Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో : ఆర్టిస్టిక్స్ జిమ్నాస్టిక్స్‌లో రియోలో క్లీన్‌స్వీప్ చేసిన స్టార్ జిమ్నాస్ట్ సిమోన బైల్ మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొం టుంది. జిమ్నాస్టిక్ జట్టు విభాగం ఫైనల్స్ నుంచి స్వయంగా తప్పుకున్న సిమోన బైల్స్.. తాజాగా వ్యక్తిగత ఆల్‌రౌండ్ ఈవెంట్ నుంచీ వైదొలిగింది. టోక్యో ఒలింపిక్స్‌లో రికార్డు పసిడి పతకాలపై కన్నేసి జపాన్‌కు చేరుకున్న అమెరికన్ సూపర్‌స్టార్.. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ' ఆర్టిస్టిక్స్ జిమ్నాస్టిక్స్‌లో సిమోన బైల్స్ తన టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు బరిలోకి దిగటం లేదు. నాలుగుసార్లు ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఆల్ రౌండ్ విభాగం ఫైనల్లో పోటీపడటం లేదు. బైల్స్ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టనుంది' అని అమెరికా జిమ్నాస్టిక్స్ సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. ఆల్‌రౌండ్ విభాగంలో నాలుగు రంగాల్లోనూ క్వాలిఫయింగ్‌లో సిమోన బైల్స్ దుమ్మురేపింది. రియోకు మించిన ప్రదర్శన చేసింది. కానీ జట్టు విభాగం ఫైనల్లో తొలి సిరీస్‌లో ఆశించిన ప్రదర్శన చేయటంలో విఫలమైంది. అమెరికా జిమ్నాస్టిక్స్ వైద్యుడిని సంప్రదించి తుది పోరు విన్యాసానికి దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా ఆల్‌రౌండ్ విభాగం నుంచి బైల్స్ తప్పుకోవటంతో.. తొమ్మిదో స్థానంలో నిలిచిన జేడ్ కేరీ ఫైనల్లో పోటీపడనుంది.