Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జపాన్ సంస్కృతి ప్రతిబింబించేలా ఆరంభ వేడుకలు
- 32వ ఒలింపిక్ క్రీడలను ప్రారంభించిన జపాన్ చక్రవర్తి
- అట్టహాసంగా 2020 ఒలింపిక్ క్రీడలు ఆరంభం
సాంకేతిక వెలుగుల నడుమ 32వ ఒలింపిక్ క్రీడలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. టోక్యో ఒలింపిక్ చిహ్నంను పోలిన అభిమాని వెలుగులతో ఒలింపిక్ ఆరంభ వేడుకలు మొదలయ్యాయి. జపాన్ సంస్కృతిలో శుభసూచకంగా దీన్ని భావిస్తారు. అంతర్జాతీయ కళాకారుల నృత్యాలు, గీతాలాపనలతో ఆరంభ వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్‌తో కలిసి జపాన్ చక్రవర్తి నారుహిటో ఒలింపిక్ క్రీడలను అధికారికంగా ప్రారంభించారు.
నవతెలంగాణ-టోక్యో
'ఒలింపిక్స్‌ను రద్దు చేయండి, ప్రజల ప్రాణాలను కాపాడండి' అంటూ ఓ వైపు జపాన్ ప్రజలు వీధుల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టగా.. సాంకేతిక మెరుపులు ప్రధాన ఆకర్షణగా జపాన్ జాతీయ స్టేడియంలో 32వ ఒలింపిక్ క్రీడలు ఆరం భమయ్యాయి. ' ఆధునిక శకంలో 32వ ఒలిం పియాడ్ను వేడుక చేసుకుంటూ..టోక్యో క్రీడలను నేను ప్రకటిస్తున్నాను' అని జపాన్ చక్రవర్తి నారుహిటో ప్రకటిం చారు. జపాన్ టెన్నిస్ స్టార్ నవొమి ఒసాక ఒలింపిక్ జ్వాలను వెలిగించింది. ఆరంభ వేడుకులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యూల్ మార్కన్, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్, ఐఓసీ ఆఫీస్ బేరర్లు, సుమారు వెయ్యి మంది అధికారులు ఆరంభ వేడుకల్లో పాల్గొన్నారు.
మేరీ, మన్ మన జెండాతో.. : ఆరంభ వేడుకలకు జపాన్ బాష అనుసారం ఒక్కో దేశాన్ని పరేడ్‌కు ఆహ్వానించారు. ఆరంభ వేడుకల పరేడ్‌కు భారత్ 21వ దేశంగా అడుగుపెట్టింది. ఆతిథ్య దేశం జపాన్ చిట్టచివరన ప్రవేశించింది. బాక్సింగ్ సూపర్‌స్టార్ మేరీకోమ్, హాకీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌లు భారత పతాకధారులుగా ఆరంభ వేడుకల్లో కనువిందు చేశారు. మేరీ, మన్‌ప్రీత్ సహా 19 మంది అథ్లెట్లు, ఆరుగురు అధికారులు ఆరంభ వేడుకల్లో పాల్గొన్నారు. భారత అథ్లెట్ల బృందం మాస్క్‌లు ధరించి పరేడ్‌లోకి వచ్చింది. కిర్జికిస్థాన్ అథ్లెట్ల బృందం, పాకిస్థాన్ పతాకధారులు మాస్క్ లేకుండా కోవిడ్-19 నిబంధనలను అతిక్రమించి పరేడ్‌లో పాల్గొన్నారు. టోక్యో ఒలింపిక్స్‌కు అమెరికా అత్యధికంగా 630 మంది అథ్లెట్లను పంపగా.. ఆతిథ్య జపాన్ 552 మంది అథ్లెట్లను బరిలో నిలిపింది. చైనా నుంచి 414 మంది అథ్లెట్లు టోక్యోలో పోటీపడుతున్నారు. భారత ప్రధాని నరెంద్ర మోడీ, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, స్పోర్ట్స్ యూనివర్శిటి వైస్ చాన్సలర్ కరణం మల్లీశ్వరి, క్రీడాధికారులు న్యూఢిల్లీలో టోక్యో ఆరంభ వేడుకలను టెలివిజన్‌పై వీక్షించారు.
సాంకేతిక జిగేల్ : 62 వేల సామర్థ్యం కలిగిన జపాన్ జాతీయ స్టేడియంలో సుమారు వెయ్యి మందితో ఆరంభ వేడుకలు ముగిశాయి. అభిమానులు లేకపోయినా.. మునుపటి ఉత్సాహం కనిపించకపోయినా టోక్యో ఒలింపిక్స్ ఆరంభ వేడుకలను నిర్వాహకులు అట్టహాసంగా నిర్వహించారు. సుమారు నాలుగు గంటల పాటు సాగిన ఆరంభ వేడుకల్లో పాటలు, నృత్యాలు, జపాన్ సంస్కృతికి అద్దం పట్టే కళారూపాలకు తోడు సాంకేతిక వెలుగులు ప్రధాన ఆకర్షణ. 1824 డ్రోన్లతో టోక్యో 2020 చిహ్నంను ప్రతిబింబించారు. రిమోట్‌తోనే జపాన్ చక్రవర్తి క్రీడలను సైతం ఆరంభించారు. చరిత్రలో ఒలింపిక్స్ ఎన్నడూ చూడని రీతిలో ఆరంభ వేడుకలకు ప్రణాళిక చేసిన టోక్యో.. అందుకు ఏమాత్రం తగ్గకుండా ఆరంభ వేడుకలు ముగించింది. 1964 ఒలింపిక్స్ సందర్భంగా అథ్లెట్లు టోక్యోలో (57 ఏండ్ల క్రితం) నాటిన చెట్ల నుంచి తయారు చేసిన ఒలింపిక్ రింగ్‌లను ఆరంభ వేడుకల్లో ప్రదర్శించారు.