Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరాడి ఓడిన బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్
- క్వార్టర్స్‌లో హెవీవెయిట్ బాక్సర్ సతీశ్
నవతెలంగాణ-టోక్యో
ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, లండన్ ఒలింపిక్ మెడలిస్ట్ బాక్సింగ్ దిగ్గజం ఎంసీ మేరీకోమ్ కథ ముగిసింది. ఒలింపిక్ పసిడి వేటలో మేరీకోమ్ పోరాటానికి టోక్యోతో తెరపడింది!. మహిళల 51 కేజీల విభాగం ప్రీ క్వార్టర్ఫైనల్లో ఎంసీ మేరీకోమ్ పోరాడి ఓడింది. కొలంబియా బాక్సర్ ఇన్‌గ్రిట్ వెలెన్సియా చేతిలో 2-3తో పరాజయం పొందింది. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లలో స్వర్ణాలు కొల్లగొట్టిన ఎంసీ మేరీకోమ్.. ఒలింపిక్స్‌లో తను రెగ్యులర్‌గా బరిలో నిలిచే విభాగం అందుబాటులో లేకపోవటంతో వేరే విభాగంలో పోటీపడుతుంది. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన మేరీకోమ్.. వరుసగా రియో, టోక్యో ఒలింపిక్స్‌లలో నిరాశపరిచింది. 38 ఏండ్ల ఎంసీ మేరీకోమ్ ఒలింపిక్ పసిడి లక్ష్యంతో గొప్ప పోరాట స్ఫూర్తి ప్రదర్శించింది. ఐదుగురు న్యాయమూర్తులు 27-30, 28-29, 30-27, 28-27, 29-28తో ఎంసీ మేరీకోమ్‌కు ప్రతికూల ఫలితాన్ని వెలువరించారు. బాక్సింగ్ రింగ్‌లో మేరీకోమ్ రెండో రౌండ్ నుంచి అలసిపోయినట్టు కనిపించింది. కొలంబియా బాక్సర్ చురుగ్గా కదులుతూ, మేరీకోమ్‌ను డిఫెన్స్‌లోకి నెట్టింది. ఎంసీ మేరీకోమ్ వేగవంతమైన పంచ్‌లతో మెరిసినా.. స్వల్ప వ్యత్యాసంతో క్వార్టర్‌ఫైనల్స్ బెర్త్‌ను కోల్పోయి టోక్యో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది.
పురుషుల సూపర్ హెవీవెయిట్ విభాగంలో (91 ప్లస్ కేజీలు) బాక్సర్ సతీశ్ కుమార్ పంచ్ పడింది. ప్రీ క్వార్టర్ఫైనల్లో జమైకా బాక్సర్‌కు తన పంచ్ పవర్ చూపించిన సతీశ్ కుమార్ క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లాడు. రికార్డో బ్రౌన్పై 4-1తో ఎదురులేని విజయం నమోదు చేశాడు. రింగ్‌లో స్పష్టమైన ఆధిపత్యం చెలాయించిన సతీశ్ 30-27, 30-27, 28-29, 30-27, 30- 26తో నలుగురు న్యాయమూర్తుల స్పష్టమైన విజేతగా నిలిచాడు. క్వార్టర్ఫైనల్లో విజయం సాధిస్తే సతీశ్ కుమార్‌కు కనీసం కాంస్య పతకం ఖాయం కానుంది.