Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పతకానికి పంచ్ దూరంలో బాక్సర్ పూజ రాణి
- ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్న పి.వి సింధు
- ప్రీ క్వార్టర్స్‌లో ఆర్చర్ దీపిక కుమారి
టోక్యో ఒలింపిక్స్‌లో తొలి రోజు పతకం పట్టిన భారత్.. వరుసగా నాలుగు రోజు మెడల్ కొట్టడంలో విఫలమైంది. పతకాలు రాకపోయినా.. పతక ఆశలు మాత్రం సజీవంగా నిలుపటంలో భారత అథ్లెట్లు గొప్ప ప్రదర్శన చేశారు. ఒలింపిక్స్ అరంగేట్ర బాక్సర్ పూజ రాణి టోక్యో మెడల్‌కు పంచ్ దూరంలో నిలిచింది. ఆర్చర్ దీపిక కుమారి ప్రీ క్వార్టర్స్‌కు చేరి ఈ విభాగంలో మెడల్ ఆశలు నిలుపగా.. బ్యాడ్మింటన్ అగ్ర షట్లర్ పి.వి సింధు నాకౌట్ దశకు చేరుకుని మెడల్ వేటకు సిద్ధమైంది.
నవతెలంగాణ-టోక్యో
పతకాల వేటలో షూటర్లు నిరాశపరచగా.. బాక్సర్లు ఆశలు కల్పిస్తున్నారు. మహిళల విభాగంలో లవ్లీనా బర్గోహైన్ క్వార్టర్స్‌కు చేరుకుని పతకం ముందు నిలువగా.. తాజాగా మరో మహిళా బాక్సర్ పూజ రాణి సైతం పతక వేటలో ఓ అడుగు ముందుకేసింది. తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న పూజ రాణి మహిళల 75 కేజీల విభాగంలో పంచ్ పవర్ చూపించింది. అల్జీరియా బాక్సర్ చెయిక్ను 5-0తో చిత్తుగా ఓడించిన పూజ రాణి క్వార్టర్ఫైనల్లోకి చేరుకుంది. క్వార్టర్స్‌లో రెండో సీడ్ చైనీస్ తైపీ బాక్సర్‌పై విజయం సాధిస్తే పూజ రాణి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకోనుంది. లెఫ్ట్హ్యాండ్స్ జబ్స్, హుక్ పంచ్‌లతో విరుచుకుపడిన పూజ రాణి.. యువ బాక్సర్‌ను ఉక్కిరి బిక్కిరి చేసింది. దాదాపుగా అన్ని రౌండ్లలోనూ అల్జీరియా బాక్సర్ ముఖంపై పిడి గుద్దుల వర్షం కురిపించింది. ' ఒలింపిక్ బెర్త్ ఖాయం అవకముందు ఎంతో ఒత్తిడి ఎదుర్కొన్నాను. జోర్డాన్ టోర్నీలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించకుంటే బాక్సింగ్‌కు గుడ్‌బై చెప్పాలని అనుకున్నాను. ఇప్పుడు నాకు, ఒలింపిక్ మెడల్‌కు మధ్య సమరంగా బరిలోకి దిగుతున్నాను' అని 30 ఏండ్ల పూజ రాణి తెలిపింది. మహిళల 51 కేజీల విభాగంలో దిగ్గజ బాక్సర్ ఎంసీ మేరీకోమ్ నేడు ప్రీ క్వార్టర్స్ మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. నేడు మేరీకోమ్ విజయం సాధిస్తే బాక్సింగ్‌లో భారత్ పతక అవకాశాలు మరింత మెరుగుపడనున్నాయి.
సింధు సవాల్ ఆరంభం! : గ్రూప్ దశలో పి.వి సింధు వరుస విజయాలు సాధించింది. గ్రూప్-జెలో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్ దశకు చేరుకుంది. బుధవారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో సింధు అలవోకగా గెలుపొందింది. హాంగ్‌కాంగ్ షట్లర్ ఎన్వై చెంగ్‌పై 21-9, 21-16తో అర్థ గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో పైచేయి సాధించింది. తొలి సెట్‌ను సులువుగా సొంతం చేసుకున్న సింధు.. రెండో సెట్లో 6-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 6-7తో హాంగ్‌కాంగ్ అమ్మాయి పోటీనిచ్చింది. ద్వితీయార్థంలో దూకుడు చూపించిన సింధు వరుస సెట్లలోనే లాంఛనం ముగించింది. మహిళల సింగిల్స్ పసిడి ఫేవరేట్‌గా టోక్యో ఒలింపిక్స్‌కు వచ్చిన పి.వి సింధుకు అసలు సవాల్ నాకౌట్ దశలోనే ఎదురు కానుంది. నేడు ప్రీ క్వార్టర్స్‌ఫైనల్లో డెన్మార్క్ షట్లర్ మియా బ్లిచ్ఫిట్తో సింధు తలపడనుంది. డెన్మార్క్ షట్లర్‌తో సింధు ఐదు మ్యాచుల్లో తలపడింది. నాలుగు మ్యాచుల్లో విజయాలతో ముఖాముఖి గణాంకాల్లో ఎదురులేని స్థానంలో నిలిచింది. కానీ ఈ ఏడాది జరిగిన థారులాండ్ ఓపెన్‌లో సింధుపై బ్లిచ్ఫిట్ తొలి విజయం నమోదు చేసింది. రియో ఒలింపిక్స్‌లోనూ బ్లిచ్ఫిట్ ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. ఇటీవల మెరుగైన ఆటతీరుతో టోక్యోలో పతకం ఆశిస్తోంది. మంచి ఫామ్‌లో ఉన్న బ్లిచ్ఫిట్ నేడు ప్రీ క్వార్టర్స్‌లో సింధుకు గట్టి పోటీ ఇవ్వనుంది. నాణ్యమైన ప్రత్యర్థులతో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించే నేడు ఏం చేస్తుందో చూడాలి. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో బి. సాయిప్రణీత్ నిరాశపరిచాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమి చెందాడు. గ్రూప్ దశ నుంచే నిష్క్రమించాడు. నెదర్లాండ్స్ ఆటగాడు మార్క్ చేతిలో వరుస గేముల్లో పరాజయం పాలయ్యాడు. 14-21, 14-21తో తేలిపోయాడు. గ్రూప్-డిలో మూడోస్థానంలో నిలిచిన సాయిప్రణీత్ నాకౌట్ దశకు అర్హత సాధించలేదు.
దీపిక మెరిసింది! : ఆర్చరీ మిక్స్డ్, మెన్స్ జట్టు విభాగాల్లో తీవ్ర నిరాశ మిగిల్చినా.. వ్యక్తిగత విభాగంలో ఆశలు సజీవంగా నిలిచాయి. బుధవారం ఆర్చరీ వ్యక్తిగత విభాగం ఎలిమినేషన్ రౌండ్లలో భారత్ మెరుగైన ప్రదర్శనతో ఆరంభించింది. మహిళల రికర్వ్ విభాగంలో దీపిక కుమారి ప్రీ క్వార్టర్ఫైనల్స్కు చేరుకుంది. తొలుత భూటాన్ కర్మ ఆర్చర్‌పై 9-6, 10-8, 8-10తో విజయం సాధించిన దీపిక కుమారి.. తర్వాతి రౌండ్లో అమెరికా జెన్నీఫర్ ఫెర్నాండేజ్ ఆర్చర్‌పై గెలుపొందింది. 25-26, 28-25, 27-25, 24-25, 26-25తో పైచేయి సాధించింది. 6-4తో అమెరికా ఆర్చర్‌ను ఓడించి ప్రీ క్వార్టర్స్‌లో కాలుమోపింది. దీపిక కుమారికి అసలు క్వార్టర్ఫైనల్లోనే ఎదురు కానుంది. కొరియా ఆర్చర్ క్వార్టర్స్‌లో సవాల్ విసిరే అవకాశం ఎక్కువగా ఉంది. పురుషుల వ్యక్తిగత విభాగాల్లో తరుణ్‌దీప్ రారు, ప్రవీణ్ జాదవ్‌ల పోరాటానికి తెరపడింది. తొలి రౌండ్లో ఉక్రెయిన్ ఆర్చర్‌పై 6-4తో గెలుపొందిన తరుణ్‌దీప్ రారు.. రెండో రౌండ్లో ఇజ్రాయెల్ ఆర్చర్ చేతిలో షూట్‌ఆఫ్‌లో ఓటమి చెందాడు. ప్రవీణ్ జాదవ్ తొలుత రష్యా ఆర్చర్‌పై 6-0తో మెరుపు విజయం నమోదు చేశాడు. అమెరికా ఆర్చర్ చేతిలో 0-6తో నిరాశపరిచాడు.
హాకీలో అదే వైఫల్యం : మహిళల హాకీ జట్టు టోక్యోలో అత్యంత పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. గ్రూప్ దశలో వరుసగా మూడో మ్యాచ్‌లో రాణి రాంపాల్ సేన మట్టికరిచింది. డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్ గ్రేట్ బ్రిటన్‌తో గ్రూప్ మ్యాచ్‌లో అమ్మాయిలు తేలిపోయారు. తొలి రెండు మ్యాచుల్లో చూపిన పట్టుదల సైతం బ్రిటన్‌పై చూపలేకపోయారు. 1-4తో వరుసగా మూడో పరాజయం మూటగట్టుకుని నాకౌట్ అవకాశాలు దాదాపుగా ఆవిరి చేసుకున్నారు. రోయింగ్‌లో సెమీఫైనల్స్‌కు చేరుకున్న చరిత్ర సృష్టించిన మెన్స్ రోయింగ్ జట్టు.. రిపిచేజ్ సెమీఫైనల్లో ఆరో స్థానంలో నిలిచింది. అర్జున్ సింగ్, అరవింద్ జోడీ పతక పోరుకు అర్హత సాధించకపోయినా.. ఒలింపిక్స్ లో భారత్‌కు అత్యుత్తమ ప్రదర్శన చేశారు. సెయింగ్లో కెసి గణపతి, వరుణ్ ఠక్కర్‌లు వరుసగా మూడు రేసుల్లో 18, 17, 19వ స్థానాల్లో నిలిచారు. మెన్స్ స్కిఫ్ 49ఈఆర్‌లో ఓవరాల్‌గా 18వ స్థానం సాధించారు.
టోక్యో పతకాల పట్టిక
దేశం ప ర కా మొత్తం
1 జపాన్ 13 4 5 22
2 చైనా 12 6 9 27
3 అమెరికా 11 11 9 31
4 రష్యా 7 10 6 23
43 భారత్ 0 1 0 01
గమనిక : పసిడి, రజతం, కాంస్యం
ఒలింపిక్స్‌లో భారత్
ఆర్చరీ : మెన్స్ వ్యక్తిగత విభాగం ఎలిమినేషన్ రౌండ్. చైనీస్ తైపీ ఆర్చర్‌తో అటాను దాసు పోరు. ఉదయం 7.31 గంటలకు.
షూటింగ్ : మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగం అర్మత రౌండ్ (మను భాకర్, రాహి సర్నోబట్). ఉదయం 5.30 నుంచి..
బ్యాడ్మింటన్ : మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్‌లో మియా బ్లిచ్ఫిట్ (డెన్మార్క్)తో పి.వి సింధు పోరు. ఉదయం 6.15 నుంచి.
హాకీ : మెన్స్ గ్రూప్-ఏలో అర్జెంటీనాతో భారత్ ఢ. ఉదయం 6 గంటలకు..
గోల్ఫ్ : మెన్స్ వ్యక్తిగత విభాగం రౌండ్1 (అనిర్బన్ లహిరి, మానె ఉదయన్). ఉదయం
రోయింగ్ : మెన్స్ లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ (ఫైనల్ బి) (అర్జున్, అరవింద్) ఉదయం 5.20 నుంచి..
బాక్సింగ్ : మహిళల 51 కేజీల విభాగంలో కొలంబియా బాక్సర్తో మేరీకోమ్ ప్రీ క్వార్టర్స్ పోరు. మధ్యాహ్నాం 3.36 గంటలకు. మెన్స్ 91 కేజీల విభాగంలో జమైకా బాక్సర్తో సతీశ్ కుమార్ ఢ. ఉదయం 8.48 నుంచి.
స్విమ్మింగ్ : మెన్స్ 100 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో సాజన్ ప్రకాశ్ (హీట్2). సాయంత్రం 4.16 నుంచి..
సెయిలింగ్ : 49ఈఆర్, లేజర్ ఓపెనింగ్ సిరీస్ రేసు7, 8.. లేజర్ రాడియల్ (మహిళలు)ఓపెనింగ్ సిరీస్ 7,8. ఉదయం 8.35 నుంచి..