Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రీ క్వార్టర్స్‌లో ఓడిన బాక్సర్
- పూజ రాణి సైతం పరాజయం
- ఆర్చర్ అటాను దాస్ నిష్క్రమణ
నవతెలంగాణ-టోక్యో
2020 ఒలింపిక్స్ ఎనిమిదో రోజు భారత్‌కు నిరాశజనక ఫలితాలే వచ్చాయి. పతకం ఖాయం అనుకున్న వరల్డ్ నం.1 బాక్సర్ అమిత్ పంఘాల్కు ప్రీ క్వార్టర్స్ బౌట్లో అనూహ్య పరాజయం ఎదురైంది. మరో మహిళా బాక్సర్ పూజ రాణి పోరాటానికి సైతం క్వార్టర్ఫైనల్లోనే తెరపడింది. ఆశలు రేపిన ఆర్చర్ అటాను దాస్ ప్రీ క్వార్టర్స్ పోరులో ఆతిథ్య జపాన్ విలుకాడి చేతిలో ఓటమి చెందాడు. టాప్ సీడ్‌గా 52 కేజీల విభాగంలో బరిలోకి దిగిన అమిత్ పంఘాల్ తొలి ఒలింపిక్ పోరు అనుకున్న రీతిలో సాగలేదు. రియో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్, పాన్ పసిఫిక్ చాంపియన్ మార్టినెజ్ చేతిలో పంఘాల్ 1-4తో ఓటమి చెందాడు. అమిత్ బాడీని లక్ష్యంగా చేసుకుని అప్పర్ కట్లతో రెచ్చిపోయిన కొలంబియా బాక్సర్.. టాప్ సీడ్‌కు షాకిచ్చాడు. తొలి రౌండ్లో అమిత్ 10-9, 10-9, 9-10, 10-9, 10-9తో పైచేయి సాధించాడు. కానీ తర్వాతి రెండు రౌండ్లలో అమిత్ ఆకట్టుకోలేదు. మిగతా రెండు రౌండ్లలో ఐదుగురు న్యాయమూర్తులు కొలంబియా బాక్సర్‌కు అనుకూలంగా నిలిచారు. 29-28, 27-29, 27-30, 28-29, 28-29తో అమిత్ ఓటమిచెందాడు. మహిళల 69 కేజీల విభాగంలో పూజ రాణి 1-4తో నిష్క్రమించింది. మూడు రౌండ్లలోనూ చైనా బాక్సర్ లీ కియన్ ఆధిపత్యం చూపించి 5-0తో సెమీఫైనల్లోకి చేరుకుంది. ఆర్చర్ అటాను దాస్ నిరాశపరిచాడు. రెండు సార్లు ఒలింపిక్ పసిడి విజేత కొరియా ఆర్చర్‌పై నెగ్గిన అటాను దాస్.. ప్రీ క్వార్టర్స్‌లో జపాన్ ఆర్చర్‌కు తలొగ్గాడు. తొలి సిరీస్‌లో రెండు సార్లు 8 స్కోరు చేసిన అటాను.. అక్కడే క్వార్టర్స్ బెర్త్ కోల్పోయాడు. 25-27, 28-28, 28-27, 28-28, 26-27తో జపాన్ ఆర్చర్ టకహరు క్వార్టర్స్‌కు చేరుకున్నాడు.
పురుషుల లాంగ్‌జంప్‌లో శ్రీశంకర్ అర్హత రౌండ్ దాటలేదు. 7.69 మీటర్లతో 13వ స్థానానికి పరిమితమయ్యాడు. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ విభాగంలో భారత షూటర్లు విఫలమయ్యారు. అంజుమ్ 1167 పాయింట్లతో 15వ స్థానంలో, తేజస్విని 1154 పాయింట్లతో 33వ స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించలేదు.