Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుది జట్టులోకి 5-6 కొత్త ముఖాలు!
- భారత్, శ్రీలంక తొలి వన్డే నేడు
- మ.3 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో..
నవతెలంగాణ-కొలంబో
విపరీత పోటీ నెలకొన్న భారత వైట్‌బాల్ జట్టులో కుర్రాళ్లకు చోటే దక్కటం లేదు. ఐపీఎల్లో అద్వితీయ ప్రదర్శనలు చేస్తున్నప్పటికీ జాతీయ జట్టులో చోటు విషయంలో ప్రత్యామ్నాయ ఆటగాళ్లుగానే ఉండిపోతున్నారు. 2021 టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో యువ క్రికెటర్లకు శ్రీలంక పర్యటన రూపంలో అద్భుత అవకాశం చిక్కింది. బలహీన ప్రత్యర్థి అయినా.. శ్రీలంకపై ఆకట్టుకునే ఇన్నింగ్స్‌లో టీ20 ప్రపంచకప్ జట్టులోకి ఎంపిక అయ్యేందుకు కుర్రాళ్లు ఎదురుచూస్తున్నారు. భారత్, శ్రీలంక మూడు వన్డే, మూడు టీ20ల్లో ఆడనున్నాయి. తొలి వన్డే నేడు మధ్యాహ్నాం 3 గంటలకు కొలంబోలో ఆరంభం కానుంది.
ఎవరికి అవకాశం : తొలి వన్డేకు ముందు శ్రీలంకతో పోరాటాన్ని భారత్ పెద్ద సమస్యగా తీసుకోవటం లేదనే చెప్పవచ్చు. ఆడిన చివరి ఎనిమిది వన్డేల్లో ఏడు మ్యాచులు, పదమూడు టీ20ల్లో పన్నెండు మ్యాచుల్లో శ్రీలంక జట్టు పరాజయం పాలైంది. ఇంగ్లాండ్ పర్యటన నుంచి వైట్‌బాల్ సిరీస్‌లు కోల్పోయి స్వదేశానికి చేరుకుంది. భారత్‌తో సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లో నెగ్గినా.. లంకేయులు విజయ పథంలో నడిస్తున్నట్టే భావించాలి!. కెప్టెన్ దసున్ శనక శ్రీలంకకు గత నాలుగేండ్లలో పదో సారథి. బ్యాట్స్‌మన్ ధనంజయ డిసిల్వ, పేసర్ దిష్మంత చమీరాలను మినహాయిస్తే శ్రీలంక జట్టులో నాణ్యమైన ఆటగాళ్లే లేరు. కుశాల్ మెండిస్, నిరోశన్ డిక్వెల్లాలపై వేటు సహా మాజీ కెప్టెన్ కుశాల్ పెరీరా గాయంతో దూరమవటం, స్టార్ ఆటగాడు ఎంజెలో మాథ్యూస్‌కు దూరం కావటం శ్రీలంకను మరింత బలహీనపరిచింది. భారత్‌తో ఆరు మ్యాచుల్లో ఒక్క విజయం సాధించినా.. శ్రీలంక జట్టుకు గొప్ప రివార్డుగానే పరిగణించాలి!.
అందుకే ఈ సిరీస్‌లో భారత్ యువ క్రికెటర్ల సత్తాను పరీక్షించేందుకు సిద్ధమవుతోంది. ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్‌లు రానుండగా.. బ్యాటింగ్ లైనప్‌లో మిగతా బ్యాట్స్‌మెన్ ఎంపికపై పీటముడి పడింది. దేవదత్ పడిక్కల్, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రానాలు పోటీలో ఉన్నారు. మనీశ్ పాండే సీనియర్ బ్యాట్స్‌మన్‌గా తుది జట్టులో నిలువనున్నా... వికెట్ కీపర్ విషయంలో ఇషాన్ కిషన్, సంజు శాంసన్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. పేసర్ల విభాగంలో భువనేశ్వర్ కుమార్‌కు తోడుగా ఎవరు ఉంటారనే విషయంలో స్పష్టత లేదు. స్పిన్ విభాగంలో యుజ్వెంద్ర చాహల్, కుల్దీప్యాదవ్లకు రెడ్ కార్పెట్ స్వాగతం ఉంటుందని అనుకోవడానికి లేదు. కృనాల్ పాండ్య, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, వరుణ్ చక్రవర్తిలు స్పిన్ కోటాలో తుది జట్టులో పోటీపడుతున్నారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య నేరుగా తుది జట్టులోకి రానున్నాడు. దీపక్ చాహర్, నవదీప్ సైనిలు పేస్ విభాగంలో ముందంజలో నిలువగా.. ఐపీఎల్ సంచలనం చేతన్ సకారియ తొలి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. రానున్న ఐపీఎల్ 2021 కొనసాగింపు సీజన్, 2021 టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్ ఆడనున్న చివరి టీ20 సిరీస్ ఇదే కానుండటంతో... యువ క్రికెటర్లు సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నారు. రాహుల్ ద్రవిడ్ శిక్షణ సారథ్యంలోని యువ భారత్ సిరీస్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. మ్యాచులు సోనీ నెట్‌వర్క్‌లో ప్రసారం అవుతాయి.