Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్లిచ్ఫిట్పై సాధికారిక విజయం
- నేడు యమగూచితో ఢీ
టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకం ఫేవరేట్‌గా బరిలోకి దిగిన తెలుగు తేజం, అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి సింధు పసిడి వేటలో కీలక అడుగు ముందుకు వేసింది. టోక్యోలో తొలిసారి నాణ్యమైన ప్రత్యర్థితో తలపడిన సింధు.. సాధికారిక విజయంతో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. మాజీ ప్రపంచ నం.1, జపాన్ సంచలనం అకానె యమగూచితో నేడు క్వార్టర్స్‌లో తలపడనుంది.
నవతెలంగాణ-టోక్యో
ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా నిలిచే అరుదైన ఘనతకు భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి షట్లర్ పూసర్ల వెంకట సింధు రెండు అడుగుల దూరంలో నిలిచింది. మహిళల సింగిల్స్ నాకౌట్ దశలో డెన్మార్క్ షట్లర్‌పై సాధికారిక విజయం నమోదు చేసిన సింధు.. ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. వరల్డ్ నం.12 డెన్మార్క్ షట్లర్ మియా బ్లిచ్ఫిట్పై 21-15, 21-13తో సింధు వరుస గేముల్లోనే గెలుపొందింది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకానికి రెండు విజయాల చేరువలో ఉంది. క్వార్టర్ఫైనల్లో జపాన్ షట్లర్, వరల్డ్ నం.5 అకానె యయగూచితో సింధు తలపడనుంది. క్వార్టర్స్‌లో విజయం సాధిస్తే.. సెమీఫైనల్లో పరాజయం పొందినా కాంస్య పతక పోరుకు అవకాశం ఉంటుంది. సెమీఫైనల్లో విజయం సాధిస్తే ఎలాగూ కనీసం రజతం లాంఛనమే. భారీ అంచనాలతో టోక్యోకు చేరుకున్న పి.వి సింధు రెండు విజయాలు సాధిస్తే కచ్చితమైన పతకం, మూడు విజయాలు సాధిస్తే ఏకంగా స్వర్ణ పతకాన్నే ముద్దాడనుంది.
ఆల్‌రౌండ్ ప్రదర్శన : ప్రీ క్వార్టర్ఫైనల్లో పి.వి సింధు ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది. సహజంగా సింధు అటాకింగ్ ఆటతో ప్రత్యర్థులను చిత్తు చేయటంలో దిట్ట. క్వార్టర్ఫైనల్లో ప్రత్యర్థిని గమనంలో ఉంచుకుని ఎక్కువగా ర్యాలీలు, ప్లేస్‌లతో పాయింట్లు సాధించటంపై దృష్టి నిలిపింది. ' తొలి గేమ్‌ను మెరుగ్గా మొదలు పెట్టాను. తొలి గేమ్‌లో ఎక్కువగా డిఫెన్స్‌పై దృష్టి సారించాను. నేను తప్పుడు వ్యూహంతో ఆడుతున్నానని కోచ్ చెప్పారు. రెండో గేమ్‌లో అది సరిదిద్దుకున్నాను. ఆధిక్యం నిలుపుకుంటూ, మ్యాచ్‌ను అదుపులోనే ఉంచుకున్నాను' అని మ్యాచ్ అనంతరం పి.వి సింధు పేర్కొంది. ' ఒత్తిడిలో, నాణ్యమైన ప్రత్యర్థిపై అత్యుత్తమంగా రాణిస్తానని చాలా మంది నాతో చెబుతారు. దాన్ని ప్రశంసగా తీసుకుంటాను. కానీ నాకు ప్రతి మ్యాచ్ ప్రధానమే. మ్యాచ్ కంటే ముఖ్యంగా ప్రతి పాయింట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను' అని సింధు తెలిపింది.
టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారి నాణ్యమైన ప్రత్యర్థితో తలపడిన సింధు.. గేమ్‌ను కాస్త నెమ్మదిగానే ఆరంభించింది. నెట్ దగ్గర పాయింట్లు, హాఫ్ స్మాష్‌లు, డ్రైవ్‌లకు ప్రాధాన్యత ఇచ్చింది. 8-4 ఆధిక్యం అనంతరం.. విరామ సమయానికి 11-6తో నిలిచింది. ద్వితీయార్థంలో బ్లిచ్ఫిట్ పుంజుకుంది. 11-13తో అంతరాన్ని తగ్గించింది. 15-16తో సింధుకు పోటీనిచ్చింది. ఆఖర్లో మియా తప్పిదాలను సొమ్ముచేసుకున్న సింధు తొలి గేమ్‌ను గెల్చుకుంది. రెండో గేమ్‌ను దూకుడుగా మొదలుపెట్టిన సింధు 5-0 ఆధిక్యం సాధించింది. ఓ దశలో 16-11తో సింధు తిరుగులేని స్థితిలో కొనసాగింది. రెండో గేమ్‌లో ఒత్తిడిలో పడిన బ్లిచ్ఫిట్.. మూడో గేమ్‌కు వెళ్లే ఆటను ప్రదర్శించలేదు. వరుస గేముల్లో గెలుపొందిన సింధు అలవోకగా క్వార్టర్ఫైనల్లో కాలుమోపింది.
తస్మాత్ జాగ్రత్త! : 15 ఏండ్ల వయసులోనే జాతీయ జట్టులోకి ఎంపికైన అకానె యమగూచి ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. సింధు, అకానెలు ముఖాముఖి 18 మ్యాచుల్లో తలపడ్డారు. అందులో 11 సార్లు తెలుగు తేజం స్పష్టమైన ఆధిపత్యం చెలాయించింది. ఏడు మ్యాచుల్లో జపాన్ అమ్మాయి గెలుపొందింది. చివరగా ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్ సెమీస్‌లోనూ యమగూచిపై సింధు విజయం సాధించింది. ఒలింపిక్స్‌లో భిన్నమైన ఆట తీరు ప్రదర్శించే జపాన్ షట్లర్ సింధుకు అత్యంత ప్రమాదకారి. దూకుడు, టెక్నిక్, సహనం, ఫిట్నెస్, వ్యూహం కలిస్తే గానీ యమగూచిపై పైచేయి సాధించలేం. సుదీర్ఘ ర్యాలీలు నమోదు కానున్న మ్యాచ్ మూడు గేములు సాగే అవకాశం ఉంది.