Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వార్టర్స్‌లో బర్గోహైన్
- పతకానికి అడుగు దూరంలో యువ బాక్సర్
పతకం రాలేదు. కానీ పతకం వస్తుందనే నమ్మకం కలిగింది. నాలుగో రోజు సైతం టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం దక్కలేదు. యువ బాక్సర్ లవ్లీనా బర్గోహైన్ ఒలింపిక్స్ అరంగేట్రంలో అదరగొట్టింది. జర్మనీ బాక్సర్‌కు తన పంచ్ పస చూపించింది. విశ్వ క్రీడల్లో పతకానికి ఓ అడుగు దూరంలో నిలిచింది.
నవతెలంగాణ-టోక్యో
బాక్సింగ్‌లో ఒలింపిక్ పతకాలు అనగానే సహజంగానే అంచనాలు స్టార్స్‌పైనే ఉంటాయి. టాప్ సీడ్ బాక్సర్ అమిత్ పంఘాల్, దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ఈ జాబితాలో ముందున్నారు. ఒలింపిక్స్ స్థాయిలో ఒత్తిడిని అధిగమించటమే తొలి విజయం. ఒత్తిడిని జయిస్తేనే.. బౌట్లో ప్రత్యర్థిని మట్టికరిపించగలం. తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న అథ్లెట్ల నుంచి పెద్దగా ఆశించలేము. మహిళల 69 కేజీల విభాగంలో భారత బాక్సర్ లవ్లీనా బర్గోహైన్ (23) అంచనాలు లేకుండా బరిలోకి దిగింది. యువ బాక్సర్ లవ్లీనాకు తొలి రౌండ్లో 'బై' లభించగా.. నేరుగా ప్రీ క్వార్టర్ఫైనల్లో బరిలో నిలిచింది. తనకంటే 12 ఏండ్ల సీనియర్ బాక్సర్‌ను ఎదుర్కొవటం లవ్లీనాకు తొలి సవాల్. రింగ్‌లోకి దిగింది, మొదలు.. లవ్లీనా లవ్లీ పంచ్‌లతో విరుచుకుపడింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతకాలు సాధించిన జర్మనీ బాక్సర్ నదినె ఆప్టెజ్‌ను లవ్లీనా సాధికారికంగా మట్టికరిపించింది. కుడి చేతితో జబ్స్ను సంధించేందుకు ఇబ్బంది పడినా.. లెఫ్ట్‌హ్యాండ్‌తో పవర్ఫుల్ జబ్స్ ఇచ్చింది. జర్మనీ బాక్సర్ కంటే ఎక్కువ ఎత్తు ఉండటం సైతం లవ్లీనాకు కలిసొచ్చింది. ప్రత్యర్థిపై లవ్లీనా సులువుగా పంచ్‌లు విసిరేందుకు తన ఎత్తును ఆయుధంగా వాడుకుంది. రింగ్‌లో లవ్లీనా స్పష్టమైన ఆధిపత్యం చూపించినా.. ఐదుగురు న్యాయమూర్తుల ఏకగ్రీవ విజేతగా నిలువలేదు. 3-2తో ప్రీ క్వార్టర్స్‌లో విజయం సాధించింది. క్వార్టర్ఫైనల్లో లవ్లీనా బర్గోహైన్కు కఠిన ప్రత్యర్థి ఎదురు కానుంది. ప్రపంచ నం.3 బాక్సర్ చిన్ చెన్ నీన్ (చైనీస్ తైపీ)తో లవ్లీనా తలపడాల్సి ఉంది. 2018 ప్రపంచ చాంపియన్‌షిప్స్ సెమీఫైనల్లో లవ్లీనాపై చిన్ చెన్ మెరుపు విజయం సాధించి, ఆ ఈవెంట్లో స్వర్ణం దక్కించుకుంది. పతకానికి అడుగు దూరంలో నిలిచిన జోష్.. క్వార్టర్స్‌లో లవ్లీనాకు రెట్టింపు ఉత్సాహం ఇవ్వనుంది. శుక్రవారం మహిళల 69 కేజీల విభాగంలో లవ్లీనా, చిన్ చెన్ క్వార్టర్ పోరు జరుగనుంది.
మహిళల 69 కేజీల విభాగంలో లవ్లీనా, ఆప్టెజ్ మ్యాచ్‌లో శ్రీలంక న్యాయమూర్తి వ్యవహారంపై అభిమానులు మండిపడుతు న్నారు. ఐదుగురు న్యాయమూర్తుల్లో శ్రీలంక న్యాయమూర్తి మాత్రమే అన్ని రౌండ్లలో జర్మనీ బాక్సర్ ఆప్టెజ్ స్పష్టమైన ఆధిపత్యం చూపించిందని భావించాడు. ఈ కారణంగానే లవ్లీనా 3-2తో ఉత్కంఠ తీర్పుతో విజయం సాధించింది. ' లవ్లీనా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. వరల్డ్ చాంపియన్‌షిప్ మెడలిస్ట్ జర్మనీ బాక్సర్‌పై ఆమె అద్భుతంగా ఆడింది. ఒత్తిడిని అధిగమించినందుకు లవ్లీనాకు గొప్ప రికార్డు లభించింది. శ్రీలంక న్యాయమూర్తి తీరుతో బాధపడ్డాం. ఆయన మాత్రమే లవ్లీనా మూడు రౌండ్లలోనూ ఓడిందని అనుకున్నారు' అని భారత మహిళల బాక్సింగ్ హై పర్ఫార్మెన్స్ డైరెక్టర్ రఫెలె అన్నారు. మంగళవారం భారత్ నుంచి లవ్లీనా బర్గోహైన్ మాత్రమే బరిలోకి దిగింది. నేడు మహిళల 75 కేజీల విభాగం తొలి రౌండ్లో బాక్సర్ పూజ రాణి పంచ్ విసరనుంది.