Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ క్రీడావిభాగం
భారత వెయిట్‌లిఫ్టింగ్ అత్యుత్తమ క్షణాలు 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి సాక్షాత్కరించింది. అప్పుడప్పుడే మణిపూర్ వెయిట్‌లిఫ్టింగ్‌లో తనదైన స్థానం కోసం పునాది వేసుకుంది. బీజింగ్ ఒలింపిక్స్ మినహాయిస్తే.. గత ఐదు ఒలింపిక్స్‌కు మణిపూర్ ఏకంగా నలుగురు భిన్నమైన వెయిట్లిఫ్టర్లను పంపించింది. టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను రజత కాంతుల వెనుక కొన్ని తరాల కృషి దాగి ఉంది. మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను 202 కేజీలు (87 కేజీలు స్నాచ్, 115 కేజీలు క్లీన్ అండ్ జెర్క్) ఎత్తి చారిత్రక వెయిట్‌లిఫ్టింగ్ ఒలింపిక్ సిల్వర్ మెడల్ భారత్‌కు తీసుకొచ్చింది.
మణిపూర్ క్రీడా సంస్కృతి ఇతర రాష్ట్రాలకు పూర్తి భిన్నం. ఇక్కడ చిన్నారులకు, యువతకు సమీకృత స్పోర్ట్స్ క్లబ్‌లు ఉన్నాయి. చిన్నారి ఏ క్రీడలో ప్రావీణ్యం సాధిస్తాడనే విషయం తెలియకపోయినా.. చిన్నతనం నుంచే క్రీడల్లో ప్రవేశం కల్పిస్తారు. ఏ క్రీడలో తాను రాణించగలడనే విషయం అన్వేషించుకునే సమయానికి.. జాతీయ స్థాయిలో ఉండాల్సిన ఫిట్నెస్ ప్రమాణాలకు గొప్పగా ఉంటారు. మణిపూర్ స్పోర్ట్స్ క్లబ్‌లకు రాష్ట్ర ప్రభుత్వంతో, క్రీడా సంఘాలతో ఎటువంటి సంబంధం ఉండదు. కేవలం ఆటపై మక్కువతో క్లబ్‌లు నడుస్తాయి. ' మణిపూర్ సంస్కృతిలో స్పోర్ట్స్ క్లబ్‌లు శతాబ్దాలుగా ఉన్నాయి. ఈ క్లబ్‌లు ఏదేని ప్రత్యేక క్రీడకు చెందినవి కావు. రాష్ట్ర, జాతీయ క్రీడా సంఘాలకు అనుబంధం కాదు. చిన్నారులను క్రీడల్లోకి దించాలని, ఆటపై ప్రేమతోనే అవి నడుస్తాయి. మణిపూర్ చిన్నారులకు చదువుతో పాటు ఆట కెరీర్ ఆప్షన్‌గా ఉంటుంది' అని మణిపూర్ యువజన, క్రీడా శాఖ మాజీ కమిషనర్ ఆర్కె నిమై సింగ్ తెలిపారు.
ప్రభుత్వం సహకారం లేకుండానే ఇక్కడ క్రీడా సంస్కృతి అభివృద్ది చెందింది. ఇంపాల్‌లో జాతీయ క్రీడా ప్రాధికార సంస్థ (సారు) కేంద్రం ఏర్పాటుతో ఇక్కడి క్రీడాకారులు ఆటలను ప్రొఫెషనల్ కెరీర్‌గా ఎంచుకోవటం మొదలైంది. మణిపూర్ వెయిట్‌లిఫ్టర్లు అన్నం ప్రధాన పోషకాహారంగా తీసుకుంటారు. చైనా, కొరియా వెయిట్‌లిఫ్టర్లు సైతం ఇదే ఆహారాన్ని తీసుకోవటం గమనార్హం. మీరాబాయి చాను స్పోర్ట్స్ క్లబ్లో మెరిసి.. ఇంపాల్ సారు సెంటర్‌కు ఆర్చరీలో రాణించాలని చేరింది. కానీ అక్కడ వెయిట్‌లిఫ్టింగ్‌ను ఎంచుకుని అందులో అత్యుత్తమ స్థాయికి ఎదిగింది. మణిపూర్ గత 25 ఏండ్లలో నలుగురు ఒలింపిక్ అథ్లెట్లను తయారు చేసిన మణిపూర్.. వెయిట్‌లిఫ్టర్ల కార్ఖానాగా నిలిచింది.