Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టోక్యో : 2020 ఒలింపిక్స్‌లో భారత్ అత్యధిక పతకాలు షూటింగ్ నుంచి ఆశించింది. అంచనాలకు తగినట్టుగానే భారత షూటర్లు అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించారు. ఒలింపిక్స్ ఆరంభానికి నెల రోజులు ముందు క్రోయేషియాలో జరిగిన షూటింగ్ ప్రపంచకప్‌లో గొప్ప ప్రదర్శన చేసి టోక్యో ఒలింపిక్స్‌పై అంచనాలు భారీగా పెంచారు. ప్రపంచకప్‌లలో పతకాలు సాధించిన షూటర్లు బరిలో ఉండటంతో భారత్ గణనీయంగా మెడల్స్ ఆశించింది. వ్యక్తిగత విభాగాల్లో అంచనాలకు విరుద్ధమైన ఫలితాలు వెలువడ్డాయి. మను భాకర్, ఎలవేనిల్, యశస్విని, సౌరభ్ చౌదరి, దీపక్ కుమార్, దివ్యాన్షు సింగ్ పన్వార్‌లు దారుణంగా నిరాశపరిచారు. వ్యక్తిగత విభాగాల్లో భారత్ పతక ఆశలకు గండి పడగా.. ఇప్పుడు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మాత్రమే టీమ్ ఇండియాకు అవకాశాలు కనిపిస్తున్నాయి.
నేడు రెండు విభాగాల్లో నాలుగు జట్లు పోటీలో నిలువనున్నాయి. ఉదయం 5.30 గంటలకు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మను భాకర్, సౌరభ్ చౌదరిలు, యశస్విని సింగ్ దేశ్వాల్, అభిషేక్ వర్మలు పోటీపడుతున్నారు. మను భాకర్, సౌరభ్ చౌదరిలు ఇద్దరూ వ్యక్తిగత విభాగాల్లో మెడల్ రేసులో నిలిచారు. ఆ లోటును జట్టు విభాగంలో తీర్చుకునేందుకు ఎదురుచూస్తున్నారు!. యశస్విని సింగ్, అభిషేక్ వర్మలు వ్యక్తిగత విభాగంలో తడబడ్డారు. ఒత్తిడిని అధిగమిస్తే నేడు మిక్స్డ్ జట్టు విభాగంలో మంచి అవకాశాలు ఉన్నాయి. ఉదయం 9.45 గంటలకు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ భారత్ నుంచి రెండు జోడీలో బరిలో నిలువనున్నాయి. యువ షూటర్ ఎలవేనిల్ వలరివన్, దివ్యాన్షు సింగ్ పన్వార్‌లు, అంజుమ్, దీపక్ కుమార్‌లు ఈ విభాగంలో పోటీపడుతున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఎలవేనిల్ వలరివన్, దివ్యాన్షు పన్వార్‌లు టాప్‌లో కొనసాగుతున్నారు. ఎలవేనిల్ వలరివన్పై ఒలింపిక్ మెడలిస్ట్, ఆమె మెంటర్ గగన్ నారంగ్ భారీ అంచనాలతో ఉన్నారు. మిక్స్డ్ విభాగంలో దివ్యాన్షుతో కలిసి ఆమె మ్యాజిక్ చేసేందుకు అవకాశం ఉంది. అంజుమ్, దీపక్ కుమార్‌లు సైతం ఈ విభాగంలో మెడల్‌పై కన్నేశారు. వరుస ఒలింపిక్స్‌లో మెడల్స్ అనంతరం రియోలో నిరాశపరిచిన షూటర్లు.. తాజాగా టోక్యోలో ఇప్పటివరకు అదే పని చేశారు. నేడు మిక్స్డ్ జట్టు విభాగంలో అంచనాలను అందుకుంటే.. ఒలింపిక్ షూటింగ్ మెడల్ భారత్ గూటికి చేరుకున్నట్టే!.