Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధావన్ కెప్టెన్సీ ఇన్నింగ్స్
- పృథ్వీ, కిషన్, సూర్య మెరుపులు
- తొలి వన్డేలో శ్రీలంకపై భారత్ గెలుపు
కొలంబో : శిఖర్ ధావన్ (86 నాటౌట్, 95 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో రాణించటంతో శ్రీలంకతో తొలి వన్డేలో భారత్ సులువైన విజయం సాధించింది. 263 పరుగుల లక్ష్యాన్ని గబ్బర్‌సేన మూడు వికెట్లు కోల్పోయి 36.4 ఓవర్లలోనే ఛేదించింది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఛేదనలో శ్రీలంక బౌలర్లను భారత కుర్రాళ్లు ఏమాత్రం గౌరవించలేదు. చిచ్చరపిడుగు పృథ్వీ షా (43, 24 బంతుల్లో 9 ఫోర్లు) పవర్ ప్లేలో బౌండరీల వర్షం కురిపించాడు. ధావన్ అవసరం లేకుండానే స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. షా నిష్క్రమణ తర్వాత.. అరంగేట్ర ఆటగాడు ఇషాన్ కిషన్ (59, 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన ఇషాన్ కిషన్..33 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేశాడు. షా, కిషన్ మెరుపులతో భారత్ పదికి పైగా రన్‌రేట్‌తో పరుగులు పిండుకుంది. శిఖర్ ధావన్ ఓ ఎండ్‌లో బాధ్యతాయుతంగా ఆడాడు. ఆరు ఫోర్లు, ఓ సిక్సర్ బాదిన గబ్బర్.. 61 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. సాధించాల్సిన రన్‌రేట్ నేలకు దిగిరావటంతో.. మనీశ్ పాండే (26, 40 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (31 నాటౌట్, 20 బంతుల్లో 5 ఫోర్లు) సాయంతో ధావన్ లాంఛనం ముగించాడు. భారత కెప్టెన్‌గా తొలి ఇన్నింగ్స్‌లోనే అత్యధిక స్కోరు చేసిన జాబితాలో సచిన్ (శ్రీలంకపై 110) తర్వాతి స్థానంలో ధావన్ నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో ధనంజయ డిసిల్వ రెండు వికెట్లు తీసుకున్నాడు.
బౌలర్ల జోరు : తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను బౌలర్లు కట్టడి చేశారు. పేసర్ దీపక్ చాహర్ (2/37), స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (2/48), యుజ్వెంద్ర చాహల్ (2/52)లు లంకను శాసించారు. ఆ జట్టులో చమిక కరుణరత్నె (43, 50 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), చరిత్ అసలంక (38, 65 బంతుల్లో 1 ఫోర్), అవిష్క ఫెర్నాండో (33, 35 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) శ్రీలంకకు మెరుగైన స్కోరు అందించారు. సిరీస్‌లో రెండో వన్డే మంగళవారం జరుగనుంది.