Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గత ఒలింపిక్స్‌లో మిల్కాసింగ్, పిటి ఉషలకు తృటిలో చేజారిన కాంస్యాలు
న్యూఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో ఈసారి 26మంది ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఈ విభాగంలో భారత్‌కు ఇప్పటివరకు పతకాలు దక్కిన దాఖలాలు లేవు. 36ఏళ్ల క్రితం(1980) మాస్కో ఒలింపిక్స్ 400మీ. హర్డిల్స్‌లో పిటి ఉష 0.01సెకన్ల తేడాతో తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది. అంతకుముందు 1956, 1960, 1964 ఒలింపిక్స్‌లో వరుసగా మూడు ఒలింపిక్స్‌లో మిల్కాసింగ్ పాల్గొన్నా.. రోమ్(1960) ఒలింపిక్స్ 400మీ. హర్డిల్స్‌లో 0.01సెకన్లలో మిల్కా కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ విభాగంలో భారత్ పతకం ఖాయంగా కొట్టేలా కనిపిస్తోంది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాతో పాటు 100మీ. 200మీ. పరుగులు ద్యూతీ చంద్ పతక రేసులో అందరికంటే ముందున్నారు. పురుషుల 3వేల మీ. స్టీపుల్ ఛేస్ అవినాశ్ సేబల్, లాంగ్ జంప్‌లో శ్రీశంకరన్ పతకాలు సాధించగల సమర్థులే. మహిళల డిస్కస్ త్రోలో కమల్ ప్రీత్ కౌర్, సీమా పునియా, షాట్‌పుట్‌లో తేజిందర్ పాల్ తోర్ కూడా ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసొచ్చే అంశం. ఈ విభాగంలో ఈసారి ఒలింపిక్స్‌కు 26మంది అర్హత సాధించడమే ఇందుకు నిదర్శనం. 16మంది వ్యక్తిగత విభాగంలో పోటీపడుతుండగా.. 4×400మీ. మిక్స్డ్, 4×400మీ. రిలేలో పాల్గొనేందుకు మరో 10మంది టోక్యోకు వెళ్ళారు.
నీరజ్ చోప్రా..
జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా 2016 ప్రపంచ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ స్వర్ణం గెల్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. అండర్-20 విభాగంలో ఈటెను 86.48మీ. దూరం విసిరి రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెల్చిన అథ్లెట్ కంటే ఉత్తమ ప్రదర్శనను కనబర్చాడు. ఆ తర్వాత ఆయా ఛాంపియన్‌షిప్‌లలో నిలకడైన ప్రదర్శనతో మెరిసాడు. 2018 కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించిన అనంతరం తనపై అంచనాలను అమాంతం పెంచేశాడు. 2019లో మోచేతి గాయానికి శస్త్రచికిత్సతో కొన్నాళ్లు ఆటకు విరామం ప్రకటించాడు. ఆ తర్వాత జరిగిన ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో రాణిస్తూ.. 2020లో దక్షిణాఫ్రికాలోని ఓ లీగ్‌లో 87.86మీ. జావెలిన్‌ను విసిరి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఈ ఏడాది 88.07మీ. దూరంతో తన పేరుమీదనే ఉన్న జాతీయ రికార్డును తిరగరాశాడు. దీంతో ఈ విభాగంలో ఖచ్చితంగా పతకం గెలుస్తాడనే నమ్మకాన్ని కలిగిస్తున్నాడు. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ థామస్(జర్మనీ), 2019 ప్రపంచ ఛాంపియన్షిప్ రజిత పతక విజేత మాగస్(ఈస్టోనియా) టోక్యో క్రీడలనుంచి తప్పుకోవడం నీరజ్‌కు కలిసొచ్చే అంశం. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాల్గోస్థానంలో ఉన్న నీరజ్‌కు తొలి మూడు స్థానాల్లో ఉన్న వెటర్(జర్మనీ), మార్సిన్(పోలెండ్), వాట్కోట్(ట్రినిడాక్ అండ్ టుబాగో) నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. గత ఒలింపిక్స్‌లో థామస్(జర్మనీ) 90.30మీ., స్వర్ణం గెల్చుకోగా.. జులిస్ యోగే(కెన్యా) 88.24మీ., కేష్రన్ వాల్కట్(ట్రినిడాడ్ అండ్ టుబాగో) 85.38మీ., రజిత, కాంస్య పతకాలు గెల్చారు.
ద్యూతీ చంద్
వరుసగా రెండో ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహిస్తోన్న మరో అథ్లెట్ ద్యూతీ చంద్. అగ్రశ్రేణి అథ్లెట్ అయిన ద్యూతీకి 100మీ. 200మీ. పరుగులో టోక్యో బెర్త్‌లు దక్కాయి. 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న ద్యూతీ 100మీ. పరుగును 11.67 సెకన్లలో పూర్తిచేసి 7వ స్థానానికే పరిమితమైంది. జాతీయ గ్రాండ్ ఫ్రి పోటీల్లో ద్యూతీ 100మీ.ను 11.17సెకన్లలో, 200మీ. పరుగును 23.00సెకన్లతో కెరీర్ బెస్ట్ నమోదు చేసింది. ఇక 2016 ఒలింపిక్స్‌లో మహిళల 100మీ. పరుగులో ఎలైనే థామ్సన్(జమైకా) 10.71సె. స్వర్ణం గెల్చుకోగా.. టోరీ(అమెరికా) 10.83సె. రజితం సాధించారు. ఇక 200మీ. పరుగులోనూ థామ్సన్ స్వర్ణం, టోరీ కాంస్య పతకాలు గెల్చారు. జాతీయ క్రీడల్లో బెస్ట్ రికార్డ్‌తో టోక్యో బెర్త్ సాధించిన ద్యూతీ ఏమేరకు రాణిస్తుందోత వేచిచూద్దాం.
అథ్లెటిక్స్‌లో అథ్లెట్ల బృందం ఇదే..
పురుషుల జావెలిన్ త్రో : నీరజ్ చోప్రా, శివ్‌పాల్ సింగ్
మహిళల జావెలిన్ త్రో : అన్ను రాణి
మహిళల 20కి.మీ. రేస్ వాక్: భావ్నా జత్, ప్రియాంక గోస్వామి,
పురుషుల 20కి.మీ. రేస్ వాక్: కేటి ఇర్ఫాన్ థోడి, సందీప్ కుమార్, రాహుల్ రొహిల్లా
పురుషుల 50కి.మీ. రేస్ వాక్: గుర్ప్రీత్ సింగ్
పురుషుల 3వేల మీ. స్ట్రీపుల్ ఛేస్ : అవినాశ్ సేబల్
పురుషుల లాంగ్ జంప్: శ్రీశంకరన్
మహిళల డిస్కస్ త్రో: కమల్ ప్రీత్ కౌర్, సీమా పునియా
పురుషుల షాట్‌పుట్: తేజిందర్ పాల్ తోర్
మహిళల 100మీ., 200మీ. పరుగు: దూతీ చాంద్
పురుషుల 400మీ. హర్డిల్స్: ఎంపి జబీర్
పురుషుల 4×400మీ. రిలే: అమోల్ జాకోవ్, రాజీవ్ అరోకియా, మహ్మద్ అనాస్, నాగనాథన్ పండి, నార్మల్ టోమ్.
మిక్స్డ్ రిలే 4×400మీ. : భాండ్రీ, ఆంటోనీ, వీరమణి, వెంకటేశన్, ధనలక్ష్మి