Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరాబాయి చానుకు ఒలింపిక్ రజతం
- 202 కేజీలు ఎత్తిపడేసిన మణిపూస
- టోక్యోలో భారత్ పతకాల బోణీ
2016 రియో ఒలింపిక్స్. మహిళల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ ఈవెంట్. పోటీలో భారత్ నుంచి యువ లిఫ్టర్. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో మూడు ప్రయత్నాల్లో ఒక్కటంటే ఒక్కసారి కూడా బరువు ఎత్తలేకపోయింది. స్నాచ్ విభాగంతో కలిసి ఆరు ప్రయత్నాల్లో ఐదు సార్లు బరువు ఎత్తలేక.. 'డిడ్ నాట్ ఫినిష్'గా రియోను భారంగా ముగించింది.
ఐదేండ్ల అనంతరం వేదిక టోక్యోకు మారింది. మహిళల 49 కేజీల వెయిట్‌లిప్టింగ్ ఈవెంట్. స్నాచ్ విభాగంలో 87 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 115 కేజీలు ఎత్తిపడేసింది. 2020 ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించింది. ఒలింపిక్స్‌లో మల్లీశ్వరి తర్వాత వెయిట్‌లిఫ్టింగ్ పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచింది. ఆమె పేరు మీరాబాయి చాను. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల బోణీ కొట్టిన మణిపూర్ మణిపూస భారత ఒలింపిక్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది.
నవతెలంగాణ-టోక్యో
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పతకాల బోణీ కొట్టింది. భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను (26) 2020 ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించింది. మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను 202 కేజీల బరువు ఎత్తి సిల్వర్ మెడల్ గెలుచుకుంది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో తెలుగు తేజం కరణం మల్లీశ్వరి కాంస్య పతకం సాధించగా.. 21 ఏండ్ల విరామం అనంతరం వెయిట్‌లిఫ్టింగ్‌లో రెండో ఒలింపిక్ పతకాన్ని తీసుకొచ్చింది మీరాబాయి చాను. వెయిట్‌లిఫ్టింగ్ సిల్వర్ మెడల్‌తో ఒలింపిక్స్‌లో (1900-2021) వ్యక్తిగత పతకం సాధించిన 17వ భారత అథ్లెట్‌గా నిలిచింది. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత రజత పతకం సాధించిన ఆరో భారత అథ్లెట్‌గా చాను రికార్డు సృష్టించింది. చైనా వెయిట్‌లిఫ్టర్ జిహిహు 210 కేజీల బరువు ఎత్తి ఒలింపిక్ రికార్డుతో పాటు ఒలింపిక్ స్వర్ణం సొంతం చేసుకుంది. ఇండోనేషియా వెయిట్‌లిఫ్టర్ విండీ ఆసియా 194 కేజీల బరువు ఎత్తి కాంస్య పతకం గెల్చుకుంది. రియో ఒలింపిక్స్‌లో సాక్షి మాలిక్, పీవీ సింధులు పతకాలు సాధించగా.. టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను రజతం సొంతం చేసుకుంది. ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన చివరి మూడు పతకాలు అమ్మాయిలు కొట్టినవే కావటం విశేషం.
పసిడిపై కన్నేసినా.. : మహిళల 49 కేజీల విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను పసిడి ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. ఈ విభాగంలో మీరాబాయికి ఆది నుంచి చైనా అథ్లెట్ గట్టి పోటీ. డ్రాగన్ వెయిట్లిఫ్టర్తో పోల్చితే మీరాబాయి 5-10 కేజీలు ఎక్కువ ఎత్తగలదు. స్నాచ్ విభాగంలో తొలుత 84 కేజీలు ఎత్తిన మీరాబాయి, రెండో ప్రయత్నంలో 87 కేజీలు ఎత్తింది. మూడో ప్రయత్నంలో 89 కేజీలను ఎత్తలేకపోయింది. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో తొలుత 110 కేజీలు, రెండో ప్రయత్నంలో 115 కేజీలతో కేక పుట్టించింది. చైనా అథ్లెట్ స్నాచ్‌లో సాధించిన ఆధిక్యంతో తొలి రెండు ప్రయత్నాల్లోనే స్వర్ణం ఖాయం చేసుకుంది. క్లీన్ అండ్ జెర్క్‌లో ఆమె 116 కేజీలు ఎత్తగా.. స్నాచ్‌లో 94 కేజీలు ఎత్తిపడేసింది. స్నాచ్‌లోనూ, క్లీన్ అండ్ జెర్క్‌లో మీరాబాయి మూడో ప్రయత్నంలో విఫలమైంది. అక్కడే చైనా అమ్మాయి పసిడిపై పట్టు సాధించింది. మూడో స్థానంలో నిలిచిన ఇండోనేషియా అథ్లెట్ సహా అమెరికా, బెల్జియం, చైనీస్ తైపీ వెయిట్‌లిఫ్టర్లు ఏ దశలోనూ మీరాబాయికి చేరువగా రాలేకపోయారు. 210 కేజీలు ఎత్తగల సత్తా చాను సొంతం. అయినా, ఒలింపిక్స్‌లో చాను 202 కేజీలు మాత్రమే ఎత్తింది. (స్నాచ్ : బరువును ఒకేసారి నేలపై నుంచి తలమీదుగా ఎత్తుకోవాలి. క్లీన్ అండ్ జెర్క్ : రెండు దశల్లో బరువును ఎత్తాలి. తొలుత నేల నుంచి క్లీన్‌గా బరువును లేపి.. అనంతరం ఓ కాలు వెనక్కి, మరోకాలు ముందుకి అంటూ బరువును పైకెత్తాలి. ఈ ప్రక్రియలో ఎక్కడ విఫలమైనా ఫౌల్ ఇస్తారు).
కఠోర సాధన : మీరాబాయి చానుకు ఒలింపిక్ మెడల్ అంత సులువుగా దక్కలేదు. రియో ఒలింపిక్స్‌లో దారుణంగా భంగపడిన చాను.. అనంతరం తన లోపాలను గొప్పగా సవరించుకుంది. తనను తాను మేటీ వెయిట్‌లిఫ్టర్‌గా తీర్చిదిద్దుకుంది. 2017 ప్రపంచ చాంపియన్‌గా నిలిచి పుంజుకున్న చాను.. 2018 కామన్వెల్త్ క్రీడల్లోనూ పసిడితో మెరిసింది. 2020 ఆసియా చాంపియన్‌షిప్స్‌లో కాంస్యం సాధించి.. ఒలింపిక్ మెడల్ రేసులో తనను తాను ఫేవరేట్‌గా నిలుపుకుంది. గత ఏడాది నవంబర్-డిసెంబర్ సమయంలో అమెరికా (సెయింట్ లూయిస్)కు వెళ్లిన మీరాబాయి అక్కడ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ శిక్షణ నిపుణులు డా. ఆరోన్ వద్ద శిక్షణ తీసుకుంది. వెన్నునొప్పి గాయానికి తొలుత చికిత్స తీసుకున్న చాను.. ఈ ఏడాది ఆరంభంలో భుజం గాయానికి గురైంది. ఈ ఏడాది మే ఆరంభంలో శిక్షణ నిమిత్తం సెయింట్ లూయిస్‌కు వెళ్లిన చాను అక్కడే తర్ఫీదు పొందింది. కోచ్ విజరు శర్మ తోడుగా రాటుదేలింది. టోక్యో ఒలింపిక్స్‌కు సైతం నేరుగా అక్కడి నుంచే చేరుకుంది. కోవిడ్ కారణంగా సుమారు రెండేండ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ ఒలింపిక్ లక్ష్యం కోసం మీరాబాయి కఠోర సాధన చేసింది. భారత ఒలింపిక్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకుంది. టోక్యోలో రజతం సాధించిన మీరాబాయి.. భారతీయుల హృదయాల్లో ఎప్పటికీ చాంపియన్‌గా నిలిచిపోనుంది.
ఒలింపిక్ స్టార్ ప్రోఫైల్
పేరు : మీరాబాయి చాను
వయసు : 26 (1994, ఆగస్టు 8)
జన్మస్థలం : ఇంపాల్, మణిపూర్
క్రీడ : వెయిట్ లిఫ్టింగ్
విజయాలు :
టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం
2020 ఆసియా చాంపియన్‌షిప్స్‌లో కాంస్యం
2018 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం
2017 ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణం
2014 కామన్వెల్త్ క్రీడల్లో సిల్వర్ మెడల్
అవార్డులు :
2018లో రాజీవ్ ఖేల్‌రత్న పురస్కారం
2018లో పౌర పురస్కారం పద్మ శ్రీ
- మెన్స్ హాకీ జట్టు న్యూజిలాండ్‌పై 3-2తో గెలుపొందింది. మహిళల హాకీ జట్టు నెదర్లాండ్స్ చేతిలో 1-5తో ఓటమి పాలైంది.
- 69 కేజీల విభాగంలో బాక్సర్ వికాశ్ క్రిషన్ తొలి రౌండ్లోనే కంగుతిన్నాడు. జపాన్ బాక్సర్ మేనేశ్ చేతిలో 0-5తో ఓడిపోయాడు.
- టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో మనిక బత్రా 4-0తో బ్రిటన్ అమ్మాయిపై, సుతిర్థ 4-3తో స్వీడన్ అథ్లెట్‌పై తొలి రౌండ్లో విజయాలు నమోదు చేశారు. మిక్స్డ్ విభాగంలో మనిక, శరత్‌లు తొలి రౌండ్లోనే నిరాశపరిచారు. ొ10 మీ ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్లో సౌరభ్ చౌదరి ఏడో స్థానంలో నిలిచాడు. క్వాలిఫయింగ్ రౌండ్లో అగ్రస్థానంలో నిలిచినా.. ఫైనల్లో నిరాశపరిచాడు. అభిషేక్ వర్మ ఫైనల్‌కు అర్హత సాధించలేదు. ొ1996 తర్వాత ఒలింపిక్స్ రెండో రౌండ్‌కు చేరిన టెన్నిస్ ప్లేయర్‌గా సుమిత్ నాగల్ చరిత్ర సృష్టించాడు. తొలి రౌండ్లో 6-4, 6-7(6), 6-4తో ఉబ్బెకిస్థాన్ ఆటగాడిపై గెలుపొందాడు.
- ఆర్చరీ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో దీపిక, ప్రవీణ్‌లు 2-6తో కొరియా చేతిలో క్వార్టర్ఫైనల్లో ఓటమి చెందారు.
- బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్, చిరాగ్ సంచలనం. వరల్డ్ నం.3 చైనీస్ తైపీ జోడీపై 21-16, 16-21, 27-25తో అసమాన విజయం సాధించారు. మెన్స్ సింగిల్స్‌లో సాయిప్రణీత్ 17-21, 15-21తో వరల్డ్ నం.47 చేతిలో ఓడిపోయాడు.
ొ10 మీ ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో ఎలవేనిల్, అపూర్వీ నిరాశపరిచారు.