Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్మనీ చేతిలో 0-2తో పరాజయం
- మనిక బత్ర, నాగల్, భవాని దేవి ఔట్
- ఆర్చరీ క్వార్టర్స్‌లో మెన్స్ జట్టు ఓటమి
నవతెలంగాణ-టోక్యో
మెడల్ ఆశలతో టోక్యోలో అడుగుపెట్టిన హాకీ ఇండియా అమ్మాయిలు ఇప్పటివరకు ఒక్క విజయం నమోదు చేయలేదు. గ్రూప్ దశలో ఆడిన రెండు మ్యాచుల్లోనూ నిరాశపరిచారు. తొలుత నెదర్లాండ్స్ చేతిలో 1-5తో కంగుతిన్న రాణి రాంపాల్ బృందం.. సోమవారం జరిగిన మరో మ్యాచ్‌లో జర్మనీ చేతిలో చిత్తయ్యారు!. వరల్డ్ నం.3 జర్మనీ ప్రతి దశలోనూ భారత్‌పై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి రెండు మ్యాచుల్లో ఓటమితో నాకౌట్ దశ అవకాశాలను భారత్ కఠినం చేసుకుంది. గ్రూప్ దశలో మిగిలిన మ్యాచుల్లో గ్రేట్ బ్రిటన్, ఐర్లాండ్, దక్షిణాఫ్రికాలపై విజయాలు సాధిస్తేనే భారత్ ముందంజ వేసేందుకు అవకాశం ఉంటుంది. సోమవారం నాటి మ్యాచ్‌లో జర్మనీ ఆరంభంలోనే ఆధిక్యం సాధించి.. అనంతరం తిరుగులేని డిఫెన్స్‌తో భారత్‌ను ఇరకాటంలో పడేసింది. 12వ నిమిషంలోనే జర్మనీ కెప్టెన్ నైకీ లోరెంజ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్ కొట్టి ఆ జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. భారత గోల్‌కీపర్ సవితను జర్మన్లు సులువుగా బురిడీ కొట్టించారు!. 35వ నిమిషంలో అనా గోల్‌తో జర్మనీ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కెప్టెన్ రాణి రాంపాల్ అద్భుత రిఫరల్‌తో పెనాల్టీ కార్నర్ సాధించిన భారత్.. గుర్జీత్ కౌర్ తప్పిదంతో గోల్ అవకాశాన్ని చేజార్చుకుంది. నాలుగు క్వార్టర్లలో భారత్ ఎప్పుడూ దూకుడుగా ఆడే ప్రయత్నం చేయకపోవటం గమనార్హం.
మనిక బత్ర నిష్క్రమణ : ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బత్ర పతక పోరుకు తెర పడింది. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో మనిక బత్రకు పరాజయం ఎదురైంది. అగ్రశ్రేణి క్రీడాకారిణి సోఫియా పొల్కనోవా (ఆస్ట్రియా) చేతిలో వరుస గేముల్లో ఓటమిపాలైంది. 8-11, 2-11, 5-11, 7-11తో 0-4తో పరాజయం పొందింది. వ్యక్తిగత కోచ్ పరంజిపెకు క్రీడా గ్రామంలోకి అనుమతి లేకపోవటంతో కోచ్ లేకుండానే మనిక మ్యాచులు ఆడింది. జాతీయ జట్టు కోచ్ మనిక మ్యాచ్‌కు హాజరయ్యేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ.. ఆయన సేవలను మనిక తిరస్కరించినట్టు సమాచారం. రెండో రౌండ్ మ్యాచ్‌లో సుతీర్ఘ ముఖర్జి సైతం ఓటమి చెందింది. పోర్చుగల్ క్రీడాకారిణి ఫు యు చేతిలో 3-11, 3-11, 5-11, 5-11తో వరుసగా 0-4తో చేతులెత్తేసింది. దీంతో మహిళల సింగిల్స్‌లో భారత్ పోరు ముగిసింది. పురుషుల సింగిల్స్ విభాగంలో వెటరన్ ఆటగాడు అచంట శరత్ కమల్ మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. 2-11, 11-8, 11-5, 9-11, 11-6, 11-9తో అపలోనియ (పోర్చుగల్)పై గెలుపొందాడు. నేడు చైనా టేబుల్ టెన్నిస్ దిగ్గజం మా లాంగ్‌ను ఎదుర్కొనున్నాడు. ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ మా లాంగ్‌తో తలపడటం శరత్‌కు కఠిన సవాల్‌గా నిలువనుంది.
టెన్నిస్‌లో తొలి రౌండ్ విజయంతో రికార్డు నెలకొల్పిన యువ ఆటగాడు సుమిత్ నాగల్‌కు రెండో రౌండ్లోకే చెక్ పడింది. ప్రపంచ నం.2, రష్యా స్టార్ ఆటగాడు డానిల్ మెద్వదేవ్ చేతిలో వరుస సెట్లలో ఓడిపోయాడు. 6-2, 6-1తో మెద్వదేవ్ అలవోక విజయం నమోదు చేశాడు. 1996 ఒలింపిక్స్‌లో లియాండర్ పేస్ చరిత్ర సృష్టించగా.. ఆ తర్వాత టెన్నిస్‌లో రెండో రౌండ్‌కు చేరుకున్న తొలి భారత టెన్నిస్ ప్లేయర్‌గా నాగల్ నిలిచాడు.
అన్నింటా నిరాశే..! : తొలి మ్యాచ్‌లో సంచలన విజయం సాధించిన సాత్విక్, చిరాగ్ జోడీ.. రెండో మ్యాచ్‌లో పోరాడి ఓడింది. అగ్రశ్రేణి ఇండోనేషియా జోడీ మార్కస్, కెవిన్ చేతిలో 13-21, 12-21తో వరుస గేముల్లో పరాజయం పాలయ్యారు. ఒలింపిక్స్‌లో తలపడిన తొలి భారత ఫెన్సర్‌గా చరిత్ర సృష్టించిన సి.ఏ భవాని దేవి టోక్యోను విజయంతో ఆరంభించింది. తొలి రౌండ్లో 15-3తో ట్యూనిషియా ఫెన్సర్పై గెలుపొందింది. తర్వాతి రౌండ్లో ఫ్రాన్స్ ఫెన్సర్‌కు 7-15తో కోల్పోయింది. బాక్సింగ్‌లో వరుసగా మూడో భారత బాక్సర్ తొలి రౌండ్లోనే ఓటమి పాలయ్యాడు. వికాశ్ క్రిష్ణ, మనీశ్ కుమార్ దారిలోనే ఆశీష్ కుమార్ నడిచాడు. తొలి రౌండ్లో చైనా బాక్సర్ చేతిలో చిత్తుగా ఓడాడు. ఐదుగురు జడ్జీలు చైనా బాక్సర్‌ను 5-0తో విజేతగా ప్రకటించారు. షూటింగ్ మెన్స్ స్కీట్ విభాగంలోనూ భారత షూటర్లు ఫైనల్స్‌కు అర్హత సాధించటంలో విఫలమయ్యారు. 120 పాయింట్లతో ఏ.వి.ఎస్ బజ్వా 18వ స్థానంలో నిలువగా.. 117 పాయింట్లతో ఎం.ఏ ఖాన్ 25వ స్థానంలో నిరాశపరిచారు. మెన్స్ 200 మీటర్ల బటర్‌ఫ్లై స్విమ్మింగ్‌లో సాజన్ ప్రకాశ్ ఫైనల్స్‌కు అర్మత సాధించలేదు. వ్యక్తిగత ఉత్తమ వేగాన్ని సైతం ప్రకాశ్ అందుకోలేదు. 1:57.22తో హీట్2లో నాలుగో స్థానంలో.. ఓవరాల్‌గా 24వ స్థానంతో ఫైనల్స్‌కు అర్హత సాధించలేదు.
ఆర్చరీ పురుషుల జట్టు విభాగంలో తరుణ్‌దీప్ రారు, ప్రవీణ్ జాదవ్, అటాను దాసులు క్వార్టర్స్‌లో కొరియాకు తలొగ్గారు. ఎలిమినేషన్ రౌండ్లో కజకిస్థాన్‌పై 6-2తో భారత్ గెలుపొందింది. 55-54, 52-51, 56-57, 55-54తో భారత ఆర్చర్లు రాణించారు. క్వార్టర్ఫైనల్లో దక్షిణ కొరియా చేతిలో 0-6తో ఓటమి చెందింది. 54-59, 57-59, 54-56తో కొరియన్ల ముందు తలొంచారు. మిక్స్డ్ విభాగం క్వార్టర్స్‌లోనూ కొరియా ఆర్చర్లు భారత్‌ను ఓడించిన సంగతి తెలిసిందే.