Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్‌లో కాలుమోపిన స్టార్ షట్లర్
- క్వార్టర్స్‌లో యమగూచిపై ఉత్కంఠ విజయం
- పతకానికి ఓ గెలుపు దూరంలో తెలుగు తేజం
పి.వి సింధు చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో వరుసగా రెండుసార్లు సెమీఫైనల్లోకి ప్రవేశించిన తొలి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా నిలిచింది. నాలుగో సీడ్, ఆతిథ్య జపాన్ షట్లర్ అకానె యమగూచితో ఉత్కంఠ క్వార్టర్ఫైనల్లో అసమాన ప్రదర్శన చేసింది. వరుస గేముల్లోనే మెరుపు విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. వరుసగా రెండో ఒలింపిక్ పతకానికి సింధు ఒక్క విజయం దూరంలోనే నిలిచింది.
నవతెలంగాణ-టోక్యో
మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో ఆరో సీడ్ పి.వి సింధు మ్యాచ్ ఆసాంతం ఆధిక్యంలో కొనసాగింది. రెండో గేమ్ ద్వితీయార్థంలో గొప్పగా పుంజుకున్న జపాన్ షట్లర్ అకానె యమగూచి (4) మ్యాచ్‌ను మూడో గేమ్‌కు తీసుకెళ్లేందుకు అసమాన ప్రయత్నం చేసింది. ఒత్తిడిలో పడిన తెలుగు తేజం పి.వి సింధు రెండో గేమ్‌ను కోల్పోయినట్టే కనిపించింది!. రెండుసార్లు గేమ్ పాయింట్‌ను కాచుకున్న సింధు.. జపాన్ అమ్మాయి పోరాటానికి తెరదించుతూ స్మాష్ కొట్టింది. వరుస గేముల్లో గెలుపొంది సెమీఫైనల్లోకి ప్రవేశించింది. అకానె యమగూచి ఓటమితో మహిళల సింగిల్స్‌లో ఆతిథ్య జపాన్ పతక ఆశలకు తెరపడింది. 21-13, 22-20తో 56 నిమిషాల ఉత్కంఠ మ్యాచ్‌లో విజయం సాధించిన సింధు.. నేడు సెమీ సమరానికి సిద్ధం కానుంది. రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన సింధు.. టోక్యోలో మరో విజయం సాధిస్తే పతకం ఖాయం చేసుకోనుంది. నేడు సెమీస్‌లో విజయం సాధిస్తే కనీసం రజతం లాంఛనం కానుండగా.. ఓడినా, కాంస్య పతక పోరులో మరో అవకాశం లభించనుంది.
కండ్లుచెదిరే ప్రదర్శన : మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన సింధు.. అంచనాలను అందుకుంది. యమగూచితో ముఖాముఖి పోరులో 11-7తో తిరుగులేని ఆధిక్యంతో ఉన్న సింధు.. క్వార్టర్స్ విజయంతో గణాంకాలను 12-7కు మెరుగుపర్చుకుంది. తొలి గేమ్ ఆరంభంలో ఆధిక్యం రుచి చూసిన అకానె యమగూచి.. సింధు దూకుడుకు తేలిపోయింది. 3-5తో వెనుకంజ వేసిన సింధు..7-6తో ఆధిక్యంలోకి వచ్చింది. వరుసగా నాలుగు పాయింట్లు సాధించి విరామ సమయానికి 11-7తో మంచి ఆధిక్యంలో నిలిచింది. యయగూచిని డిఫెన్స్‌లోకి నెట్టిన సింధు.. అటాకింగ్ గేమ్‌తో మెరిసింది. 18-11తో తొలి గేమ్‌ను లాంఛనం చేసుకుంది. నిరాశలోకి జారుకున్న యమగూచి తొలి గేమ్‌లో పోరాటానికి అక్కడితో చాలించింది. రెండో గేమ్‌లోనూ సింధు దూకుడు కొనసాగింది. ఒత్తిడిలో ఎక్కువగా కోర్టు బయటకు షాట్లు కొట్టిన యమగూచి విలువైన పాయింట్లు సమర్పించుకుంది. 5-3తో ఆరంభ ఆధిక్యం సాధించిన సింధు.. 10-5తో ముందంజలోనే నిలిచింది. ద్వితీయార్థంలో 14-8తో దూసుకెళ్లిన సింధు.. ఇక మ్యాచ్‌ను సొంతం చేసుకోవటం లాంఛనమే అనిపించింది. ఈ దశలో పుంజుకున్న యమగూచి అద్వితీయ ఆటతీరు ప్రదర్శించింది. వరుసగా పాయింట్లు కొల్లగొట్టింది. 15-15తో స్కోరు సమం చేసిన యయగూచి కీలక ఆధిక్యం సాధించింది. 18-20తో సింధు వెనుకంజలో నిలిచింది. యమగూచిని రెండసార్లు గేమ్ పాయింట్ వద్ద నిలువరించిన సింధు.. 19-20, 20-20తో స్కోరు సమం చేసింది. స్కోరు సమం చేసిన సింధు.. తిరిగి దూకుడు అందుకుంది. 33 నిమిషాల రెండో గేమ్‌ను 22-20తో సొంతం చేసుకుంది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
నం.1 సవాల్! : ఒలింపిక్ పసిడి వేటలో సింధు ముందు నేడు మరింత కఠిన సవాల్. ప్రపంచ నం.1, రెండో సీడ్ తైజుయింగ్ (చైనీస్ తైపీ)తో సింధు నేడు మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో తలపడనుంది. తైజుయింగ్, సింధు ముఖాముఖి గణాంకాలు భారత షట్లర్‌కు ప్రతికూలంగా ఉన్నాయి. చైనీస్ తైపీ షట్లర్ సింధుపై 13 మ్యాచుల్లో విజయాలు సాధించిచగా.. తైజుయింగ్పై తెలుగు తేజం ఐదు మ్యాచుల్లోనే నెగ్గింది. రియోలో సింధు రజతం సాధించగా.. తైజుయింగ్ ఖాతాలో ఒలింపిక్ మెడల్ లేదు. రియో ఒలింపిక్స్ ప్రీ క్వార్టర్ఫైనల్లో తైజుయింగ్పై విజయంతోనే సింధు క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. టోక్యోలో పసిడిపై కన్నేసిన తైజుయింగ్ మరోసారి రియోలో ఓడించిన ప్రత్యర్థి నుంచి ఆరంభించనుంది!.