Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వార్టర్స్ విజయంతో మెడల్ ఖాయం
- సెమీస్‌లోకి చేరుకున్న యువ బాక్సర్ బొర్గొహైన్
నవతెలంగాణ-టోక్యో
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం ఖాయమైంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి తొలి పతకం తీసుకురాగా.. బాక్సింగ్‌లో లవ్లీనా బొర్గొహైన్ భారత్‌కు రెండో పతకం పట్టుకురానుంది. మహిళల వెల్టర్ క్వార్టర్ఫైనల్లో (69 కేజీల విభాగం) లవ్లీనా బొర్గొహైన్ (23) పతక పంచ్ విసిరింది. వరల్డ్ నం.5 చైనీస్ తైపీ బాక్సర్ చెన్ నిన్ చిన్‌పై పిడి గుద్దుల వర్షం కురిపించి ఒలింపిక్ మెడల్ సాధించిన మూడో భారత బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది. బాక్సర్ విజేందర్ సింగ్ (2008 బీజింగ్ ఒలింపిక్స్), బాక్సింగ్ దిగ్గజం ఎంసీ మేరీకోమ్ (2012 లండన్ ఒలింపిక్స్) విశ్వ క్రీడల్లో కాంస్య పతకాలు సాధించారు. ఇప్పుడు ఈ జాబితాలోకి లవ్లీనా బొర్గొహైన్ చేరుకుంది. సెమీఫైనల్లో ప్రవేశంతో కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకున్న లవ్లీనా బొర్గొహైన్..బుధవారం జరుగనున్న సెమీ సమరంలో టర్కీ ప్రపంచ చాంపియన్ బాక్సర్‌ను ఎదుర్కొనుంది. వరుసగా 5-0, 5-0 విజయాలతో సెమీస్‌కు చేరుకున్న బుసానెజ్ సర్మెనిల్ టోక్యోలో పసిడి ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. పోరాడితే పోయేదేముంది.. స్ఫూర్తితో లవ్లీనా రింగ్‌లోకి దిగుతున్నట్టు తెలిపింది.
పంచ్ అదిరింది.. పతకం వచ్చింది : 23 ఏండ్ల లవ్లీనా బొర్గొహైన్ టోక్యో ఒలింపిక్స్‌లో ప్రభంజనం సృష్టించింది. అంచనాలు లేకుండా ఒలింపిక్స్‌కు వచ్చిన లవ్లీనా.. అరంగేట్రంలోనే అదిరే పంచ్ ఇచ్చింది. క్వార్టర్ఫైనల్లో లవ్లీనా ప్రీ బౌట్ ఫేవరేట్ కాదు!. చైనీస్ తైపీ బాక్సర్ చెన్ నిన్ చిన్తో తలపడిన మూడు బౌట్లలోనూ లవ్లీనా పరాజయం పాలైంది. దీంతో క్వార్టర్స్ బౌట్లో స్పష్టంగా వరల్డ్ నం.5 ఫేవరేట్‌గా బరిలో నిలిచింది. ' చెన్ నిన్ చిన్ చేతిలో మూడుసార్లు ఓడిపోయాను. గతంలో ఆమెతో బౌట్‌కు ముందు ఎంతో ప్రణాళికలు చేసుకుని ఆడాను. ఆమె గేమ్, అటాకింగ్ స్టయిల్ నాకు తెలుసు. ఈ బౌట్‌కు నా వ్యూహంలో మార్పులు చేసుకున్నాను. కౌంటర్ కోసం ఎదురుచూడకుండా.. నేను దాడి చేయాలని నిర్ణయించుకున్నాను. క్వార్టర్స్ బౌట్లో ఎటువంటి వ్యూహం లేదు. నేను ప్రణాళికతో వెళితే ఆమెకు తెలిసిపోతుంది. ప్రత్యర్థి కంటే మెరుగ్గా ఆడాలనేది ప్రధాన ప్రణాళిక. పరిస్థితులను అదుపులో ఉంచుకుంటాననే విశ్వాసం నాకు ఉంది. గత ఎనిమిదేండ్లుగా ఈ విజయం కోసమే శ్రమించాను' అని లవ్లీనా తెలిపింది.
చైనీస్ తైపీ బాక్సర్ కంటే ఎత్తు ఉన్న లవ్లీనా.. ఆ సానుకూలతను సద్వినియోగం చేసుకుంది. బౌట్ ఆరంభ గంట మోగిన క్షణం నుంచి ఆఖరు క్షణం వరకు లవ్లీనా ఆధిపత్యం చూపించేందుకు ఉత్సాహంతో కదిలింది. ఆల్‌రౌండ్ అటాకింగ్ నైపుణ్యంతో మెరిసింది. ఐదుగురు న్యాయమూర్తుల మన్నన పొందిన లవ్లీనా బొర్గొహైన్ 4-1తో విజయం సాధించింది. తొలి రౌండ్లో 30-27, రెండో రౌండ్లో 29-28, మూడో రౌండ్లో 28-29, నాలుగో రౌండ్లో 30-27, ఐదో రౌండ్లో 30-27తో దుమ్మురేపింది. తొలి రౌండ్లో లవ్లీనాకు ముగ్గురు న్యాయమూర్తులు అధిక మార్కులు ఇవ్వగా.. రెండో రౌండ్లో ఏకంగా ఐదుగురు న్యాయమూర్తులు లవ్లీనా పంచ్‌లకు ముగ్ధులయ్యారు. మూడో రౌండ్లో నలుగురు న్యాయమూర్తులు లవ్లీనాను స్పష్టమైన విజేతగా ఎంచుకున్నారు.
నా జీవితంలో
అతి పెద్ద రోజు ఇది. ఒలింపిక్ పతకం కోసం ఇక్కడికి వచ్చాను. ఒలింపిక్ పతకం సాధించాను. ఇప్పుడు నేను మరింత స్వేచ్ఛగా బరిలోకి దిగుతాను. పసిడి కోసం పట్టుదలగా ప్రయత్నిస్తాను'
- లవ్లీనా బొర్గొహైన్