Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్వహణ సిబ్బందికి పాజిటివ్
టోక్యో : 2020 టోక్యో ఒలింపిక్స్‌కు సర్వం సిద్ధమవుతోంది. ఒలింపిక్ గ్రామంలోకి అథ్లెట్లు అడుగుపెడుతున్నారు. ఇదే క్రమంలో అథ్లెట్లతో పాటు కోవిడ్-19 వైరస్ కూడా ఒలింపిక్ గ్రామంలోకి వచ్చేసింది. టోక్యో ఒలింపిక్ గ్రామంలో తొలి కోవిడ్-19 పాజిటివ్ కేసు నమోదైంది. ఈ మేరకు టోక్యో ఒలింపిక్ క్రీడల నిర్వాహకులు శనివారం వెల్లడించారు. మరో ఐదు రోజుల్లో విశ్వ క్రీడలు ఆరంభం కానుండగా.. ఒలింపిక్ గ్రామంలో వైరస్ ఆందోళనకు గురిచేస్తోంది. 'ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కావటాన్ని ఊహించవచ్చు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి అథ్లెట్ కాదు. జపాన్ దేశస్థుడూ కాదు. క్రీడల నిర్వహణ బృందానికి సంబంధించిన వ్యక్తి' అని టోక్యో నిర్వహణ కమిటీ సీఈవో తొషిరో ముటో తెలిపారు.
టోక్యో తీరంలో ఏర్పాటు చేసిన ఒలింపిక్ గ్రామంలో క్రీడల సమయంలో 11,000కుపైగా అథ్లెట్లు, వేలాది మంది సహాయక సిబ్బంది, అధికారులు ఉండనున్నారు. జులై 1 నుంచి ఒలింపిక్ నిర్వహణ బృందంలో సుమారు 44 కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. ఇందులో అత్యధిక మంది కాంట్రాక్టర్లు ఉండగా, ముగ్గురు పాత్రికేయులూ ఉన్నారు. ఒలింపిక్ వారం సమీపిస్తుండగా టోక్యోలో పాజిటివ్ కేసులు పైపైకి పాకుతున్నాయి. శుక్రవారం కొత్తగా 1271 కేసులు నమోదయ్యాయి. గత వారం 822 కేసులుండగా.. గురువారం ఏకంగా 1308 కేసులు నమోదయ్యాయి. గత ఆరు నెలల్లో టోక్యో కేసుల్లో ఇదే అత్యధికం.