Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వార్టర్స్‌లో భారత జట్టు
- షూటింగ్లో మెరిసిన మను భాకర్
నవతెలంగాణ-టోక్యో
41 ఏండ్ల ఒలింపిక్ సెమీఫైనల్స్ నిరీక్షణకు ముగింపు పలికేందుకు కంకణం కట్టుకున్న మన్‌ప్రీత్ సింగ్సేన.. అందుకు తగినట్టు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. ఒలింపిక్ చాంపియన్, రియో పసిడి విజేత అర్జెంటీనాపై మెరుపు విజయంతో టోక్యో ఒలింపిక్స్ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. 3-1తో గెలుపొందిన భారత్.. గ్రూప్ దశలో మరో మ్యాచ్ ఉండగానే క్వార్టర్‌ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఆస్ట్రేలియా చేతిలో దారుణ ఓటమి అనంతరం వరుసగా స్పెయిన్, అర్జెంటీనాలపై విజయాలు నమోదు చేసి.. ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా క్వార్టర్స్‌కు చేరుకుంది. కోవిడ్-19 కారణంగా ఇద్దరు అదనపు ఆటగాళ్లను వినియోగించుకునే వెసులుబాటును భారత జట్టు వినియోగించుకుంది. ప్రత్యామ్నాయ ఆటగాళ్లు మిడ్ఫీల్డ్ర్ వరుణ్ కుమార్, డిఫెండర్ సిమ్రన్‌జిత్ సింగ్‌లు అర్జెంటీనాతో మ్యాచ్ బరిలోకి దిగారు. తొలి క్వార్టర్లో వరుణ్ మెరుపు గోల్‌తో భారత్‌ను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. తర్వాతి క్వార్టర్లలో భారత్ ఆధిపత్యం కనిపించినా.. మరో గోల్ నమోదు కాలేదు. చివరి క్వార్టర్ ఆఖర్లో గోల్ కొట్టి స్కోరు సమం చేసిన అర్జెంటీనా భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. ఆఖర్లో మరో రెండు గోల్స్ కొట్టిన భారత్ అద్వితీయంగా పుంజుకుంది. 58వ నిమిషంలో వివేక్ ప్రసాద్ గోల్ కొట్టగా.. పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచాడు. 3-1తో భారత్ ఒలింపిక్ చాంపియన్‌పై విజయం సాధించింది.
టాప్-5లో మను భాకర్ : షూటింగ్లో పతకాల కొరత తీరేలా కనిపిస్తోంది!. మహిళల 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో మను భాకర్ మెరిసింది. ప్రిసిషన్ అర్హత రౌండ్లో ఐదో స్థానంలో నిలిచింది. 30 షాట్లలో 22 సార్లు 10 పాయింట్లు స్కోరు చేసింది. మూడు సిరీస్‌ల్లో వరుసగా 97, 97, 98తో 292 పాయింట్లు చేసింది. చివరి ఐదు షాట్లకు 10 స్కోరు చేసి ఔరా అనిపించింది. మరో షూటర్ రాహి 96, 97, 94తో 287 పాయింట్లు సాధించి 25వ స్థానంలో నిలిచింది. 40 మంది షూటర్లు పోటీపడే ఈ విభాగంలో నేడు ర్యాపిడ్ అర్హత రౌండ్ అనంతరం ఫైనల్స్ జరుగనుంది. మను, రాహిలకు ఫైనల్స్‌కు చేరుకునే అవకాశం ఉంది. రోయింగ్ మెన్స్ లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్‌లో భారత్ ఓవరాల్‌గా 11వ స్థానంలో నిలిచింది. 2000 మీటర్లను రోయర్లు అర్జున్, అరవింద్ జోడీ 6:29.66 సమయంలో పూర్తి చేసి గ్రూప్‌లో ఐదో స్థానంలో నిలిచారు. మెన్స్ 100 మీటర్ల బటర్‌ఫ్లై స్విమ్మింగ్‌లో సాజన్ ప్రకాశ్ హీట్స్ దశ దాటలేదు.