Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కారు అమ్మేసి, అప్పులు చేసి అర్హత టోర్నీలకు..
- ఒలింపిక్స్ బెర్త్ కోసం జుడోకా సుశీలా దేవి అష్టకప్టాలు
భారత్‌లో ఆదరణ పొందిన క్రీడాకారులకే, కమర్షియల్‌గా విజయవంతమైన క్రీడలకే ప్రభుత్వం చేయూత అందించటం సహజ నైజం!. అందుకే వర్థమాన క్రీడాకారులు, పాపులర్ కాని క్రీడల్లో మెరికల్లాంటి అథ్లెట్లు అంతర్జాతీయ టోర్నీల్లో ప్రాతినిథ్యం వహించేందుకు సర్వం ధారపోస్తారు. ప్రభుత్వం నుంచి ప్రయాణ ఖర్చులు రాని దుర్భర పరిస్థితుల్లో అప్పులు చేసి ఆటకు జైకొడతారు. అలాంటి ఓ దీనగాథే జుడోకా సుశిలా దేవి ఒలింపిక్ ప్రస్థానం.
నవతెలంగాణ క్రీడావిభాగం
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పోటీపడుతున్న ఏకైక జుడో అథ్లెట్ సుశీలా దేవి. ఈ శతాబ్ద కాలంలో జుడోలో ఒలింపిక్ బెర్త్ సొంతం చేసుకున్న ఆరో భారత అథ్లెట్ సుశీలా దేవి. పెద్దగా ఆదరణ లేని క్రీడలో ఒలింపిక్ బెర్త్ సాధించేందుకు సుశీలా దేవి ఎన్నో అవాంతరాలను అధిగమించింది. బ్యాంక్ ఖాతాలో సొమ్ము మొత్తం ఖాళీ చేసింది, సొంత కారును అమ్మేసింది, సన్నిహితుల దగ్గర అప్పులు చేసింది.. ఒలింపిక్స్‌లో పోటీపడాలనే స్వప్నం సాకారం చేసుకునేందుకు సుశీలా దేవి పడిన కష్టాలు. ' నా దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవు. పర్సు ఖాళీ. నాకు ఉన్నదంతా జుడోలో పెట్టేశాను' అని సుశీలాదేవి తెలిపింది.
దిగ్గజాలను చూస్తూ ఓనమాలు! :
సుశీలా కుటుంబానికి జుడో నేపథ్యం ఉంది. సుశీలా దేవి అంకుల్ దైనిక్ సింగ్ మాజీ అంతర్జాతీయ ప్లేయర్, ఇప్పుడు కోచ్‌గా ఉన్నారు. దైనిక్ సింగ్ స్ఫూర్తితో సుశీలా సోదరుడు శిలాక్షి సింగ్ జుడోలో ప్రవేశం పొందాడు. ఇంపాల్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సారు) సెంటర్లో శిలాక్షి చేరగా.. అతడితో పాటు సుశీలా దేవి శిక్షణకు హాజరయ్యేది. ప్రతి రోజు 10 కిమీలు సుశీలాను సైకిల్‌పై కూర్చోబెట్టుకుని శిలాక్షి ఇంపాల్ సారు సెంటర్లో శిక్షణ పొందేవాడు. ' సుశీలా మైండ్‌లో ఓసారి జుడో పాతుకుపోయిన తర్వాత, ఇక ఎదురులేదు. ఆమె ఎంతో కఠినం, ఎప్పుడూ గ్రామంలోని అబ్బాయిలతోనే పోటీపడేది. స్పోర్ట్స్, బార్సు దుస్తులనే ధరించేది' అని శిలాక్షి సింగ్ గుర్తుచేశారు. సారు సెంటర్లో ఆకట్టుకున్న సుశీలా దేవిని మెరుగైన శిక్షణ కోసం నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ పటియాలకు పంపించారు. అక్కడే జుడోను సుశీలాదేవి తన కెరీర్‌గా మలచుకుంది.
'పటియాలకు వెళ్లిన తొలినాళ్లలో నేను ఒలింపిక్స్, అంతర్జాతీయ స్థాయిలో ఆడతానని ఊహించలేదు. జుడోపై ఇష్టంతోనే అక్కడికి వెళ్లాను. ఇతర క్రీడలకు చెందిన స్టార్ అథ్లెట్లు ఎలా సాధన చేస్తున్నారనే విషయం గమనించేదానిని. బాక్సర్ మేరీకోమ్, ఇతర స్టార్ జుడోకాల ప్రాక్టీస్ సెషన్లను గమనిస్తూ ఉండేదానిని. వారి నైపుణ్యాలను నేను కాపీ కొట్టేదాన్ని' అని 26 ఏండ్ల సుశీలాదేవి తెలిపింది.
వదిలేద్దామనుకుని.. :
జుడో కోచ్ జీవన్ శర్మ శిక్షణలో సుశీలా దేవి కెరీర్ మలుపు తిరిగింది. ' సుశీలా దేవిలో నేను తొలుత గమనించింది, ఆమెకు ఆత్మస్థైర్యం ఎక్కువ. వదిలిపెట్టే స్వభావం ఉండదు. ఓటమి పట్ల ఎప్పుడూ భయపడదు. పరాజయాన్ని ఎలా జీర్ణించుకోవాలనే విషయం తెలిసిన అథ్లెట్' అని ద్రోణాచార్య పురస్కార గ్రహీత జీవన్ శర్మ అన్నారు. మణిపూర్ అమ్మాయి 48 కేజీల విభాగంలో 2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. 2015 జూనియర్ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో కాంస్యం సాధించింది. కోచ్ జీవన్ ఆమెకు ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్స్ వంటి లక్ష్యాలను నిర్దేశించినప్పుడు.. ' నాకు ఎందుకు పెద్ద పెద్ద స్వప్నాలను చూపిస్తున్నారు?' అని ప్రశ్నించినట్టు సుశీలాదేవి గుర్తుచేసింది.
ధృడమైన మానసిక స్థైర్యం కలిగినా.. జుడోకు వీడ్కోలు చెప్పాలని అనుకుంది. 2018లోనే జుడొ నుంచి వైదొలిగేందుకు నిశ్చయించుకుంది. తొడ కండరాల గాయంతో ఏడు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అనంతరం జరిగిన ట్రయల్స్‌లో ఆసియా క్రీడలకు ఎంపిక కాలేదు. ' నేను ఎంతో బాధపడ్డాను. నా జుడో కెరీర్ ముగిసిందనే అనుకున్నాను. ఆసియా క్రీడలకు అర్హత సాధించి, అక్కడ రాణించి ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుదామని అనుకున్నాను. ఆ ఘటనతో గుండె పగిలింది, కోచింగ్ వదిలేసి మూడు నెలలు ఇంటికెళ్లిపోయాను' అని సుశీలాదేవి పేర్కొంది.
ఘనంగా పునరాగమనం :
నలుగురు ఒలింపియన్లను తయారు చేసిన కోచ్ జీవన్ శర్మ.. సుశీలా దేవిపై నమ్మకంతో రెగ్యులర్‌గా ఆమెకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. జుడో మ్యాట్‌పైకి తిరిగి రావాలని ప్రేరణ కలిగించేవారు. ' కోచ్ ఎప్పుడూ ప్రేరణగా నిలిచారు. చాలా టోర్నీలు ఉన్నాయి, ఆటకు వీడ్కోలు చెప్పవద్దని చెప్పారు. ఆటలో లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగుదామని చెప్పారు. అన్నట్టుగానే గొప్పగా రీ ఎంట్రీ ఇచ్చాను. కోచ్ కారణంగానే ఈ రోజు ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నాను' అని సుశీలా చెప్పింది. హాంగ్‌కాంగ్ ఓపెన్‌లో 2018, 2019లలో వరుసగా రజత పతకాలు సాధించింది.
సొంత ఖర్చులతో టోర్నీలకు.. :
ప్రపంచ చాంపియన్‌షిప్స్, ఆసియా చాంపియన్షిప్స్లకు మాత్రమే జుడో సమాఖ్య ఖర్చులు భరిస్తుంది. ఇతర టోర్నీల్లో పాల్గొనాలంటే సొంత ఖర్చులతోనే వెళ్లాలి. అందుకే ఇతరుల దగ్గర అప్పులు చేసి, రుణాలు తీసుకుని టోర్నీల్లో ప్రాతినిథ్యం వహించింది. ఏ టోర్నీకి వెళ్లినా కనీసం రూ.50000 ఖర్చు అవుతుంది. స్పాన్సర్లు లేకపోవటంతో సొంత కారును సైతం అమ్మేసింది. ఉన్నదంతా జుడొలో దేశానికి ప్రాతినిథ్యం వహించిన సుశీలా దేవి ఇప్పుడు ఖాళీ జేబులతోనే టోక్యోకు వెళ్లింది.
లాక్డౌన్లో ముమ్మర సాధన :
కోవిడ్ మహమ్మారి సుశీలా సాధనకు బ్రేక్ వేసింది. దీంతో ఇంట్లోనే జుడో సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ' నా చిన్ననాటి కోచ్ నుంచి మ్యాట్ తీసుకున్నాను. యువ జుడోను ఒప్పించి, రోజుకు సాధన చేశాను. తెల్లవారుజామునే లేచి రన్నింగ్‌కు వెళ్లేవాళ్లము. లాక్డౌన్ సమయంలో ఫిట్‌గా నిలిచేందుకు ఎంతో శ్రమపడ్డాను. లాక్డౌన్ అనంతరం ఆసియా ఓసియాన ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు భారత్‌కు అనుమతించలేదు. ఆ టోర్నీలో కనీసం సిల్వర్ సాధిస్తాననే నమ్మకంతో ఉన్నాను. అక్కడ మెడల్ కొడితే, నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉండేది' అని సుశీలా తెలిపింది. 989 పాయింట్లు సాధించిన సుశీలా ఆసియాలో ఏడో స్థానంలో నిలిచింది. కాంటినెంటల్ కోటాలో పది ఒలింపిక్ బెర్త్‌లు ఉండగా.. సుశీలా ఆ కోటాలో టోక్యో బెర్త్ ఖాయం చేసుకుంది.
వాస్తవికత అవసరం :
ఒలింపిక్స్‌లో భారత్‌కు జుడో పతకంపై అంచనాలు పుష్కలంగా ఉన్నాయని, కానీ వాస్తవిక పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయని కోచ్ జీవన్ శర్మ అన్నారు. ' ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ఆపసోపాలు పడే దేశం మనది. మన ఫోకస్ అర్హత నుంచి మెడల్ సాధనపైకి మళ్లాలి. అన్ని అర్హత టోర్నీల్లో జుడోలు పోటీపడితే, మనకు మంచి అవకాశాలు ఉంటాయి. సుశీలా దేవి నైపుణ్యాలు మెరుగుపర్చుతున్నాం. కానీ నెల రోజుల్లో అద్భుతాలు చేయలేం. అంచనాలు ఎక్కువగా ఉన్నాయి, కానీ వాస్తవికత ఉండాలి. ప్రపంచ చాంపియన్‌షిప్స్, ఒలింపిక్స్ అంత సులువు కాదు. సుశీలా దేవి గొప్పగా సన్నద్ధమైంది, ఆమె సర్ప్రైజ్ మెడల్ సాధించినా ఆశ్చర్యం లేదు' అని జీవన్ తెలిపారు. ' నాపై ఎటువంటి ఒత్తిడి లేదు. ఒలింపిక్స్‌లో నేను తలపడే జుడోలు అందరితో గతంతో పోటీపడ్డాను. టోక్యోలో నా అత్యుత్తమ ప్రదర్శన చేయటంపై సంకల్పంతో ఉన్నానని' సుశీలా దేవి తెలిపింది. టోక్యో ఒలింపిక్స్‌లో జుడో పోటీలు జులై 24 నుంచి ఆరంభం కానున్నాయి. మహిళల 48 కేజీల విభాగంలో సుశీలా దేవి భారత పతక ఆశలను మోయనుంది.