Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టోక్యోలో నిరాశపరిచిన షూటర్లు
- మను, యశస్విని, దీపక్, దివ్యాన్షు విఫలం
- జిమ్నాస్టిక్స్‌లో తేలిపోయిన ప్రణతి నాయక్
- రోయింగ్ సెమీఫైనల్లో అర్జున్, అరవింద్ జోడీ
గురి తప్పింది, లక్ష్యం చెదిరింది. వరల్డ్ నం.1, వరల్డ్ నం.2లుగా టోక్యో ఒలింపిక్స్‌లో బరిలో నిలిచిన భారత షూటర్లు అసలు సంగ్రామంలో తేలిపోయారు. షూటర్లు మను భాకర్, యశస్విని, దీపక్ కుమార్, దివ్యాన్షులు విఫలం కాగా, టోక్యోలో పతకాల పంట పండిస్తారనే ఆశలు ఆవిరయ్యాయి. షూటింగ్ ప్రపంచకప్‌లో పతకాలు కొల్లగొట్టి టోక్యోలో అడుగుపెట్టిన షూటర్లు.. అనూహ్యంగా తడబడ్డారు. అర్హత రౌండ్‌ను దాటి ఫైనల్ పోటీకి చేరుకోవటంలో విఫలయ్యారు.
నవతెలంగాణ-టోక్యో
2020 ఒలింపిక్స్‌లో భారత్ పతకాలు పిండుకునే క్రీడల్లో ముందు వరుసలో వచ్చేది షూటింగ్!. తొలి రోజు యువ షూటర్లు ఎలవేనిల్, అపూర్విలు గురి తప్పగా.. రెండో రోజు స్టార్ షూటర్లు మను భాకర్ యశస్విని, దివ్యాన్షు సింగ్ పన్వార్, దీపక్ కుమార్‌లు వారి బాటలోనే నడిచారు. ఫలితంగా, షూటింగ్లో భారత్ పతక ఆశలను దాదాపుగా ఆవిరయ్యాయి. ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన షూటింగ్‌లోనే రానుందనే అంచనాలతో టోక్యో వెళ్లిన షూటర్ల బృందం.. తొలి రెండు రోజుల్లోనే గురి తప్పింది. రేపు (మంగళవారం) మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో దివ్యాన్షు సింగ్ పవార్, ఎలవేనిల్ వలరివన్లపైనే షూటింగ్ పతక ఆశలు ఆధారపడి ఉన్నాయి. ప్రపంచ షూటింగ్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ స్థానాల్లో కొనసాగుతున్న దివ్యాన్షు, ఎలవేనిల్ నేడు మెడల్‌కు ఏ విధంగా గురి పెడతారనేది ఆసక్తికరం. రియో ఒలింపిక్ మెడలిస్ట్ పి.వి సింధు, దిగ్గజ బాక్సర్ మేరీకోమ్, టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బత్రాలు శుభారంభం గావించారు. రోయింగ్‌లో అర్జున్ లాల్, అరవింద్ సింగ్ జోడీ రిపీచేజ్ సెమీఫైనల్లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది.
షూటర్లు ప్చ్ : స్టార్ షూటర్ మను భాకర్ అరుదైన సమస్యలో చిక్కుకుని.. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్‌కు దూరమైంది!. క్వాలిఫియింగ్ రౌండ్ తొలి సిరీస్‌లోనే ఎనిమిది సార్లు పది, రెండు సార్లు 9 స్కోరు చేసిన మను భాకర్.. 98తో ఆరంభించింది. తర్వాతి సిరీస్‌ల్లో వరుసగా 95, 94, 96, 98, 94 స్కోరు చేసింది. రైఫిల్ గన్ సాంకేతిక సమస్య తలెత్తటంతో మను భాకర్ విలువైన 300 సెకండ్ల సమయాన్ని కోల్పోయింది. ఆఖరు సిరీస్‌లో చివరి షాట్‌ను 10 స్కోరు చేస్తే ఫైనల్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉండగా.. మను 8 మాత్రమే సాధించింది. దీంతో 575 పాయింట్లతో అర్హత రౌండ్లో 12వ స్థానానికి పరిమితమైంది. ఇదే విభాగంలో పోటీపడిన మరో షూటర్ యశస్విని దేశారు 574 పాయింట్లతో 13వ స్థానంతో సరిపెట్టుకుంది. అర్హత రౌండ్లో యశస్విని వరుసగా 94, 98, 94, 97 మంచి స్కోర్లు చేసినా..మరో రెండు సిరీస్‌ల్లో రాణించలేదు. ఈ విభాగంలో కనీసం ఓ పతకం ఆశించిన భారత్‌కు భంగపాటు తప్పలేదు. (అర్హత రౌండ్లో 75 నిమిషాల్లో 60 షాట్లు ఉంటాయి. ప్రతి షాట్‌కు గరిష్టంగా పది పాయింట్లు ఇస్తారు).
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో వరల్డ్ నం.2 దివ్యాన్షు సింగ్ పన్వార్ పతకం ఫేవరేట్‌గా కనిపించాడు. అర్హత రౌండ్లో అతడు దారుణంగా విఫలమయ్యాడు. ఎంతో ఒత్తిడితో కనిపించిన దివ్యాన్షు.. పోటీ మధ్యలో కోచ్ వైపు నిసహాయుడిగా చూడటం కనిపించింది. 622.8 స్కోరుతో దివ్యాన్షు సింగ్ పన్వార్ 32వ స్థానంలో నిలిచాడు. మరో షూటర్ దీపక్ కుమార్ 624.7 పాయింట్లతో 26వ స్థానంలో నిలిచాడు. ఒత్తిడిని అధిగమించటంలో ప్రధానంగా దివ్యాన్షు వైఫల్యం స్పష్టంగా కనిపించింది. మరి రేపు మిక్స్డ్ టీమ్ విభాగంలోనైనా మానసికంగా దృడంగా ముందుకొస్తాడేమో చూడాలి.
మెన్స్ స్కీట్ విభాగంలో అంగడ్ వీర్ సింగ్ బజ్వా అర్హత రౌండ్లో ఆకట్టుకున్నాడు. అర్హత రౌండ్లో తొలి మూడు సిరీస్‌ల్లో అతడు రెండు మాత్రమే మిస్ అయ్యాడు. 75 టార్గెట్లను 25, 24, 24తో ముగించాడు. 73 పాయింట్లతో ప్రస్తుతం 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. మరో షూటర్ మైరాజ్ ఖాన్ 71 పాయింట్లతో 25వ స్థానంలో నిలిచాడు. నేడు ఉదయం ఈ విభాగంలో మరో రెండు సిరీస్‌లు జరుగుతాయి. 50 టార్గెట్లు ముగిసిన అనంతరం ఎనిమిది మంది అథ్లెట్లు ఫైనల్స్‌కు అర్హత సాధించనున్నారు. మంగళవారం మెడల్ ఈవెంట్ (ఫైనల్స్) జరుగుతాయి.
సానియా జోడీ ఔట్ : టెన్నిస్ స్టార్, హైదరాబాదీ అమ్మాయి సానియా మీర్జాకు షాక్ తగిలింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లోనే సానియా మీర్జాకు ఓటమి ఎదురైంది. యువ క్రీడాకారిణి అంకిత రైనాతో కలిసి ఒలింపిక్ బరిలోకి దిగిన మాజీ వరల్డ్ నం.1 సానియా మీర్జా రెండో రౌండ్‌కు వెళ్లకుండానే ఇంటిముఖం పట్టింది. ఉక్రెయిన్ కవల సోదరీమణులు నదియా కిచెనోక్, లుడిమిలా కిచనోక్లు భారత జోడీపై సంచలన విజయం నమోదు చేశారు. తొలి సెట్‌ను అత్యంత సునాయాసంగా 6-0తో గెలుపొందిన సానియా, అంకితకు ఇక ఎదురులేదనే అనిపించింది. కానీ రెండో సెట్లో ఉక్రెయిన్ అక్కాచెల్లెళ్లు గొప్పగా పుంజుకున్నారు. టైబ్రేకర్‌కు దారితీసిన రెండో సెట్‌ను 7-6(7-0)తో గెల్చుకుని మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో సెట్‌కు తీసుకెళ్లారు. నిర్ణయాత్మక సెట్లో సానియా, అంకిత తడబడ్డారు. 8-10తో మూడో సెట్‌ను, రెండో రౌండ్ బెర్త్‌ను కోల్పోయారు. ఈ ఓటమితో మహిళల డబుల్స్‌లో భారత పోరాటానికి తెరపడింది.
సింధు అలవోకగా.. : బ్యాడ్మింటన్ పసిడి ఫేవరేట్, తెలుగు తేజం పి.వి సింధు వేట దూకుడుగా మొదలుపెట్టింది. మహిళల సింగిల్స్ గ్రూప్-జె తొలి మ్యాచ్‌లో సింధు అత్యంత సులువైన విజయం ఖాతాలో వేసుకుంది. ఇజ్రెయిల్ షట్లర్ సెనియా పొలికర్పోవ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. తొలి సెట్‌ను 21-7తో గెల్చుకున్న సింధు.. రెండో సెట్‌ను 21-10తో సాధించింది. గ్రూప్-జె.. రెండో మ్యాచ్‌లో హాంగ్‌కాంగ్ షట్లర్ చాంగ్ నాంగ్ యితో సింధు తలపడనున్నది.
మేరీ పంచ్ పడింది! : బాక్సింగ్ దిగ్గజం ఎంసీ మేరీకోమ్ శుభారంభం చేసింది. మహిళల 51 కేజీల విభాగం తొలి రౌండ్లో మేరీకోమ్ 4-1తో విజయం సాధించింది. డామినికన్ రిపబ్లికన్‌కు చెందిన యువ బాక్సర్ గార్సియాను తన పంచ్‌లతో మేరీకోమ్ చిత్తు చేసింది. తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడిన మనీశ్ కౌశిక్ పోరాడి ఓడాడు. పురుషుల 63 కేజీల విభాగంలో మనీశ్ కౌశిక్ బ్రిటన్ బాక్సర్ చేతిలో కంగుతిన్నాడు. 1-4తో తొలి రౌండ్లోనే ఓటమి చవిచూశాడు.
ప్రణతి ఫెయిల్ : రియో ఒలింపిక్స్‌లో జిమ్నాస్టిక్స్‌లో భారత్ పతకం తృటిలో చేజార్చుకుంది. దీప కర్మాకర్ అద్వితీయ ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచింది. గాయాల బెడదతో దీప ఈ ఏడాది టోక్యోకు అర్హత సాధించలేదు. పశ్చిమ బెంగాల్ అథ్లెట్ ప్రణతి నాయక్ టోక్యో బెర్త్ సాధించింది. ఆదివారం జరిగిన ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఆల్‌రౌండ్ ఫైనల్‌కు ప్రణతి అర్హత సాధించలేదు. 42.565 పాయింట్లు సాధించిన ప్రణతి పాయింట్ల పట్టికలో దిగువన నిలిచింది. నాలుగు విభాగాల్లోనూ ప్రణితి ఆశించిన ప్రదర్శన చేయలేదు. ఫ్లోర్ ఎక్సర్సైజ్లో 10.633, వాల్ట్స్‌లో 13.466, అన్ఈవెన్ బార్స్‌లో 9.033, బ్యాలెన్స్ బీమ్‌లో 9.433 పాయింట్లు సాధించింది. ప్రతి విభాగంలో టాప్-8లో నిలిచిన అథ్లెట్లు ఫైనల్స్‌కు అర్హత సాధించారు. ప్రణితి నాలుగు విభాగాల్లో వెనుకంజ వేసింది. ఆగస్టు 1, 2న జరిగే ఫైనల్స్‌కు దూరమైంది.
రోయింగ్‌లో రికార్డు! : భారత రోయర్లు టోక్యోలో చరిత్ర సృష్టించారు!. ఒలింపిక్ రోయింగ్ ఈవెంట్లో సెమీఫైనల్స్‌కు చేరుకున్న ఘనత దక్కించుకున్నారు. మెన్స్ లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ విభాగంలో అర్జున్‌లాల్, అరవింద్ సింగ్ జోడీ రిపిచేజ్లో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. రిపిచేజ్ ఈవెంట్లో 6:51.36 సెకండ్లలో రేసు ముగించి సెమీస్‌కు చేరుకున్నారు. ఉవ్వెత్తున ఎగిపిపడుతున్న అలల కారణంగా సోమవారం సెమీస్ వీలు పడేట్టు లేదు. సెమీఫైనల్లో గ్రూప్-ఏ, గ్రూప్-బి విభాగాలు వేర్వేరుగా తలపడనుండగా.. ప్రతి గ్రూపు నుంచి మూడు జట్లు పసిడి పోరుకు అర్హత సాధిస్తాయి. ' నా కోచింగ్ కెరీర్లో ఇదే అత్యుత్తమ రోజు. సెమీఫైనల్స్‌కు చేరుకోవటం సైతం గొప్ప ఘనతే. సెమీస్‌లో అత్యుత్తమ ప్రదర్శనకు ప్రయత్నిస్తాం' అని రోయింగ్ కోచ్ ఇస్మాయిల్ బేగ్ తెలిపారు.
మనిక ముందుకు : టేబుల్ టెన్నిస్‌లో పతకం ఆశిస్తోన్న స్టార్ క్రీడాకారిణి మనిక బత్ర మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌కు చేరుకుంది. ఆదివారం ఉక్రెయిన్ అమ్మాయితో జరిగిన మ్యాచ్‌లో మనిక ఉత్కంఠ విజయం సాధించింది. 3-3తో సమవుజ్జీలుగా నిలిచిన సమయంలో నిర్ణయాత్మక ఏడో సెట్లో మనిక పైచేయి సాధించింది. మూడోరౌండ్లోకి ప్రవేశించింది. 4-11, 4-11, 11-7, 12-10, 8-11, 11-5, 11-7తో మనిక బత్ర విజయం సాధించింది. మూడోరౌండ్లో పదో సీడ్ సోఫియా (ఆస్ట్రియా)తో మనిక పోటీపడనుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో వరల్డ్ నం.38 సతియన్ జ్ఞాణశేఖరన్ వరల్డ్ నం.95 చేతిలో షాక్ తిన్నాడు. హాంగ్‌కాంగ్ ఆటగాడితో మ్యాచ్‌లో 7-11, 11-7, 11-4, 9-11, 10-12, 6-11తో పరాజంయ పాలయ్యాడు.
హాకీలో చేదు ఫలితం : తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గెలుపొందిన ఉత్సాహంలో ఉన్న మెన్స్ హాకీ జట్టు.. బలమైన ఆస్ట్రేలియా చేతిలో దారుణ ఓటమి చెందింది. ఏ దశలోనూ ఆస్ట్రేలియాకు పోటీ ఇవ్వలేదు. మ్యాచ్‌లో క్వార్టర్లు పూర్తి కాకముందే 4-0తో గెలుపు లాంఛనం చేసుకున్న ఆస్ట్రేలియా దూకుడుగా దాడి చేసింది. 7-1తో భారీ విజయం నమోదు చేసింది. భారత్ తరఫున దిల్‌ప్రీత్ సింగ్ ఒక్కడే గోల్ కొట్టాడు. భారత గోల్‌కీపర్ శ్రీజేష్ను పడగొట్టిన ఆసీస్.. ఏకంగా ఏడుసార్లు గోల్ కొట్టింది. ఆరు గోల్స్ అంతరం భారత్ నాకౌట్ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదం ఉంది.