Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెగా ఈవెంట్లో యువ షూటర్లు విఫలం
నవతెలంగాణ-టోక్యో
ప్రపంచకప్‌లో కలిసి పతకాలు కొట్టారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ ముందంజలో కొనసాగుతున్నారు. ప్రతిభ పుష్కలంగా ఉంది, ఫలితాలు అద్వితీయంగా సాధించారు. అందుకే టోక్యో ఒలింపిక్స్‌లో యువ షూటర్ల బృందంపై బోలెడన్ని పతక ఆశలు పెంచుకున్నారు. యువ ప్రతిభకు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సైతం పట్టం కట్టారు. మిగతా క్రీడలతో పోల్చితే భిన్నంగా.. షూటర్లకు అన్ని సౌకర్యాలు, వసతులు, మౌళిక సదుపాయాలు, ఆధునాతన తుపాకులు సమకూర్చారు. అయినా, టోక్యో ఒలింపిక్స్‌లో భారత షూటర్లు మెరవలేదు. ప్రాక్టీస్ సెషన్లలో సైతం దుమ్మురేపే స్కోర్లు నమోదు చేసిన యువ షూటర్లు.. ఎందుకో అసలు సమరంలో గురి తప్పారు. ఫలితంగా కచ్చితంగా పతకం వస్తుందని ఆశించిన మిక్స్డ్ టీమ్ విభాగంలోనూ భారత్‌కు రిక్తహస్తమే మిగిలింది. మంగళవారం ఉదయం అసాక షూటింగ్ రేంజ్లో జరిగిన మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగాల్లో భారత్ భంగపడింది. మను భాకర్, సౌరభ్ చౌదరి జోడీ.. ఎలవేనిల్ వలరివన్, దివ్యాన్షు సింగ్ పన్వార్ జోడీలు తీవ్రంగా నిరాశపరిచారు.
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్, సౌరభ్ చౌదరిలు అద్భుత ఆరంభం సాధించారు. క్వాలిఫయింగ్ తొలి దశలో అగ్రస్థానంలో నిలిచారు. 600 పాయింట్లకు 586 స్కోరు చేసి అర్హత రౌండ్లో టాప్ లేపారు. అర్హత రౌండ్ రెండో దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు పసిడి పోరుకు.. 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లు కాంస్య పోరుకు అర్హత సాధిస్తాయి. ఈ రౌండ్లో మనోళ్లు మిస్‌ఫైర్ అయ్యారు. తొలి సిరీస్‌లో సౌరభ్ 96, మను 92 స్కోరు చేయగా.. రెండో సిరీస్‌లో సౌరభ్ 98, మను 94 స్కోరు చేశారు. 400 పాయింట్లకు 380తో ఏడో స్థానంలో నిలిచారు. పతక పోరుకు నాలుగు పాయింట్ల దూరంలో ఆగిపోయారు. రెండు సిరీస్‌ల్లోనూ మను భాకర్ వైఫల్యం పతక అవకాశాలను దెబ్బతీసింది. ఇదే ఈవెంట్లో పోటీపడిన యశస్విని, అభిషేక్ వర్మలు 564తో తొలి అర్హత రౌండ్లో 17వ స్థానంలో నిలిచి నిష్క్రమించారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో రెండు జోడీలు కనీసం రెండో దశకు అర్హత సాధించలేదు. ఎలవేనిల్, దేవాన్షులు 625.5తో 12వ స్థానంలో నిలువగా, 623.8తో అంజుమ్, దీపక్‌లు 18వ స్థానంతో సరిపెట్టుకున్నారు. టాప్-8లోని నిలిచిన జోడీలు మాత్రమే రెండో దశకు చేరుకుంటాయి.
వివాదం ఆరంభం!
వైఫల్యం వెలుగుచూడగానే.. వివాదం పుట్టుకొస్తుంది. భారత షూటింగ్‌లోనూ ఇప్పుడు ఇదే పరిస్థితి. ఒలింపిక్స్‌లో మూడు విభాగాల్లో పోటీపడుతున్న మను భాకర్.. టోక్యో ఈవెంట్‌కు మూడు నెలల క్రితం కోచ్ జస్పాల్ రానాతో విడిపోవటం ఇప్పుడు తెరపైకి వచ్చింది. జస్పాల్ రానాతో కలిసి పతకాలు సాధించిన మను భాకర్.. ఒలింపిక్స్‌కు ముందు కోచ్‌తో విభేదాలు పెంచుకుంది. 19 ఏండ్ల మను భాకర్‌ను జస్పాల్ సరైన తీరులో పెట్టలేడని ఆమె కుటుంబ సభ్యులు భావించారు. మూడు విభాగాల్లో మను భాకర్ పోటీపడుతూ ఒత్తిడిని అధిగమించలేదని జస్పాల్ రానా వాదించినట్టు తెలుస్తోంది. ' ఇది నియంతృత్వ దేశం కాదు. అథ్లెట్, కోచ్ అభిప్రాయాలతో సంబంధం లేకుండా కలిసి పనిచేయమని ఒత్తిడి చేయలేం. ఈ విషయంలో మను భాకర్ కుటుంబ సభ్యులతో మాట్లాడాను. వారు ఏదో చెప్పారు. మను భాకర్ తన అభ్యంతరాలను ముందుంచింది. కోచ్ జస్పాల్ రానా ఆయన తన వైఖరి చెప్పారు. ఇద్దరూ కలిసి పనిచేసేందుకు ఇష్టపడలేదు. మను భాకర్ గతంలో మూడు విభాగాల్లోనూ ఆడి మెప్పించింది. టోక్యోలో ఇప్పుడు కొత్త కోణం అవసరం లేదు. ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇంకా అవకాశం ఉంది. పోస్టుమార్టం చేసేందుకు ఒలింపిక్స్ ముగిసేవరకూ వేచిచూడాలి' జాతీయ రైఫిల్ సంఘం అధ్యక్షుడు రణీందర్ తెలిపారు. మను భాకర్, రాహిలు శుక్రవారం జరిగే మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలోనూ పోటీపడనున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకానికి మను భాకర్‌కు మరో అవకాశం సైతం మిగిలే ఉంది.