Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒలింపిక్ చాంప్కు షాకిచ్చిన దాస్
- ప్రీ క్వార్టర్స్‌లో అడుగు
నవతెలంగాణ-టోక్యో
షూటింగ్ తర్వాత, భారత్ అత్యధికంగా పతకాలు ఆశించి భంగపడిన ఈవెంట్ ఆర్చరీ!. ఆర్చరీలో ప్రపంచ శ్రేణి ఆర్చర్లను బరిలోకి నిలిపినా.. భారత్ ఇప్పటికీ ఒక్క పతకమూ సాధించలేదు. మిక్స్డ్ జట్టు, మెన్స్ విభాగాల్లో తీవ్ర నిరాశ ఎదురైంది. మహిళల రికర్వ్ విభాగంలో స్టార్ ఆర్చర్ దీపిక కుమారి ప్రీ క్వార్టర్స్‌కు చేరుకుని పతక ఆశలు సజీవంగా నిలిపింది. ప్రీ క్వార్టర్స్‌లో రష్యా (ఆర్ఓసీ) ఆర్చర్‌ను, క్వార్టర్ఫైనల్లో కొరియా ఆర్చర్‌ను దీపిక ఎదుర్కొవాల్సి ఉంటుంది. పురుషుల వ్యక్తిగత విభాగంలో తరుణ్‌దీప్ రారు, ప్రవీణ్ జాదవ్‌లు తొలి రౌండ్లో గొప్ప ఆరంభాలు సాధించినా.. తర్వాతి రౌండ్లలో విఫలమై ఇంటిముఖం పట్టారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో దీపిక కుమారి భర్త, స్టార్ ఆర్చర్ అటాను దాస్ అద్భుతమే చేశాడు. రెండు సార్లు ఒలింపిక్ చాంపియన్, డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ దక్షిణ కొరియా ఆర్చర్‌ను ఓడించి ప్రీ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు.
అద్భుతం : జట్టు విభాగంలో ఆశించిన ప్రదర్శన చేయలేకపోయిన అటాను దాసు వ్యక్తిగత విభాగంలో సంచలన విజయం సాధించాడు. ప్రపంచ చాంపియన్, రెండు సార్లు ఒలింపిక్ పసిడి పతక విజేత హౌ జిన్ హయక్ (దక్షిణ కొరియా)కు దిమ్మదిరిగే షాకిచ్చాడు. ఎలిమినేషన్ రౌండ్లో కొరియా ఆర్చర్‌ను ఓడించి ప్రీ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. ఐదు రౌండ్ల అనంతరం అటాను దాస్, హయక్లు 5-5తో సమవుజ్జీలుగా నిలిచారు. షూట్ ఆఫ్‌లో విజేతగా నిర్ణయించగా.. అటాను దాసు అద్భుతమే చేశాడు.
షూట్ ఆఫ్‌లో కొరియా ఆర్చర్ 9 స్కోరు చేయగా.. అటాను దాసు ఏకంగా పది స్కోరు సాధించాడు. కొరియా ఆర్చర్‌ను దాటేసి ముందుకు సాగాడు. వరుసగా ఐదు సిరీస్‌ల్లో 25-26, 27-27, 27-27, 27-22, 28-28లతో ఇద్దరు ఆర్చర్లు సమవుజ్జీలుగా నిలిచారు. అటాను, హయక్లు చెరో సిరీస్‌లో ఆధిక్యం సాధించగా.. మూడు సిరీస్‌ల్లో సమవుజ్జీలుగా నిలిచారు.