ సహా భరత్ అరుణ్, వృద్దిమాన్ సాహా, అభిమన్యు ఈశ్వరన్‌లు లండన్‌లో పది రోజుల ఐసోలేషన్‌లో ఉండనున్నారు.
యూరోలో రిషబ్ : న్యూజిలాండ్‌తో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అనంతరం భారత జట్టుకు బీసీసీఐ మూడు వారాల సెలవు ఇచ్చింది. బయో బబుల్ వీడిన క్రికెటర్లు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో లండన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో విహారానికి వెళ్లారు. జూన్ 30న యూరోకప్‌లో ఇంగ్లాండ్, జర్మనీ మ్యాచ్‌ను వీక్షించేందుకు రిషబ్ పంత్ తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. పంత్ సహా అతడి స్నేహితులు ఎవరూ మాస్క్ ధరించలేదు. మరోవైపు వింబుల్డన్ సెంటర్ కోర్టులో చ చీఫ్ కోచ్ రవిశాస్త్రి సహా ఇతర క్రికెటర్లు కనిపించారు. జులై 8న రిషబ్ పంత్ కోవిడ్-19 పరీక్షలో పాజిటివ్‌గా వచ్చాడు. దీంతో అప్పటి నుంచి పంత్ ఐసోలేషన్‌లోనే ఉంటున్నాడు. పంత్‌కు పాజిటివ్ వచ్చిన విషయం జట్టు సభ్యులకు తెలియదు!. జులై 13న ఇంగ్లాండ్‌లోని జట్టు సభ్యులకు బీసీసీఐ కార్యదర్శి జై షా లేఖ రాశారు. ' జన సంచారం అధికంగా ఉండే యూరో కప్, వింబుల్డన్ సహా షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లకు వెళ్లకుండా ఉండటం మంచిది. వ్యాక్సిన్ రోగ నిరోధక శక్తిని మాత్రమే ఇవ్వగలదు, కోవిడ్ రాకుండా నివారించదు' అని క్రికెటర్లను హెచ్చరించారు. జులై 16న భారత జట్టు సభ్యులు డర్హమ్‌కు చేరుకోవాల్సి ఉండగా.. ముందస్తుగా నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. 8 రోజులుగా ఐసోలేషన్‌లో ఉంటున్న రిషబ్ పంత్‌కు ఎటువంటి లక్షణాలు కనిపించటం లేదు. వరుసగా రెండు నెగెటివ్ రిపోర్టులు వస్తే అతడు జట్టుతో చేరనున్నాడు.
జులై 20 నుంచి వార్మప్ : భారత క్రికెటర్లు, సహాయక సిబ్బంది సహా కుటుంబ సభ్యులకు ఇటీవల లండన్‌లో కోవిషీల్డ్ రెండో డోసు వ్యాక్సినేషన్ వేయించారు. రిషబ్ పంత్ సహా నలుగురు మినహాయిస్తే.. మిగతా భారత జట్టు సభ్యులు డర్హమ్‌కు చేరుకోనున్నారు. జులై 20 నుంచి ఇక్కడ భారత జట్టు మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. కౌంటీ సెలక్ట్ ఎలెవన్‌తో కోహ్లిసేన ఓ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఆగస్టు 4న తొలి టెస్టుకు ముందు భారత జట్టు ఆడనున్న ఏకైక వార్మప్‌కు పంత్, సాహాలు ఇద్దరూ దూరమయ్యే అవకాశం ఉంది. కెఎల్ రాహుల్ వార్మప్ మ్యాచ్‌లో వికెట్ కీపింగ్ బాధ్యతలు వహించే చాన్స్ కనిపిస్తోంది.
కఠిన బుడగ ఉండదు!
కరోనా మహమ్మారి ఉదృతికి ఇంగ్లాండ్ వైట్ బాల్ జట్టులో పలువురు క్రికెటర్లు వైరస్ బారిన పడ్డారు. భారత జట్టులో ఇద్దరు సభ్యులకు వైరస్ సోకింది. దీంతో రానున్న భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు బయో బబుల్ నిబంధనలను కఠినతరం చేస్తారనే అంచనాలు నెలకొన్నాయి. అందుకు భిన్నంగా ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వ్యవహరించనుంది. ఇంగ్లాండ్‌లో కరోనా ఆంక్షలు ఎత్తివేశారు. టెస్టు సిరీస్‌కు సైతం పూర్తి స్థాయిలో ప్రేక్షకులు హాజరు కానున్నారు. కోవిడ్-19 కోవిడ్ కేసులు నమోదవుతున్నా.. ఆటగాళ్ల మానసిక ఆరోగ్యం దృష్ట్యా బయో సెక్యూర్ బబుల్ నిబంధనలను కఠినతరం చేయకూడదనే అభిప్రాయం ఈసీబీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.