Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒలింపిక్స్‌లో ఒకప్పుడు మెరిసి, ఇప్పుడు కనుమరుగు
- టోక్యో ఒలింపిక్స్ జాబితాలో లేని కొన్ని క్రీడలు
33 క్రీడలు, 50 క్రీడాంశాల్లో 339 మెడల్ ఈవెంట్లు. టోక్యో ఒలింపిక్స్‌లో 33 ఒలింపిక్ క్రీడలకు సంబంధించిన పోటీలు నిర్వహిస్తున్నారు. విశ్వ క్రీడా వేదికపై ఒకప్పుడు మెరిసినా.. కాలక్రమంలో ఒలింపిక్స్‌కు దూరమైన క్రీడలూ ఉన్నాయి. ఆతిథ్య దేశం కొన్ని క్రీడలను చేర్చటం, తొలగించటం వంటి నిర్ణయాలు తీసుకుంటుంది. అయినా, ఒలింపిక్ చరిత్రలో కొన్ని ఆశ్చర్యకర క్రీడలు తళుక్కుమన్నాయి. ఒలింపిక్స్‌లో ఓసారి మెరిసి, ఇప్పుడు కనుమరుగైన క్రీడలను చూద్దాం.
నవతెలంగాణ క్రీడావిభాగం
క్రికెట్ :
ఒలింపిక్స్‌లో క్రికెట్ ఓసారి కనువిందు చేసింది. 1900 ఒలింపిక్స్‌లో రెండు రోజుల టెస్టును ఆడించారు. బ్రిటన్, ఫ్రాన్స్‌లు పాల్గొన్నాయి. బ్రిటన్ జట్టులో సోమర్సెట్, వాండరర్స్ క్లబ్ సభ్యులు ఆడగా.. పారిస్ జట్టులో సుమారు ఇంగ్లీష్ ఆటగాళ్లే ఉన్నారు. బ్రిటన్ కెప్టెన్ చార్లెస్ బీచ్‌క్రాఫ్ట్, అల్ఫ్రెడ్ బోవెర్మన్ అర్థ సెంచరీలు సాధించగా.. ఫ్రెడరిక్ క్రిస్టియన్ ఏడు వికెట్లు పడగొట్టాడు. 158 పరుగులతో బ్రిటన్ విజయం సాధించి స్వర్ణం అందుకుంది.
టగ్ ఆఫ్ వార్ :
టగ్ ఆఫ్ వార్ టీమ్ స్పోర్ట్‌గా 1920 ఒలింపిక్స్‌లో చివరగా ఆడారు. 1900-1920 ఒలింపిక్స్ వరకు టగ్ ఆఫ్ వార్ ఒలింపిక్ క్రీడగా కొనసాగింది. బెల్జియం ఒలింపిక్స్ అనంతరం తాడాటను తొలగించారు. ఈ క్రీడలో బ్రిటన్, అమెరికా అత్యధిక పతకాలు సాధించాయి. 1920 ఒలింపిక్స్ తర్వాత టగ్ ఆఫ్ వార్ ఒలింపిక్స్‌లో కనిపించలేదు.
వాటర్ మోటర్‌స్పోర్ట్స్ :
1908 లండన్ ఒలింపిక్స్‌లో వాటర్ మోటర్స్పోర్ట్స్కు ఫుల్ మెడల్ స్థాయి కల్పించారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆ తర్వాత 'స్థాయి'ని తొలగించింది. ఒలింపిక్స్‌లో ఒకే ఒక్క సారి మోటారు పవర్ బోట్ రేసు నిర్వహించగా.. మూడు వాటర్ మోటార్‌స్పోర్ట్ రేసులు జరిగాయి. బ్రిటన్, ఫ్రాన్స్‌లు మాత్రమే ఇందులో పోటీపడ్డాయి. బ్రిటన్ రెండు స్వర్ణాలు సాధించగా, ఫ్రాన్స్ ఓ పసిడితో సరిపెట్టుకుంది.
డిస్టాన్స్ ప్లంగింగ్ :
ఒలింపిక్స్‌లో చోటుచేసుకున్న విచిత్ర క్రీడల్లో డిస్టాన్స్ ప్లంగింగ్ ఒకటి. 1904 ఒలింపిక్స్‌లో మాత్రమే ఈ క్రీడ మెరిసింది. అప్పుడు ఈ ఈవెంట్లో ఐదుగురు పోటీపడ్డారు. అందరూ అమెరికా అథ్లెట్లే. స్విమ్మింగ్‌పూల్‌లోకి ఎత్తు నుంచి దూకి.. కాళ్లు, చేతులు కదపకుండా ముందుకు సాగాలి. ఎవరు ఎక్కువ దూరం వెళితే వారిదే విజయం. 19.2 మీటర్లు ఈదిన విలియమ్ డికే ఒలింపిక్ స్వర్ణం గెల్చుకున్నాడు.
బస్క్ పెలోటా :
టెన్నిస్, స్క్వాష్‌ను పోలినటువంటి ఈ క్రీడ ఒలింపిక్స్‌లో ఒకే ఒక్కసారి నిర్వహించారు. 1900 పారిస్ క్రీడల్లో మెరిసినా.. ఒలింపిక్ స్పోర్ట్‌గా ఆదరణ పొందలేకపోయింది. ఒలింపిక్స్‌లో కనుమరుగైనా.. 1924 పారిస్, 1968 మెక్సికో సిటీ, 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో బస్క్ పెలోటా క్రీడను ఆరంభ వేడుకల్లో ప్రదర్శించారు.
రోప్ క్లైంబింగ్ :
1896-1932 ఒలింపిక్స్‌లో రోప్ క్లైంబింగ్ క్రీడను నిర్వహించారు. ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా.. అథ్లెట్లు చేతులు మాత్రమే ఉపయోగిస్తూ పైకి ఎగబాకాలి. తక్కువ సమయంలో ఎక్కువ ఎత్తుకు చేరుకున్న అథ్లెట్‌ను విజేతగా పకటిస్తారు. 1986 ఒలింపిక్స్‌లో తాడు పొడవు 14 మీటర్లు కాగా, తర్వాత 7.62-8 మీటర్లకు కుదించారు. 1932 ఒలింపిక్స్ తర్వాత మళ్లీ విశ్వ క్రీడల్లో ఇది కనిపించలేదు.
క్రాకెట్ :
ఒలింపిక్స్‌లో మహిళలు పోటీపడిన తొలి స్పోర్ట్స్ ఈవెంట్ క్రాకెట్. ఈ క్రీడ 1900 పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రమే నిర్వహించారు. క్రాకెట్లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ స్పోర్ట్స్ ఈవెంట్‌లోని ఆరు పతకాలను ఫ్రెంచ్ అథ్లెట్లు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఏ ఒలింపిక్ క్రీడలోనూ మళ్లీ క్రాకెట్ కనిపించలేదు. ఒలింపిక్ ప్రదర్శనలో సైతం చోటు దక్కలేదు.
లాక్రోస్సె :
1904 సెయింట్ లూయిస్, 1908 లండన్ ఒలింపిక్స్‌లో లాక్రోస్సె క్రీడను మెడల్ స్పోర్ట్‌గా గుర్తించారు. 1928, 1932, 1948 ఒలింపిక్స్‌లలో లాక్రోస్సె క్రీడను ప్రదర్శించారు. కెనడా శామ్రాక్ లాక్రోస్సె ట్టు స్వర్ణం సాధించగా..అమెరికా సెయింట్ లూయిస్ అమేచర్ అథ్లెటిక్ అసోసియేషన్ రజతం సాధించింది. కెనడాత మోవాక్ ఇండియన్స్ కాంస్యంతో సరిపెట్టుకున్నారు.
పోలో :
పోలోను ఒలింపిక్స్‌లో తొలిసారి 1900 క్రీడల్లో పరిచయం చేశారు. 1908 లండన్, 1920 బెల్జియం, 1924 పారిస్, 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో సైతం పోలో ఓ మెరుపు మెరిసింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో గుర్రాలను తరలించటం అధిక వ్యయంతో కూడుకున్న వ్యవహారంగా మారింది. దీంతో తదుపరి ఒలింపిక్స్‌లో పోలోను తొలగించారు. పొలో క్రీడలో అర్జెంటీనా 1924, 1936 ఒలింపిక్స్‌లో పసిడి పతకాలు సాధించి విజయవంతమైన జట్టుగా నిలిచింది.
సోలో సింక్రనైజ్డ్ స్విమ్మింగ్ :
1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ ఈత కొలనులో తొలిసారి ఈ క్రీడ అలజడి సృష్టించింది. ఈ క్రీడ సుస్థిరతపై అనుమానాలు నెలకొన్నా 1988 సియోల్ ఒలింపిక్స్‌లోనూ కనువిందు చేసింది. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో చివరగా ఈ క్రీడ కనిపించింది. సోలో సింక్రనైజ్డ్ స్విమ్మింగ్‌లో నృత్యం, జిమ్నాస్టిక్స్, స్విమ్ చేస్తూ ముందుకు సాగాలి. ప్రస్తుతం ఇది ఒలింపిక్ టీమ్ ఈవెంట్లలో కనిపిస్తుంది, కానీ వ్యక్తిగత విభాగం నుంచి తొలగించారు.