Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిరీస్ విజయంపై కన్నేసిన భారత్
- శ్రీలంకతో రెండో వన్డే పోరు నేడు
- మధ్యాహ్నాం 3 నుంచి సోనీలో..
జట్టులో అందరూ కుర్రాళ్లే. అయితేనేం, శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. వన్డే మ్యాచ్‌లో టీ20 తరహాలో రెచ్చిపోయారు. తొలి వన్డేలో ఏకపక్ష విజయాన్ని సాధించారు. గబ్బర్ ధావన్ సారథ్యంలో యువ భారత్ జోరుమీదున్న వేళ నేడు సిరీస్ కోసం భారత్ రెండో వన్డేలో బరిలోకి దిగనుంది.
నవతెలంగాణ-కొలంబో
48 గంటల కంటే తక్కువ వ్యవధిలో భారత్, శ్రీలంకలు రెండో వన్డేకు సమరానికి సిద్ధమవుతున్నాయి. యువ టీమ్ ఇండియా తొలి వన్డే విజయం ఉత్సాహంలో ఉండగా.. శ్రీలంక పరాజయ బాధతోనే నేడు ఇరు జట్లు రెండో వన్డేలో తలపడనున్నాయి. మూడు మ్యాచుల సిరీస్‌ను నేటితోనే లాంఛనం చేసేందుకు భారత్ ఉవ్విళ్లూరుతోంది. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ గెల్చుకునేందుకు భారత్ రెఢ అవుతుండగా.. నేడు మధ్యాహ్నాం 3 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.
జోరు కొనసాగేనా.. : టీ20 అరంగేట్రంలో అర్థ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్.. వన్డే అరంగేట్రంలోనే అదే జోరు చూపించాడు. ఎదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్సర్, ఫోర్‌గా మలచిన ఇషాన్ కిషన్ ఛేదనలో కీలక పాత్ర పోషించాడు. యువ ఓపెనర్ పృథ్వీ షా చిచ్చరపిడుగులా విరుచుకుపడ్డాడు. అవకాశం అందుకున్న పృథ్వీ షా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లు అద్భుతంగా రాణించారు. కెప్టెన్ శిఖర్ ధావన్ బాధ్యతాయుతంగా ఆడాడు. స్ట్రయిక్ రొటేట్ చేసేందుకు ఇబ్బంది పడుతూ ఐపీఎల్లో విమర్శలు ఎదుర్కొన్న సీనియర్ బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే తొలి వన్డేలో అదే శైలి చూపించాడు. ఐపీఎల్ ప్రాంఛైజీ తుది జట్టులో నిలిచేందుకైనా మనీశ్ పాండే పూర్వ ఫామ్ అందుకోవాల్సి ఉంది. సంజు శాంసన్ వంటి విధ్వంసక బ్యాట్స్‌మన్ బెంచ్‌పై ఉండటంతో.. మనీశ్ అన్ని మ్యాచుల్లోనూ ఈ ఆటతో తుది జట్టులో కొనసాగలేడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్యలకు తొలి వన్డేలో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు. నేడు భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంటే.. 400కు పైగా పరుగులు చేసేందుకు ఆస్కారం ఉంది!. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ లయ అందుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. నవదీప్ సైని తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ మరోసారి మ్యాజిక్కు సిద్ధం అవుతున్నారు. వన్డేల్లో ఆరు వేల పరుగుల మైలురాయిని వేగంగా అందుకున్న బ్యాట్స్‌మన్‌గా నిలిచిన ధావన్.. నేడు రెట్టించిన ఉత్సాహంతో ఆడనున్నాడు. విరాట్ కోహ్లి 136 ఇన్నింగ్స్‌ల్లో 6 వేల పరుగులు చేయగా..శిఖర్ ధావన్ 140 ఇన్నింగ్స్‌లో ఆ మైలురాయి దాటాడు.
పోటీ ఇవ్వగలరా? : శ్రీలంక శిబిరంలో ప్రపంచ శ్రేణి బ్యాట్స్‌మెన్ లేరనే విషయం అందరికీ తెలుసు. అయినా, టాప్ ఆర్డర్లో ఆవిష్క ఫెర్నాండో, భనుక రాజపక్సెలు తొలి వన్డేలో ఆకట్టుకునే బౌండరీలు బాదారు. లోయర్ ఆర్డర్లో చమిక కరుణరత్నె మెప్పించాడు. మిడిల్ ఓవర్లలో భారత స్పిన్నర్లు చాహల్, కుల్దీప్, కృనాల్‌లను ఎదుర్కొనేందుకు లంక బ్యాట్స్‌మెన్ ఆపసోపాలు పడ్డారు. కరుణరత్నె ఇన్నింగ్స్ లేకుంటే.. శ్రీలంక మరింత స్వల్ప స్కోరుకే పరిమితం అయ్యేది. భారత్‌కు పోటీ ఇవ్వాలంటే శ్రీలంక కనీసం 350 పరుగులైనా చేయాలి. భారత బౌలర్లను ఎదుర్కొని అంత భారీ స్కోరు చేసే సత్తా శ్రీలంకకు లేదు. బౌలింగ్ విభాగంలోనూ భారత బ్యాట్స్‌మెన్ దూకుడుకు అడ్డుకట్ట వేయగల సమర్థ బౌలర్ లంక శిబిరంలో కనిపించటం లేదు. తొలి వన్డేలో అందరి గణాంకాలను యువ బ్యాట్స్‌మెన్ చిత్తు చేశారు. తొలి వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. అన్ని విభాగాల్లోనూ శ్రీలంక తేలిపోయింది.
బ్యాటింగ్‌కు అనుకూలించే కొలంబో పిచ్‌పై నేడు భారత్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఆడిన చివరి 9 వన్డేల్లో ఏకంగా 8 వన్డేల్లో పరాజయం చవిచూసిన శ్రీలంక.. నేడు మరో పరాజయం నుంచి తప్పించుకోవాలంటే వరుణుడు కోసం ఎదురుచూడాల్సిందే!.
తుది జట్లు (అంచనా) :
భారత్ : పృథ్వీ షా, శిఖర్ ధావన్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, యుజ్వెంద్ర చాహల్.
శ్రీలంక : అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక (వికెట్ కీపర్), భానుక రాజపక్సె, ధనంజయ డిసిల్వ, చరిత్ అసలంక, దసున్ శనక (కెప్టెన్), వానిందు హసరంగ, చామిక కరుణరత్నె, దుష్మంత చమీరా, లక్షన్ సందకన్, లహిరు కుమార.