Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టోక్యోలో చెమటోడ్చుతున్న భారత అథ్లెట్లు
- ఒలింపిక్ స్టేడియంలో ప్రాక్టీస్
ఒలింపిక్స్‌లో అదిరే ప్రదర్శన చేసేందుకు భారత క్రీడాకారులు.. టోక్యో ఒలింపిక్ వేదికల్లో సన్నద్ధం అవుతున్నారు. సుమారు 10 క్రీడాంశాలకు చెందిన క్రీడాకారులు ఇప్పటికే టోక్యోకు చేరుకున్నారు. ఆరంభ వేడుకలకు రెండు రోజుల కౌంట్‌డౌన్ మొదలుకాగా.. మెడల్ ఈవెంట్‌పై కన్నేసి టీమ్ ఇండియా జోరుగా సాధన చేస్తోంది. జులై 23 నుంచి 2020 టోక్యో ఒలింపిక్స్ ఆరంభం కానున్నాయి. ఒలింపిక్స్‌లో భారత్ వేట జులై 24 నుంచి ఆరంభం కానుంది.
నవతెలంగాణ-టోక్యో
ఉన్నత ఆశయాలు, నాలుగేండ్ల కఠోర శ్రమ, శిఖర సమాన లక్ష్య సాధన దిశగా భారత అథ్లెట్లు అస్త్రాలు సరి చేసుకుంటున్నారు!. 88 మందితో కూడిన భారత అథ్లెట్ల బృందం ఆదివారమే టోక్యోకు చేరుకున్న సంగతి తెలిసిందే. టోక్యోలో కాలుమోపిన 54 మంది అథ్లెట్లతో కూడిన బృందం సోమవారం నుంచి సాధన ప్రారంభించింది. కరోనా మహమ్మారి మబ్బులు ఒలింపిక్ క్రీడా గ్రామాన్ని సైతం ఆవహించినా.. క్రీడాకారులు ఎనలేని ఏకాగ్రతతో ఆటపై దృష్టి సారిస్తున్నారు. ఆర్చరీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ, జుడో, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, వెయిట్‌లిఫ్టింగ్, రోయింగ్, సెయిలింగ్ క్రీడాకారులు టోక్యో ఒలింపిక్ స్టేడియాల్లో ముమ్మర సాధన చేస్తున్నారు. ఒలింపిక్స్‌లో మెడల్ ఫేవరేట్లు స్టార్ షట్లర్ పి.వి. సింధు, దిగ్గజ బాక్సర్, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ ఎంసీ మేరీకోమ్, వరల్డ్ నం.1 బాక్సర్ అమిత్ పంఘాల్, ప్రపంచ నం.1 ఆర్చర్ దీపికా కుమారి, టేబుల్ స్టార్ మోనిక బత్రాలు టోక్యో ఒలింపిక్ స్టేడియంలో సాధన మొదలుపెట్టారు. ఒలింపిక్ స్టేడియం వాతావరణానికి అలవాటు పడేందుకు చెమటోడ్చుతున్నారు.
బ్యాడ్మింటన్ : టోక్యో ఒలింపిక్స్ పసిడి పతకం రేసులో ముందంజలో ఉన్న అథ్లెట్ తెలుగు తేజం పి.వి. సింధు. భారత అథ్లెట్ల బృందంతో పాటు సింధు సైతం ఆదివారమే జపాన్ రాజధాని, ఒలింపిక్స్ వేదిక టోక్యో నగరానికి చేరుకుంది. సోమవారం ఒలింపిక్ బ్యాడ్మింటన్ స్టేడియంలో సింధు సాధన చేసింది. కొరియా కోచ్ పార్క్‌తో కలిసి చెమటోడ్చింది. బి. సాయిప్రణీత్, పి.వి సింధులు కోచ్‌తో కలిసి డబుల్స్ ప్రాక్టీస్ చేశారు. తొలి రోజు సాయిప్రణీత్ క్రీడా గ్రామంలోని జిమ్‌లో కసరత్తులు చేయగా.. సింధు బ్యాడ్మింటన్ కోర్టులో వార్మప్‌తో సాధన ఆరంభించింది.
కొలనులో ప్రకాశ్ : స్విమ్మింగ్‌లో భారత్‌కు పతక ఆశలు పెద్దగా లేవనే చెప్పాలి. మన స్విమ్మర్ల వ్యక్తిగత వాస్తవిక లక్ష్యం సైతం సెమీఫైనల్సే. అయినా, ఒలింపిక్స్ అనుభవంతో భవిష్యత్‌లో పతకాలు సాధించే ఆత్మవిశ్వాసం వారికి లభించనుంది. టోక్యో ఒలింపిక్స్‌కు ముగ్గురు స్విమ్మర్లు అర్హత సాధించారు. పురుషుల విభాగంలో సాజన్ ప్రకాశ్, శ్రీహరి నటరాజ్.. మహిళల విభాగంలో మానా పటేల్‌లు టోక్యోలో పోటీపడనున్నారు. ఒలింపిక్ ఈత కొలనులో మానా పటేల్, శ్రీహరి సోమవారం నుంచే సాధన చేయటం ఆరంభించారు.
ప్రణతి విన్యాసాలు : రియో ఒలింపిక్స్‌లో స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ పతకానికి చేరువగా వచ్చింది. నాలుగో స్థానంలో నిలిచిన తృటిలో కాంస్యం చేజార్చుకుంది. గాయంతో టోక్యోకు దీప దూరమైనా.. ప్రణతి నాయక్ రూపంలో మరో మెరుపు జిమ్నాస్ట్ భారత పతక ఆశలను రేపుతోంది. దుబారులో శిక్షణ పొందిన అక్కడ్నుంచి నేరుగా టోక్యోకు చేరుకుంది. సోమవారం కోచ్ లక్ష్మణ మనోహర్ శర్మతో కలిసి ప్రణతి నాయక్ ఒలింపిక్ స్టేడియంలో సాధన చేసింది.
విల్లు గురి కుదిరేలా : ఒలింపిక్స్‌లో భారత్ పతకాలు ఆశిస్తోన్న విభాగాల్లో ఆర్చరీ ఒకటి. ప్రపంచ నం.1 దీపికా కుమారి టోక్యోలో భారత్ పసిడి ఆశలను భుజాలపై మోస్తుంది. దీపిక కుమారి, అటాను దాసు, ప్రవీణ్ జాదవ్, తరుణ్‌దీప్ రారులు ఆదివారం నుంచే సాధన చేయటం ఆరంభించారు. మిక్స్డ్ జట్టు విభాగంలో దీపిక కుమారి, అటాను దాస్‌లు ముమ్మర సాధన చేశారు.
విదేశీ అథ్లెట్లతో కలిసి.. : సెయిలర్లు, రోయర్లు, టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు విదేశీ అథ్లెట్లతో కలిసి సాధన చేస్తున్నారు. అచంట శరత్ కమల్, సత్యన్‌లు టేబుల్ టెన్నిస్‌లో సాధన చేయగా.. సెయిలర్లు విష్ణు శరవణన్ ప్రపంచ అత్యుత్తమ సెయిలర్లతో కలిసి తీరంలో సందడి చేశాడు. సెయిలర్లు నాలుగు రోజుల ముందుగానే ఇక్కడికి చేరుకుని సాధన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక హాకీ ఆటగాళ్లు, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానులు జిమ్‌లో కసరత్తులు చేస్తూ మెగా ఈవెంట్‌కు సంసిద్ధం అవుతున్నారు.